రైలు ఢీకొని ఇద్దరి మృతి
Published Mon, Sep 16 2013 3:25 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM
మధిర, న్యూస్‌లైన్ :రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన మధిరలో విషాదం నింపింది. గుర్తుతెలియని ఓ వృద్ధుడు మధిర రైల్వేగేటువద్ద పట్టాలు దాటుతున్న సమయంలో చెన్నై నుంచి నిజాముద్దీన్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ అత్యంత వేగంగా వస్తోంది. గమనించని వృద్ధుడు అలానే వెళ్తుండడంతో మాటూరుపేట గ్రామానికి చెందిన ముదిగొండ అప్పారావు (37) అనే ఉపాధ్యాయుడు అతడిని రక్షించబోయాడు. అయితే అప్పటికే రైలు అక్కడికి చేరుకోవడంతో ఇద్దరినీ ఢీకొట్టగా, అక్కడికక్కడేమృతి చెందారు. అప్పారావు మాటూరు హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ మధిరలోని లడకబజారులో నివసిస్తున్నారు. మృతుడికి భార్య రాజ్యలక్ష్మి, కుమారుడు ధర్మతేజ ఉన్నారు.
కుమారుడి పుట్టినరోజు నాడే...: అప్పటివరకూ కుమారుడి పుట్టినరోజు వేడుకలను ఉత్సాహంగా నిర్వహించిన అప్పారావు.. ఆ సందర్భంగా తయారుచేసిన పిండివంటలను మాటూరుపేటలో ఉంటున్న తన తల్లిదండ్రులకు ఇచ్చి వెంటనే తిరిగి వస్తానని భార్య, కుమారుడితో చెప్పి బయలుదేరాడు. ఇంటినుంచి స్టేషన్‌కు రాగానే రైలు ప్రమాద రూపంలో అతడిని మృత్యువు కబళించింది. ‘ నా పుట్టిన రోజు నాడే మమ్మల్ని వదిలి వెళ్లావా నాన్నా..’ అంటూ కుమారుడు ధర్మతేజ విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. మానవతాదృక్పథంతో వృద్ధుడిని రక్షించబోయి తానే అనంతలోకాలకు వెళ్లాడని కుటుంబసభ్యులు, మిత్రులు విలపిస్తున్నారు.
అప్పారావు మృతి సమాచారం తెలియగానే మాటూరుపేట గ్రామస్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. పాఠశాలలో అందరితో కలివిడిగా ఉండేవాడని, ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండేవాడని సహచర ఉపాధ్యాయులు రోదిస్తూ చెప్పారు. కష్టపడి ఉద్యోగం సాధించి...: సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన అప్పారావు కష్టపడి చదివి 2000 డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. మొదట ఎర్రుపాలెం మండలం మొలుగుమాడు ప్రాథమికోన్నత పాఠశాలలో చేరిన ఆయన 2009 వరకు అక్కడే పనిచేశారు. ఆ తర్వాత మాటూరుపేటకు బదిలీ అయ్యారు.
పలువురి సంతాపం : అప్పారావు మృతిపట్ల పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయులు సంతాపం ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క ఫోన్‌లో ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వ పరంగా సహాయం అందజేస్తామని చెప్పారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సెవాదళ్ రాష్ట్ర కమిటీ సభ్యులు దారెల్లి అశోక్ అప్పారావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు అప్పారావు మృతదేహాన్ని సందర్శించి సంతాపం ప్రకటించారు.
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతదేహాన్ని సందర్శించినవారిలో ఎంఈఓ అనుమోలు భాస్కర్‌రావు, పీఆర్‌టీయూ రాష్ట్ర నాయకులు బి.వెంకటేశ్వరరావు, ఆర్.రంగారావు, ఎల్.మోహన్‌రెడ్డి, రవికుమార్, రఫీ, యూటీఎఫ్ జిల్లా నాయకులు టి.ఆంజనేయులు, ఆర్ బ్రహ్మారెడ్డి, ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్. విజయ్ తదితరులున్నారు. మృతుడి భార్య రాజ్యలక్ష్మి కూడా బీఈడీ పూర్తి చేశారని, ఉన్నతాధికారులు మానవతా ధృక్పథంతో ఆమెకు ఉద్యోగం ఇవ్వాలని వారు కోరారు.
మృతదేహానికి పోస్టుమార్టం ...: సంఘటనా స్థలం వద్ద మధిర రైల్వే హెడ్‌కానిస్టేబుల్ బాలస్వామి పంచనామా నిర్వహించి కేసు నమోదుచేశారు. అప్పారావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మాటూరుపేట తరలించారు. కాగా, వృద్ధుడి మృతదేహాన్ని రైలు సుమారు అరకిలోమీటర్ దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో శరీరం ముక్కలు ముక్కలుగా అయి గుర్తించడానికి కూడా వీలు లేకుండా పోయింది.
Advertisement