రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
కోటబొమ్మాళి (శ్రీకాకుళం) : జాతీయ రహదారిపై ఆగివున్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయూలయ్యూయి. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలో బుధవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం చినకాపవరం గ్రామానికి చెందిన తిరుమల నాగస్వామి (27), నాతరెడ్డి లక్ష్మీనారాయణ (నాని,(28)), నరసాపురానికి చెందిన శివభవాని ఆ జిల్లాలోనే ఆక్వా పరిశ్రమ నిర్వహిస్తున్నారు.
ఒడిశాలోని బరంపురం నుంచి చేపపిల్లలు తెచ్చేందుకు మంగళవారం రాత్రి కారులో బయల్దేరారు. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో కోటబొమ్మాళి మండలం పొడుగుపాడు వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి కారు రోడ్డు పక్కన ఆగివున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం లారీ కిందకు దూసుకుపోయింది. ప్రమాదంలో కారు నడుపుతున్న తిరుమల నాగస్వామి, ముందు సీట్లో కూర్చున్న నాతరెడ్డి లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లో కూర్చున్న శివభవాని కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికులు కారును బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో లారీ నుంచి కారును వేరుచేసి మృతదేహాలను వెలికితీశారు. గాయాలపాలైన శివభవానిని 108 అంబులెన్స్‌లో నరసన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. టెక్కలి సీఐ పి.శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. మృతుల బంధువులకు సమాచారమిచ్చిన పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎన్.నారాయణస్వామి తెలిపారు.