కారు బోల్తా.. ఇద్దరు యువకుల మృతి
Published Fri, Sep 13 2013 4:09 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
శివయ్యస్థూపం(వినుకొండ), న్యూస్‌లైన్ : ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు సెలవుపై గ్రామానికి వచ్చాడు.. స్నేహితులతో కలిసి మల్లన్న దర్శనానికి శ్రీశైలం వెళ్లొద్దామనుకున్నారు. ఆరుగురు మిత్రులు సఫారీ కారులో సంతోషంగా బయలుదేరారు. గుంతల మయమైన రోడ్డులో వీరిపాలిట మృత్యువైంది. ఈపూరు మండలం బోడిశంభునివారిపాలెం వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. గురువారం వేకువజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మిగిలిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డకు చెందిన కొంగా హరినాథరెడ్డి(23) బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన సెలవుపై స్వగ్రామానికి రావటంతో స్నేహితులంతా కలిసి శ్రీశైలానికి వెళ్లొద్దామనుకున్నారు. జొన్నలగడ్డ, తాడికొండ మండలం లాం శివారు తాతిరెడ్డిపాలెం గ్రామాలకు చెందిన ఆరుగురు యువకులు బుధవారం రాత్రి సఫారీ కారులో బయలుదేరారు. వినుకొండ సమీపంలో ఈపూరు మండలం బోడిశంభునివారిపాలెం వద్ద కర్నూలు-గుంటూరు రాష్ట్ర ర హదారిపై కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది.
కారులో ముందు కూర్చున్న తాతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన కొండా నాగార్జునరెడ్డి(24) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన కొంగా హరినాథరెడ్డి(23)ని గుంటూరు తరలిస్తుండా మార్గంమధ్యలో మృతిచెందాడు. కారులో ఉన్న కొంగా అమర్‌నాథ్‌రెడ్డి, శ్యామల వెంకటరెడ్డి, కొండా కోటిరెడ్డి, కుర్రా వంశీలకు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించినట్లు వైద్యులు తెలిపారు.
వీరిలో డ్రైవింగ్ చేసిన కొండా కోటిరెడ్డికి తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడి పరిస్థితి విషమంగా ఉంది. బోడిశంభునివారిపాలెం రోడ్డుపై గోతులు ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. ఈపూరు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు నాగార్జునరెడ్డి కుటుంబసభ్యులు, బంధువులు వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement