
అనూష మృతదేహం వద్ద విలపిస్తున్న బంధువులు, శేఖర్ మృతదేహం
సాక్షి, కొత్తపల్లి : పదో పరీక్షలు రాసిన ఆ పాఠశాల విద్యార్థులందరూ వీడ్కోలు సంబరంలో సరదాగా గడిపారు. భవిష్యత్తు దేదీప్యమానంగా ఉండాలని కోరుకుంటూ విద్యార్థులందరూ గురువుల ఆశీస్సులు అందుకున్నారు. పదేళ్లు కలిసి చదువుకున్న వారందరూ ఒకరినొకరిని వీడలేక.. బరువెక్కిన హృదయాలతో పరస్పరం వీడ్కోలు చెప్పుకున్నారు. వారందరికీ టాటా చెబుతూ ఇంటికి బయలుదేరిన వారిద్దరినీ మృత్యువు కాటేసింది. విషయం తెలిసిన బంధువులతో పాటు సహచర విద్యార్థులందరూ కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఉప్పాడ–పిఠాపురం రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం కొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామానికి చెందిన పులపకూర శేఖర్ (16) అమ్మయ్య ఊరు యండపల్లి శివారు జొన్నల గరువులో ఉంటూ కొండెవరం జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి చదివాడు. అదే గ్రామం జోగిరాజు పేటకు చెందిన బోరపాటి అనూష (16) ఈ పాఠశాలలోనే 10వ తరగతి చదివింది.
బుధవారం 10వ తరగతి పరీక్షలు ముగియడంతో గురువారం పాఠశాలలో పరీక్షలు రాసిన విద్యార్థులు ఫేర్‌వెల్ నిర్వహించుకున్నారు. అప్పటివరకు తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఆనందంగా గడిపిన వారి ఇద్దరూ పార్టీ ముగించుకుని మోటర్ సైకిల్‌పై ఇళ్లకు బయలుదేరారు. స్థానిక యాక్సస్ బ్యాంక్ సమీపంలో ఉప్పాడ నుంచి పిఠాపురం వైపు వెళుతున్న ఆటోను బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో శేఖర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
తీవ్రంగా గాయపడిన అనూష, మల్లాం గ్రామానికి చెందిన ప్రవీణ్ ఆటో డ్రైవర్‌ను పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై కృష్ణమాచారి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మరో రోడ్డుప్రమాదంలో...
ఉప్పాడ–పిఠాపురం రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం వాకతిప్ప సతీష్ చంద్ర కాలనీకి చెందిన కేశనకుర్తి తాతారావు (56) సైకిల్‌పై ఉప్పాడ
వెళుతున్నాడు. అనంతలక్ష్మి కాలనీ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటో అతడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఈమేరకు ఎస్సై కృష్ణమాచారి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment