ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
ఒకరు కొయ్యూరు ఏరియా కమిటీ సభ్యురాలు మరొకరు దళ సభ్యుడు
విశాఖపట్నం: సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం విశాఖ జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ ఎదుట లొంగిపోయారు. వీరిలో ఒకరు ఏరియా కమిటీ సభ్యురాలు గెమ్మెలి బందో అలియాస్ కమల అలియాస్ రస్సో కాగా.. మరొకరు దళ సభ్యుడు వంతల సాయి అలియాస్ బాలయ్య. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న కమలపై రూ.4 లక్షలు, సాయిపై రూ. లక్ష రివార్డు ఉన్నాయి. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ తూములోవ గ్రామానికి చెందిన కమల ఏఓబీ ఎస్‌జెడ్‌సీ పరిధిలోని కోరాపుట్ డివిజన్ జెఎన్‌ఎమ్ ఏరియా కమిటీ సభ్యురాలు. 2007 ఏప్రిల్‌లో ఆర్మ్‌డ్ మిలీషియా సభ్యురాలిగా గాలికొండ దళంలో చేరి పలు హింసాత్మక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంది. తర్వాత 2010 వరకు కలిమెల దళ సభ్యురాలిగా రస్సో పేరుతో పనిచేసింది. 2010 జూన్ నుంచి 2013 వరకూ మల్కన్‌గిరి ఏరియాలో జననాట్య మండలిలో పని చేసింది. 2013-15 మధ్య కోరాపుట్-నారాయణపట్నం డివిజన్‌లో పనిచేస్తున్న సమయంలో ఆ డివిజన్ కమిటీ సభ్యుడైన సునీల్ అలియాస్ రైనాతో ఆమెకు వివాహం జరిగింది. 2015 తర్వాత అనారోగ్యానికి గురై దళం నుంచి బయటకు వచ్చేందుకు ఎస్‌జెడ్‌పి మెంబరైన ‘దయ’ను అడిగితే నిరాకరించడంతో నాలుగు నెలల క్రితం రహస్యంగా బయటకు వచ్చేసింది.
2010 జూలైలో కోరాపుట్ జిల్లా నారాయణపట్న బ్లాక్ సామాన గ్రామం ప్రాంతంలో, 2013 నవంబర్‌లో పనికి గ్రామం వద్ద పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో కమల పాల్గొంది. 2014లో దిగువ గొల్లూరు అమ్మావాలి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఇద్దరు గ్రామస్తుల హత్య ఘటనలోనూ ఈమె ప్రమేయం ఉందని ఎస్పీ ప్రవీణ్ తెలిపారు. ఇక జి.కె.వీధి పంచాయతీకి చెందిన వంతల సాయి గాలికొండ దళ సభ్యుడు మోహన్ ప్రోద్బలంతో 2014లో ఆర్మ్‌డ్ మిలీషియాలో చేరాడు. ఆరు నెలల తర్వాత దళంలోకి సెంట్రీగా వచ్చాడు. కానీ అక్కడి పరిస్థితులను చూసి ఆరు నెలల క్రితం ఎవరికీ చెప్పకుండా బయటకు వచ్చేశాడు.