waste papers
-
వేస్ట్ పేపర్‌తో వావ్ అనిపించే బొమ్మలు!!..చిత్తుకాగితానికి కొత్తరంగు
న్యూస్‌పేపర్ జీవితకాలం ఒక్కరోజు మాత్రమే. ఈ రోజు పేపర్‌కున్న విలువ మరుసటి రోజుకు ఉండదు. ఏరోజుకు ఆరోజు కొత్తపేపర్ కావాల్సిందే. అందుకే నిన్నటి పేపర్ చిత్తుకాగితంగా మారిపోతుంది. ఇలా టన్నులకొద్దీ పేపర్ భూమిలో కలిసిపోవడం నచ్చని సిమ్రాన్.. కాగితాలతో పేపర్ మఛే క్రాఫ్ట్స్‌ను తయారు చేస్తోంది. వేస్ట్ పేపర్‌ను వావ్ అనేలా తీర్చిదిద్దుతోంది. ప్రయాగ్ రాజ్‌కు చెందిన ఇరవైఎనిమిదేళ్ల సిమ్రాన్ కేసర్వాణికి చిన్నప్పటి నుంచి వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడమంటే చాలా ఇష్టం. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సాంప్రదాయ క్రాఫ్ట్స్‌ను తయారు చేస్తుండేది. ఫ్యాషన్ డిగ్రీ పూర్తయ్యాక, ఇంటీరియర్ డిజైనింగ్‌లో డిప్లొమా చేసింది. తనతోటివారిలా కార్పొరేట్ రంగంలో అడుగుపెట్టాలనుకోలేదు. తనకెంతో ఇష్టమైన క్రాఫ్ట్స్ తయారీనే కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. అందరిలా కాకుండా ఏదైనా కొత్తగా సృజనాత్మకంగా చేయాలని ఆలోచిస్తోన్న సిమ్రాన్‌కు.. చిన్నతనంలో చేసిన ‘టోఫీ బాక్స్’ గుర్తుకువచ్చింది. సిమ్రాన్ పుట్టినరోజుకి టోపీ బాక్స్‌లు తయారు చేసి పంచింది. ఆ బాక్స్‌లు చూసిన వారంతా సిమ్రాన్ ప్రతిభను చూసి తెగ మెచ్చుకున్నారు. దీంతో ‘పేపర్మఛే క్రాఫ్ట్స్’ తయారు చేయడం ప్రారంభించింది. పేపర్‌ను పేస్టుచేసి.. పురాతన కాలం నుంచి మఛే క్రాఫ్ట్స్‌కు మంచి గుర్తింపు ఉంది. పేపర్‌ను నానబెట్టి, తరువాత పేస్టులా నూరి వివిధ రకాల అలంకరణ వస్తువులను తయారు చేస్తారు. దీనినే పేపర్ మఛే క్రాఫ్ట్స్ అంటారు. ఇవి పర్యావరణానికి ఎటువంటి హానీ చేయవన్న భరోసాతో సిమ్రాన్ వీటిని ఎంచుకుంది. కస్టమర్ల దృష్టిని ఆకర్షించే విధంగా వివిధ ఆకారాల్లో ఈ క్రాఫ్ట్స్ తయారు చేయడం మొదలు పెట్టింది సిమ్రాన్. పేపర్ వెయిట్స్, ఫోల్డర్స్, చెరియాళ్ మాస్క్‌లు, ఆకర్షణీయమైన వివిధరకాల ఇంటి అలంకరణ వస్తువులను తయారు చేస్తోంది. ఈ క్రాఫ్ట్స్‌ను మరింత నాణ్యంగా అందంగా తయారు చేసేందుకు స్థానిక కళాకారుల వద్ద మెళకువలు నేర్చుకుంటోంది. అడ్డంకులు అధిగమించి... ‘‘పేపర్ మఛే క్రాఫ్ట్స్ తయారీ సర్టిఫైడ్ జాబ్ కాదు. దీనికి పెద్ద గుర్తింపు ఉండదు. నువ్వు ఇంజినీరింగ్ లేదా మెడిసిన్ చదువు’’ అని తల్లిదండ్రులు ఎంతగా హెచ్చరించినప్పటికీ తనని తాను నిరూపించుకోవాలన్న కసితో క్రాఫ్ట్స్ తయారీని ప్రారంభించింది సిమ్రాన్. అయితే సాంప్రదాయ కళాకృతుల గురించి అవగాహన తక్కువ ఉండడం, మార్కెట్ కొత్త కావడంతో సిమ్రాన్‌కు అనేక సమస్యలు ఎదురయ్యాయి. తనకెదురయ్యే ప్రతి వాళ్ల నుంచి కొత్త విషయాన్ని నేర్చుకుంటూ.. సోషల్ మీడియా స్కిల్స్‌తో తన ఉత్పత్తులకు మార్కెట్ చేస్తోంది. వివిధరకాల ఎగ్జిబిషన్లలో పేపర్ మఛే క్రాఫ్ట్స్‌ను ప్రదర్శిస్తూ కస్టమర్లకు సరికొత్త అలంకరణ వస్తువులను పరిచయం చేస్తోంది. మద్దారీ మీటర్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా కూడా మఛే క్రాఫ్ట్స్‌ను విక్రయిస్తోంది సిమ్రాన్. -
చిత్తు కాగితానికి కటకట.. కిలో రూ.15 నుంచి రూ.40కి పెంపు
సాక్షి, హైదరాబాద్: చిత్తు కాగితం బంగారమైపోయింది. నాలుగు బజ్జీలు పొట్లం చుట్టివ్వాలన్నా, ఇడ్లీ, దోశలు ప్యాక్ చేయాలన్నా ఓ కాగితం కావాల్సిందే. మరి.. అలాంటి కాగితానికే పెద్ద కరువొచ్చి పడింది. కిరాణా దుకాణాలు, టిఫిన్‌సెంటర్లు, చుడువా బండ్లు, పాన్‌షాపులలో కాగితానికి కటకట ఏర్పడింది. హైదరాబాద్ నుంచి పేపర్ మిల్లులకు తరలించే కాగితం ఎగుమతులు సైతం భారీగా పడిపోయాయి. కోవిడ్ నేపథ్యంలో వివిధ రకాల కాగితం వినియోగం బాగా తగ్గిపోయింది. స్కూళ్లు, కాలేజీలు మూత పడ్డాయి. న్యూస్పేపర్లతో పాటు వివిధ రూపాల్లో వినియోగించే కాగితం కొరత తలెత్తింది. దీంతో కొంతకాలంగా నగరంలో చిత్తు కాగితానికి భారీ డిమాండ్ ఏర్పడింది. గతంలో కేవలం రూ.10 నుంచి రూ.15కే కిలో చొప్పున లభించిన స్క్రాప్ పేపర్ ఇప్పుడు ఏకంగా రూ.40కి చేరుకొంది. నగరంలో చిత్తుకాగితాల వ్యాపారం 30 శాతానికి పైగా పడిపోయినట్లు వ్యాపారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గృహ వ్యర్థాల్లో తగ్గుదల.. సాధారణంగా ఇళ్లలో వివిధ రూపాల్లో కాగితం పేరుకుంటుంది. చదివి పక్కన పెట్టిన దినపత్రికలు, పిల్లలు ఏటా వినియోగించే నోట్ పుస్తకాలు, వస్తువులతో పాటు వచ్చే ప్యాకింగ్ పేపర్, మేగజైన్లు, మెడికల్ బాక్సులతో వచ్చే పేపర్లు తదితర రకాల్లో ఇళ్లలోకి వచ్చి చేరే కాగితాన్ని కిలోల లెక్కన చిల్లర వ్యాపారులకు విక్రయిస్తారు. ఇల్లిల్లూ తిరిగి కాగితాలు సేకరించే చిరు వ్యాపారులు ఒక స్థాయి పెద్ద వ్యాపారులకు క్వింటాళ్లలో విక్రయిస్తారు. హైదరాబాద్‌లో వందలాది మంది వ్యాపారులు పెద్ద పెద్ద గోడౌన్లను ఏర్పాటు చేసుకొని చిల్లర వర్తకుల నుంచి కాగితం కొనుగోలు చేస్తున్నారు. ఇలా సేకరించిన కాగితాన్ని బడా వ్యాపారులు టన్నుల్లో కొనుగోలు చేసి పేపర్ మిల్లులకు తరలిస్తారు. బేగంబజార్, కోఠి, మలక్‌పేట్, అంబర్పేట్ తదితర ప్రాంతాల్లోని హోల్‌సేల్ వ్యాపారులు గతంలో రోజుకు 250 టన్నుల వరకు కొనుగోలు చేసి ఎగుమతి చేశారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి 150 టన్నుల చిత్తుకాగితాలు కూడా లభించడం లేదని అంబర్‌పేట్‌కు చెందిన రాజేందర్ అనే వ్యాపారి తెలిపారు. 30 శాతానికి పైగా కాగితం వినియోగం తగ్గిందన్నారు. ‘కాగితం తిరిగి మార్కెట్లోకి రావాలంటే స్క్రాప్ పేపర్ మిల్లులకు వెళ్లాల్సిందే. కానీ తగినంత స్క్రాప్ అందుబాటులో లేకపోవడంతో కాగితం ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది’ అని చెప్పారు. ప్లాస్టిక్ వ్యర్థాలే మిగిలాయి.. ఇతని పేరు మారుతి. ఉప్పల్‌లో నివాసం. చాలా ఏళ్లుగా చిత్తు కాగితాలను సేకరించి హోల్‌సేల్ వ్యాపారులకు విక్రయిస్తున్నాడు. కాగితంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు, బాటిళ్లు తదితర గృహ వ్యర్థాలను కొనుగోలు చేస్తాడు. ఏడాది కాలంగా కాగితం పెద్దగా లభించడం లేదని, ప్లాస్టిక్ వ్యర్థాలపైనే ఆధారపడాల్సి వస్తోందని ఆయన చెప్పారు. ‘రెండేళ్ల క్రితం వారానికి రెండు వందల క్వింటాళ్ల చొప్పున చిత్తుకాగితాలు విక్రయించాను. ఇప్పుడు 50 కిలోలు కూడా లభించడం లేదు. పైగా సేకరించిన కాగితం గోడౌన్లకు చేరకుండానే టిఫిన్‌సెంటర్లు, కిరాణా దుకాణాల వాళ్లు కొనుక్కెళ్తున్నారు గతంలో కేవలం రూ.8కే కిలో చొప్పున సేకరించి హోల్‌సేల్ వ్యాపారులకు రూ.15కు కిలో చొప్పున విక్రయించారు. ఇప్పుడు చిల్లర వర్తకులే కిలోకు రూ.15 నుంచి రూ.20 వరకు చెల్లించాల్సివస్తోంది’ అని చెప్పారు. -
చిత్తు కాగితాల ‘చిచ్చు’
పాత పేపర్ల విక్రయంపై రెండు రాష్ట్రాల సిబ్బంది మధ్య వివాదం తమకు చెప్పకుండా అమ్ముతున్నారంటూ తెలంగాణ అధికారుల ఆగ్రహం 58:42 నిష్పత్తిలో విక్రయ సొమ్ము పంచాలని పట్టు సిబ్బంది బాహాబాహీ సచివాలయానికి చేరిన గొడవ సాక్షి, హైదరాబాద్: పురావస్తుశాఖలో చిత్తుకాగితాలు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపాయి. వాటిపై ఎవరి హక్కు ఎంతో తేల్చుకునే విషయంలో ఏకంగా సిబ్బంది బాహాబాహీకి దిగారు. వివాదం కాస్తా సచివాలయానికి చేరింది. ఇప్పుడు అది అంతర్రాష్ట్ర వివాదంగా మారి ఉద్రిక్తతకు కారణమవుతోంది. ఉన్నతాధికారుల నుంచి సరైన ఆదేశాలు అందకపోయేసరికి చిత్తు కాగితాల్లోంచి చిన్న ముక్క కూడా గల్లంతు కారాదన్న ఉద్దేశంతో సిబ్బంది వాటిని పహారా కాస్తున్నారు. తెలంగాణ ప్రాంత అధికారులు ఓ అడుగు ముందుకేసి ఆ కాగితాల బస్తాలను ఏకంగా పురావస్తు విభాగం డైరక్టర్ కార్యాలయం గడప వద్దే పేర్చిపెట్టారు. గొడవ ఎందుకంటే... హైదరాబాద్‌లోని గన్‌ఫౌండ్రిలో ఉన్న పురావస్తు సంచాలకుల కార్యాలయం ఆవరణలో విశాలమైన గ్రంథాలయం ఉంది. పాత వార్తాపత్రికలు, వివిధ ప్రచురణ సంస్థలు అందజేసిన పుస్తకాలు, ఇతర మేగజైన్లు కొన్నేళ్లుగా గుట్టలుగా పేరుకుపోయాయి. ఇంతకాలం వాటిని పట్టించుకోని అధికారులు రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సిబ్బందిని అదే భవన సముదాయంలో సర్దే క్రమంలో పాత కాగితాలు, పుస్తకాలను తొలగించాలని నిర్ణయించారు. ఇక్కడే వివాదం మొదలైంది. చిత్తు కాగితాల తొలగింపు బాధ్యతను స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ అధికారులు ీవాటిని పెద్ద సంచుల్లోకి సర్దారు. ఆపై వాటిని అమ్మేయాలని నిర్ణయించి ఓ కొనుగోలుదారుకు కబురు పెట్టి కిలో రూ. 8 చొప్పున ధర ఖరారు చేశారు. దీంతో కొన్ని రోజుల క్రితం కొనుగోలుదారు లారీ తెచ్చి చిత్తు కాగితాలను తూచి వాటిని తరలించేందుకు సిద్ధమవగా విషయం తెలుసుకున్న తెలంగాణ అధికారులు అందుకు అభ్యంతరం తెలిపారు. తమ అనుమతి లేకుండా కాగితాలెలా అమ్ముతారంటూ ఆంధ్రప్రదేశ్ అధికారులతో వాదనకు దిగారు. అంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం చిత్తు కాగితాలను కూడా 58:42 నిష్పత్తిలో పంచాల్సిందేనని డిమాండ్ చేశారు. వాటిని విక్రయించగా వచ్చే సొమ్మును అదే నిష్పత్తిలో పంచి రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకు జమ చేద్దామని ఆంధ్రప్రదేశ్ అధికారులు పేర్కొనగా అసలు తమకు మాట వరసకు కూడా చెప్పకుండా ఉమ్మడి ‘ఆస్తి’ని ఏకపక్షంగా అమ్మటమేంటని తెలంగాణ అధికారులు నిలదీశారు. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల సిబ్బంది మధ్య మాటామాటా పెరిగి అది బాహాబాహీకీ దారి తీసింది. లారీలోకి ఎక్కించిన కాగితాలను కిందకు దింపి వాటిని తిరిగి సంచుల్లోకి చేర్చి వాటిని తెలంగాణ సిబ్బంది తమ రాష్ట్ర డెరైక్టర్ కార్యాలయం ముందు పేర్చిపెట్టారు. తమ అనుమతి లేకుండా అందులోంచి ఒక్క కాగితం కూడా గల్లంతు చేయొద్దంటూ ఆంధ్రా సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం విషయాన్ని అధికారులు సచివాలయంలోని ఉన్నతాధికారులకు తెలిపారు. లైబ్రరీలో ఉండాల్సిన విలువైన పుస్తకాలేమైనా గల్లంతయ్యాయేమో పరిశీలించాల్సిందిగా తెలంగాణ ఉన్నతాధికారులు పేర్కొనటంతో సిబ్బంది మూటలు విప్పి పరిశీలించి విలువైనవేవీ లేవని తేల్చారు. రెండు రాష్ట్రాలకు పూర్తిస్థాయి డెరైక్టర్లు లేకపోవటం, సచివాలయంలో కూడా ఇన్చార్జి పాలన సాగుతుండటంతో ఈ వివాదాన్ని పరిష్కరించలేదు. కొనుగోలుదారు తూచిన దాదాపు 1,200 కిలోల కాగితాలతో కూడిన మూటలు కార్యాలయ వరండాలో మూలుగుతుండగా తూచని పేపర్లు, పుస్తకాలు లైబ్రరీలో మగ్గుతున్నాయి. రాకపోకలు సాగించేందుకు అడ్డుగా ఉన్నా వివాదం తేలితేగానీ వాటిని అమ్మొద్దనే పట్టుదలతో ఉన్న సిబ్బంది చిత్తు కాగితాలను అలాగే ఉంచేశారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వానలకు అవి తడిసిపోతుండటంతో ఇక చదలకు ఆహారం కావటం కద్దని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. చెదలు తిన్నా సరే... లెక్క తేలకుంటే కదిలించేది లేదంటూ సిబ్బంది భీష్మించుకుని వాటిని మూలనపెట్టేస్తున్నారు. -
అమెరికన్ పార్సిలులో చెత్త కాగితాలు...
జగ్గయ్యపేట : అమెరికా నుంచి వచ్చిన ఓ రిజిస్ట్రర్ ఎయిర్ పార్సిలు చూసిన ఓ వ్యక్తి అవాక్కయిన ఘటన కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే స్థానిక నివాసం ఉంటున్న ఇంటూరి రాజగోపాల్ బంధువులు అమెరికాలో ఉంటున్నారు. గత నెల 23న బంధువు ...రూ.60వేలు విలువ చేసే ఐ ఫోన్‌ను అమెరికా నుంచి జగ్గయ్యపేటకు రిజిస్టర్ ఎయిర్‌మెయిల్ ద్వారా రాజగోపాల్‌కు పంపాడు. పార్సిల్ తెరిచి చూసిన రాజగోపాల్ ...ఫోన్‌కు బదులు చెత్త కాగితాలు ఉండటంతో షాక్ తిన్నాడు. వెంటనే ఈ విషయాన్ని ఫోన్ చేసి బంధువుకు తెలిపాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కాగా ఫోన్ పోస్టాఫీసులో మిస్ అయ్యిందా లేక కస్టమ్స్ అధికారుల వైఫల్యమా అనేది తేలాల్సి ఉంది.