డోలీగా కట్టిన మావోల మృతదేహాలు
సాక్షి, అమరావతి/సీలేరు (పాడేరు) : విశాఖ ఏజెన్సీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాదిగమళ్లు అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగి ఒక్క రోజు కూడా గడవకముందే సోమవారం మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఆదివారం తప్పించుకున్న మావోయిస్టులు లక్ష్యంగా పోలీసులు కూంబింగ్ జరుపుతుండగా ఎదురు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. పేములగొండి గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఎదురు కాల్పులు జరిగాయి. ఇద్దరు మావోలు మృతి చెందినట్లు, మూడు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ సవాంగ్ సోమవారం రాత్రి ప్రకటించారు.
అయితే మృతి చెందిన వారిని ఇంకా గుర్తించలేదు. రెండు రోజుల వ్యవధిలో అయిదుగురు మావోలు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారని తెలిపారు. పట్టుబడ్డ ఆయుధాల్లో ఏకే 47 ఉండటంతో మృతుల్లో మావో అగ్రనేత ఉండి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆదివారం ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారిని ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు చెందిన బుద్రి, విమల, అజయ్‌గా గుర్తించారు.
ఎన్‌కౌంటర్‌తో ప్రతీకార దాడులు
ఆది, సోమవారాల్లో విశాఖ ఏజెన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోలు ప్రతీకార దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఏజెన్సీలో ప్రజాప్రతినిధులు బందోబస్తు లేకుండా తిరగవద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఎన్‌కౌంటర్ అనం తరం తాజా పరిణామాలపై విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల ఎస్పీలతోపాటు గ్రేహౌండ్స్, ప్రత్యేక బలగాలకు నేతృత్వం వహిస్తున్న అధికారులతో డీజీపీ సోమవారం టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు.
ఇదిలాఉండగ.. సోమవారం జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేతలు అరుణక్క, జగన్ తప్పించుకున్నారని విశాఖ జిల్లా ఎస్పీ అట్టాడ బాపూజీ వెల్లడించారు. ధారకొండ అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోందని తెలిపారు. ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు, సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మవోయిస్టులు మృతి చెందారని చెప్పారు. రెండు సార్లు జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నారని ఎస్పీ పేర్కొన్నారు. రెండోసారి జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందినది ఇద్దరూ పురుషులేనని అన్నారు. వారు చత్తీస్‌గఢ్ ప్రాంతీయులుగా అనుమానం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment