'ఉదయ్‌'రాగం వినిపించబోతుంది | UDAY Double Deccar Train Is Arriving To Visakhapatnam | Sakshi
Sakshi News home page

'ఉదయ్‌'రాగం వినిపించబోతుంది

Published Wed, Jul 17 2019 9:58 AM | Last Updated on Wed, Jul 17 2019 9:58 AM

UDAY Double Deccar Train Is Arriving To Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ శ్రమకు ఫలితం దక్కింది.ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ విశాఖకు రప్పించి ఎంవీవీ తొలి విజయం సాధించారు. విశాఖ –విజయవాడ మధ్య నానాటికీ పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ రైలు అవసరం ఉందని పట్టుబట్టి మరీ సాధించారు. గత నెల 18న రైల్వే శాఖ మంత్రి సురేష్‌ చెన్నబసప్పను కలిసి డబుల్‌ డెక్కర్‌ రైలు ఆవశ్యకతను వివరించారు. సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి డబుల్‌ డెక్కర్‌ రైలు నడపడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.దీంతో విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  విశాఖ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఎంవీవీ ఇదే తరహాలో కీలక పాత్ర పోషించాలని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.   

ఇదీ విషయం
దేశంలో ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను మూడింటిని నడపనున్నట్టు గత కేంద్ర రైల్వే మంత్రి ప్రకటించారు. అందులో ఒక ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ రైలు విశాఖ–విజయవాడ మధ్య నడపనున్నట్లు  వెల్ల డించారు. అప్పటి నుంచి ఉదయ్‌ రావడం కనపడలేదు కదా..కేంద్ర రైల్వే మంత్రులను కోరినవారే కరువయ్యారు. విశాఖ–విజయవాడ మధ్య మరింత రద్దీ పెరుగుతున్న కారణంగా ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ రైలు అవసరం పెరిగింది. అయినా గత టీడీపీ ఎంపీలు  ఏనాడు విశాఖ–విజయవాడల మధ్య రద్దీపై స్పందించిన పాపనపోలేదు.

చివరకి విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రోద్బలంతో ఎట్టకేలకు విశాఖకు ఉదయ్‌ డబుల్‌డెక్కర్‌ వచ్చింది. ఇది విశాఖ– విజయవాడల మధ్య 350 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది.  ఉదయ్‌ రైలులో ప్రత్యేక ఆధునిక సాంకేతిక సదుపాయాలు ఉంటాయి. స్క్రీన్ల ద్వారా వచ్చే స్టేషన్లు ముందే తెలుసుకునే సౌకర్యం ఉంటుంది. అయితే ఇది పట్టాలెక్కడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. ట్రయల్‌ రన్‌ ఎప్పుడనేది త్వరలో వెల్లడిస్తామని వాల్తేర్‌ అధికారులు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement