చిత్తు కాగితాల ‘చిచ్చు’ | two telugu state officers fight for waste papers | Sakshi
Sakshi News home page

చిత్తు కాగితాల ‘చిచ్చు’

Published Fri, Apr 17 2015 6:57 AM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM

చిత్తు కాగితాల ‘చిచ్చు’ - Sakshi

చిత్తు కాగితాల ‘చిచ్చు’

  • పాత పేపర్ల విక్రయంపై రెండు రాష్ట్రాల సిబ్బంది మధ్య వివాదం
  • తమకు చెప్పకుండా అమ్ముతున్నారంటూ తెలంగాణ అధికారుల ఆగ్రహం
  • 58:42 నిష్పత్తిలో విక్రయ సొమ్ము పంచాలని పట్టు
  • సిబ్బంది బాహాబాహీ సచివాలయానికి చేరిన గొడవ
  •  
    సాక్షి, హైదరాబాద్: పురావస్తుశాఖలో చిత్తుకాగితాలు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపాయి. వాటిపై ఎవరి హక్కు ఎంతో తేల్చుకునే విషయంలో ఏకంగా సిబ్బంది బాహాబాహీకి దిగారు. వివాదం కాస్తా సచివాలయానికి చేరింది. ఇప్పుడు అది అంతర్రాష్ట్ర వివాదంగా మారి ఉద్రిక్తతకు కారణమవుతోంది. ఉన్నతాధికారుల నుంచి సరైన ఆదేశాలు అందకపోయేసరికి చిత్తు కాగితాల్లోంచి చిన్న ముక్క కూడా గల్లంతు కారాదన్న ఉద్దేశంతో సిబ్బంది వాటిని పహారా కాస్తున్నారు. తెలంగాణ ప్రాంత అధికారులు ఓ అడుగు ముందుకేసి ఆ కాగితాల బస్తాలను ఏకంగా పురావస్తు విభాగం డైరక్టర్ కార్యాలయం గడప వద్దే పేర్చిపెట్టారు.
     
    గొడవ ఎందుకంటే...
    హైదరాబాద్‌లోని గన్‌ఫౌండ్రిలో ఉన్న పురావస్తు సంచాలకుల కార్యాలయం ఆవరణలో విశాలమైన గ్రంథాలయం ఉంది. పాత వార్తాపత్రికలు, వివిధ ప్రచురణ సంస్థలు అందజేసిన పుస్తకాలు, ఇతర మేగజైన్లు కొన్నేళ్లుగా గుట్టలుగా పేరుకుపోయాయి. ఇంతకాలం వాటిని పట్టించుకోని అధికారులు రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సిబ్బందిని అదే భవన సముదాయంలో సర్దే క్రమంలో పాత కాగితాలు, పుస్తకాలను తొలగించాలని నిర్ణయించారు. ఇక్కడే వివాదం మొదలైంది. చిత్తు కాగితాల తొలగింపు బాధ్యతను స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ అధికారులు ీవాటిని పెద్ద సంచుల్లోకి సర్దారు. ఆపై వాటిని అమ్మేయాలని నిర్ణయించి ఓ కొనుగోలుదారుకు కబురు పెట్టి కిలో రూ. 8 చొప్పున ధర ఖరారు చేశారు. దీంతో కొన్ని రోజుల క్రితం కొనుగోలుదారు లారీ తెచ్చి చిత్తు కాగితాలను తూచి వాటిని తరలించేందుకు సిద్ధమవగా విషయం తెలుసుకున్న తెలంగాణ అధికారులు అందుకు అభ్యంతరం తెలిపారు. తమ అనుమతి లేకుండా కాగితాలెలా అమ్ముతారంటూ ఆంధ్రప్రదేశ్ అధికారులతో వాదనకు దిగారు.
     
    అంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం చిత్తు కాగితాలను కూడా 58:42 నిష్పత్తిలో పంచాల్సిందేనని డిమాండ్ చేశారు. వాటిని విక్రయించగా వచ్చే సొమ్మును అదే నిష్పత్తిలో పంచి రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకు జమ చేద్దామని ఆంధ్రప్రదేశ్ అధికారులు పేర్కొనగా అసలు తమకు మాట వరసకు కూడా చెప్పకుండా ఉమ్మడి ‘ఆస్తి’ని ఏకపక్షంగా అమ్మటమేంటని తెలంగాణ అధికారులు నిలదీశారు. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల సిబ్బంది మధ్య మాటామాటా పెరిగి అది బాహాబాహీకీ దారి తీసింది. లారీలోకి ఎక్కించిన కాగితాలను కిందకు దింపి వాటిని తిరిగి సంచుల్లోకి చేర్చి వాటిని తెలంగాణ సిబ్బంది తమ రాష్ట్ర డెరైక్టర్ కార్యాలయం ముందు పేర్చిపెట్టారు. తమ అనుమతి లేకుండా అందులోంచి ఒక్క కాగితం కూడా గల్లంతు చేయొద్దంటూ ఆంధ్రా సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం విషయాన్ని అధికారులు సచివాలయంలోని ఉన్నతాధికారులకు తెలిపారు.
     
    లైబ్రరీలో ఉండాల్సిన విలువైన పుస్తకాలేమైనా గల్లంతయ్యాయేమో పరిశీలించాల్సిందిగా తెలంగాణ ఉన్నతాధికారులు పేర్కొనటంతో సిబ్బంది మూటలు విప్పి పరిశీలించి విలువైనవేవీ లేవని తేల్చారు. రెండు రాష్ట్రాలకు పూర్తిస్థాయి డెరైక్టర్లు లేకపోవటం, సచివాలయంలో కూడా ఇన్‌చార్జి పాలన సాగుతుండటంతో ఈ వివాదాన్ని పరిష్కరించలేదు. కొనుగోలుదారు తూచిన దాదాపు 1,200 కిలోల కాగితాలతో కూడిన మూటలు కార్యాలయ వరండాలో మూలుగుతుండగా తూచని పేపర్లు, పుస్తకాలు లైబ్రరీలో మగ్గుతున్నాయి. రాకపోకలు సాగించేందుకు అడ్డుగా ఉన్నా వివాదం తేలితేగానీ వాటిని అమ్మొద్దనే పట్టుదలతో ఉన్న సిబ్బంది చిత్తు కాగితాలను అలాగే ఉంచేశారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వానలకు అవి తడిసిపోతుండటంతో ఇక చదలకు ఆహారం కావటం కద్దని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. చెదలు తిన్నా సరే... లెక్క తేలకుంటే కదిలించేది లేదంటూ సిబ్బంది భీష్మించుకుని వాటిని మూలనపెట్టేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement