వారెవ్వా.. ఏమి‘టీ’! | Types Of Tea | Sakshi
Sakshi News home page

వారెవ్వా.. ఏమి‘టీ’!

Published Tue, Aug 13 2019 11:15 AM | Last Updated on Tue, Aug 13 2019 11:18 AM

Types Of Tea - Sakshi

ఒత్తిడితో చిత్తయ్యే చాలా మంది టీ లేదా కాఫీ తాగి ఉపశమనం పొందుతుంటారు. ఇంట్లోనూ కాస్త ఫ్రీ టైమ్‌ దొరికిందంటే టక్కున గుర్తుకొచ్చేదీ ఇదే. అలా టీ తాగుతూ నచ్చిన పుస్తకాన్ని చదివితే అంతకంటే మనసుకు ఆహ్లాదం ఇంకేముంటుంది. స్నేహితులు కలిసినపుడు, తెలిసిన వారు బజారులో పలకరించినపుడు, మర్యాదపూర్వక భేటీల సమయంలో తప్పకుండా ఒక ‘స్ట్రాంగ్‌ టీ’ గుటకేయాల్సిందే!! లేదంటే చాలా మందికి ప్రాణం ఉసూరుమంటుంది.

సాక్షి, ఒంగోలు: తేనీటి ఘుమఘుమలకు టీ ప్రియులు ఫిదా అవుతున్నారు. నిత్య జీవనంలో టీ ప్రముఖ పాత్రే పోషిస్తోంది. మూడు దశాబ్దాల కిందట ఒకటీరెండు రకాల తేనీరే అందుబాటులో ఉండేది. కప్పు రూ.0.15 పైసలతో మొదలై.. ఇప్పుడు రూ.15కు చేరింది. ఒక్క ఒంగోలు నగరంలోనే రోజుకు 10 లక్షలకు పైగా టీలు తాగుతున్నారని వ్యాపారవర్గాల అంచనా. ఈ లెక్కన జిల్లాలో టీ మార్కెట్‌ అంచనాలకు అందనిది.

నాలుగు చినుకులు పడ్డాయంటే..
బయట చిరుజల్లులు. ఆహ్లాదకరమైన వాతావరణం. వేడివేడిగా తేనీటి చుక్కలు గొంతులోకి దిగుతుంటే భలే ఉంటుంది కదూ. ఇద్దరు మిత్రులు కలవగానే నోటి నుంచి వచ్చే మొదటి మాట ‘టీ తాగుదాం భయ్యా’, ‘టీ తాగుదాం బాబాయ్‌..’, స్ట్రాంగ్‌ చాయ్‌ తాగుదాం మావా..’. ఇక విద్యార్థులైతే ఒన్‌బైటూ చాయ్‌ చెబుతారు. బందువులు ఇంటికి రాగానే తేనీటి సేవనంతోనే కబుర్లు మొదలవుతాయి. మనసు చికాకు పుట్టినా.. కొత్తవారితో దోస్తీ కట్టినా.. వాన పడినా.. మంచు కురిసినా, ఎండ కాసినా టీ రుచులను ఆస్వాదించాల్సిందే. చిరుద్యోగి నుంచి కార్పొరేట్‌ కంపెనీ సీఈఓ వరకు రోజుకు ఒక్కసారైనా టీ సేవించాల్సిందే.

నగరాల్లో ఇరానీ చాయ్‌ వచ్చేసింది. ప్రత్యేకంగా ఇరానీ చాయ్‌ రుచులు చూపించే దుకాణాలు ఉన్నాయి. తేయాకు రుచులకు డిమాండ్‌ నానాటికీ పెరుగుతోంది. ఆరోగ్యం.. ఆనందం..ఆహ్లాదం.. ఆస్వాదన పంచే తేనీరుతో కొన్ని హోటళ్లు ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాయి. సమయానికి తగినట్లుగా, మూడ్‌కు అనుగుణంగా సరికొత్తగా కొత్త కొత్త రుచులతో తేనీరు అందుబాటులోకి వచ్చింది. మారిన జీవన శైలి.. పోటీ పడి అలసిన వారు కాసేపు సేద తీరేందుకు ఇటు వైపుగా అడుగులు వేస్తున్నారు. నగరంలోనూ కేఫ్‌ క్లబ్‌లు వెలుస్తున్నాయి. ఆధునిక పోకడలకు దర్పణం పడుతున్నాయి.

కొత్తగా ఆస్వాదించాల్సిందే..
మారుతున్న పరిస్థితుల్లో అన్ని వర్గాల్లోనూ ఆరోగ్య స్పృహ పెరిగింది. ఖర్చు ఎక్కువనా వెనుకంజ వేయడం లేదు. కార్పొరేట్‌ సంస్కృతి అందుబాటులోకి వచ్చింది. కాసేపైనా సమావేశాలు, స్నేహితులు బందువులతో గడపాలంటే టీ రూమ్‌లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏకాంతంగా గడిపేందుకు అనుకూల వాతావరణం ఆస్వాదించడానికి అద్భుతమైన రుచులను కోరుతున్నారు. నగరంలో వివిధ బ్రాండ్ల టీ రకాలు అందుబాటులో ఉన్నాయి. హైవే పైనా కాఫీ క్లబ్‌లు, టీ షాప్‌లు వెలిశాయి. 24 గంటలపాటు వీటి సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. ఇక టీ బంకులు ఉండనే ఉన్నాయి. టీ కాస్త బాగుంటే చాలు.. షాప్‌ వద్ద జనాలు గుంపులు గుంపులే. అర్ధరాత్రి వరకు టీ దుకాణాలు తెరిచే ఉంటున్నాయి. పాత మార్కెట్‌ సెంటర్‌తోపాటు పలు ప్రాంతాల్లో రకరకాల టీలు లభిస్తున్నాయి.

ఘుమఘుమలతో ఫిదా..
టీ గ్లోబల్‌ మార్కెట్‌. అంతర్జాతీయంగా ఉండే టీ రకాలు స్థానిక మార్కెట్‌కు వస్తున్నాయి. మూడు దశాబ్దాల కిందట టీ రకం ఒకటే. ఇప్పుడు రకరకాలు. రంగు.. రుచి.. వాసన ఘుమఘుమలతో నగరవాసులు టీకి ఫిదా అవుతున్నారు. 1853లో తేయాకు తోటలను తొలిసారిగా సాగు చేశారు. క్రమంగా విస్తరించి లక్షలాది ఎకరాల్లో తేయాకు పండిస్తున్నారు. అస్సాం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్, ఉత్తరాఖండ్, మిజోరాం, మేఘాలయ, కర్నాటక, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి రకరకాల తేయాకు మార్కెట్‌కు వస్తోంది. కిలో రూ.139 నుంచి రూ.1200 వరకు ఉండే రకాలు ఇక్కడ లభిస్తున్నాయి. ఆరోగ్య సూత్రాలు బాగా అవలంబిస్తున్న నేపథ్యంలో బ్లాక్, గ్రీన్, హెర్బల్, దినుసులతో తయారు చేసిన టీ రకాలను ఆస్వాదించే వారి సంఖ్య బాగా పెరిగింది. ఇప్పుడు చిన్న డిస్పోజల్‌ బ్యాగ్‌లలోనూ టీ లభిస్తోంది. బ్లాక్, చీజ్, పౌడర్, రెడీ టీ, గ్రీన్, జింజర్‌ రకరకాలు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి.

ఔరా అనాల్సిందే..
ఎల్లో బడ్‌ టీ రెండు కప్పుల విలువ ఎంతో తెలుసా? అక్షరాలా రూ.6,500. స్టార్‌ హోటళ్లల్లో ఈ టీ లభిస్తుంది. టీ వినియోగానికి పెరిగిన ఆదరణకు ఇది ప్రతీక. అచ్చమైన తేయాకును ఎండబెట్టి 24 కేరట్ల బంగారంతో మిళితం చేసిన ఫ్లేవర్‌తో ఎల్లో బడ్‌ టీ పొడి తయారు చేస్తారు. ఈ టీ పౌడర్‌ కిలో ధర సుమారు రూ.8 లక్షలు. ఎంతటి వారైనా ఈ ధర చూసి ఔరా అనాల్సిందే.  స్థానిక మార్కెట్‌లోనూ 40 రకాలకు తగ్గకుండా టీ లభిస్తోంది. అల్పాహార హోటళ్లల్లోనూ నిత్యం వినియోగించే రకాలను అందుబాటులో ఉంచుతున్నారు. ఒంగోలులోని వివిధ సెంటర్లలో జింజర్‌ టీ, గ్రీన్, బ్లాక్, దాల్చిన చెక్క, వైట్‌ టీ, ఎల్లో టీ, బాదం టీ, మింట్, మిరియాలు, వాము, గార్లిక్‌.. ఇలా రకరకాల టీలు విక్రయిస్తున్నారు. ఉదయాన్నే అల్లం టీ తాగేందుకు వాకర్లు గుంపులుగుంపులుగా టీ కొట్ల వద్దకు చేరుతున్నారు. ఉదయం పూట ఒక్క మంగమూరు రోడ్డులోని రెండు మూడు కేంద్రాల్లో వందలాది టీలు అమ్ముడవుతున్నాయి. షాప్‌ నిర్వాహకులు పార్ట్‌ టైం సర్వెంట్లను పెట్టుకుని ఉదయం టీ మార్కెట్‌ నడిపిస్తున్నారు. పాలు, పంచదార కలపకుండా చక్కటి రుచి, సువాసన కలిగిన టీలు కాఫీ షాప్‌ల్లో లభిస్తున్నాయి. ఎలాంటి రసాయనాలు కలపకుండా స్వచ్ఛమైన తేయాకుతో తయారు చేసే టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement