సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిద్దరూ ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉండటం కాసింత ఊరటనిచ్చే అంశం. కాకపోతే వారిలో ఒకరు చెన్నై నుంచి వచ్చిన వ్యక్తి కావడం ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబేడు మార్కెట్ కరోనా వ్యాప్తికి కేంద్రమవడంతో జిల్లాకు చెన్నై టెన్షన్ మొదలైంది. జిల్లాలో ఇదివరకు ఐదు కేసులు నమోదు కాగా వారిలో నలుగురు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు నమోదు కాకపోవడంతో నిశ్చితగా ఉన్న దశలో మరో రెండు కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. (ఈ విషయం అధికారికంగా ప్రకటించాల్సివుంది) వీరిలో ఒకరు పాతపట్నం మండలం కాగువాడలో తొలి నాలుగు పాజిటివ్ కేసులు వచ్చిన కుటుంబం పక్కింట్లో ఉంటున్న మహిళ. వారి కాంటాక్ట్‌గా నిర్ధారౖణెంది. అప్పటి నుంచి ఆమె ఎచ్చెర్లలో ని క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఆమెకు పాజిటివ్ రాకపోయి ఉంటే బుధవారం డిశ్చార్జ్ అయిపోయేవారు. కానీ ఈలోపు నిర్ధారణ రావడంతో ఆ క్వారంటైన్ బ్లాకులో ఉన్న వారంతా మళ్లీ కొన్నాళ్లు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
మరొకరు చెన్నై నుంచి వచ్చిన వలస కార్మికుడు చెన్నై నుంచి వచ్చి సరుబుజ్జిలి మండలం రొట్టవలస క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. అతను చెన్నై నుంచి వచ్చినప్పుడు రాజమహేంద్రవరంలో అడ్డుకుని అక్కడ కొన్నాళ్లు క్వారంటైన్‌లో పెట్టారు. పరీక్షించగా నెగిటివ్ రావడంతో అక్కడ నుంచి వదిలేశారు. జిల్లాకొచ్చాక మన అధికారులు ముందు జాగ్రత్తగా ఆయన్ని సరుబుజ్జిలిలోని రొట్టవలస ఇన్‌స్టిట్యూషన్ క్వారంటైన్‌లో పెట్టారు. కోయంబేడు మార్కెట్ వ్యవహారం బయటికి రావడంతో అప్రమత్తమైన అధికారులు చెన్నై నుంచి వచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో అతనికి పాజిటివ్ వచ్చింది. ఆయన ఉన్న బ్లాకులో పెట్టిన మిగతా వారికి నెగిటివ్ రావడం ఊరట కలిగించింది. అయినప్పటికీ అందరినీ క్వారంటైన్‌లోనే ఉంచారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తిది రేగిడి ఆమదావలసం మండలం. పాజిటివ్ వచ్చిన ఇద్దరూ క్వారంటైన్‌లో ఉండడంతో వారి స్వస్థలాలను కంటెయిన్‌మెంట్ జోన్‌గా పెట్టాల్సిన దుస్థితి తప్పింది.
కాగువాడ లింక్‌లపై ఆరా
పాతపట్నం: మండలంలో నమోదైన పాజిటివ్ కేసులకు సంబంధించిన మరో మహిళకు పాజిటివ్ రావడంతో కాగువాడ గ్రామంలో బుధవారం సాయంత్రం అధికార యంత్రంగం, తహసీల్దార్ ఎం.కాశీప్రసాద్, ఎస్‌ఐ రాజేష్‌లు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. కాగువాడ గ్రామం గణ పతి నగర్‌లోని మహిళలకు పాజిటివ్ రావడంతో ఇరుగుపొరుగు ఏడు కుటుంబాలకు చెందిన వారికి ప్రత్యేకంగా కొరసవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టెస్టులు చేశారు. ఫలితాలు రావాల్సి ఉంది
Comments
Please login to add a commentAdd a comment