హైదరాబాద్ : ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి అతని అత్తమామలను పోలీసులు విచారించారు. వారితో పాటు ఉదయ్ కిరణ్ నివాసం ఉంటున్న శ్రీనగర్ కాలనీలోని జ్యోతి హోమ్స్‌లోని ఇద్దరు వాచ్మెన్లను ప్రశ్నించారు. మరోవైపు క్లూస్ టీమ్ కూడా ఉదయ్ కిరణ్ నివాసంలో సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా సెల్ఫోన్తో పాటు, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. ఉదయ్ కిరణ్ చివరిసారిగా చెన్నైకి చెందిన భూపాల్ అనే వ్యక్తితో మాట్లాడినట్లు సమాచారం. అలాగే భార్య విషితకు ఐ లవ్ యూ అంటూ మెసేజ్ పెట్టినట్లు తెలుస్తోంది.
గత మూడేళ్లుగా ఉదయ్ కిరణ్ కుటుంబం ఇక్కడే నివాసం ఉంటుందని అదే అపార్ట్మెంట్ నివాసి శ్రీనివాస్ తెలిపారు. ఉదయ్ కిరణ్ భార్య, అత్త, మామ రాత్రి 12 గంటల సమయంలో వచ్చారని, పెద్దగా ఏడుపులు వినిపించాయని, తాను వెళ్లేసరికి విషిత ఏడుస్తున్నట్లు తెలిపారు. లోనికి వెళ్లి చూసేసరిక ఉదయ్ కిరణ్ ఉరి వేసుకుని ఉన్నారని, వెంటనే 108కి సమాచారం అందించినట్లు శ్రీనివాస్ చెప్పారు.
కుటుంబ కలహాలు లేవనే తాను అనుకుంటున్నానని, ఉదయ్ కిరణ్ దంపతులు అన్యోన్యంగానే ఉంటున్నారని తెలిపారు. గత రెండేళ్లుగా వారి కుటుంబం గురించి తనకు తెలుసునని ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో...ఉదయ్‌కిరణ్ భార్య ఇంట్లో లేరన్నారు. ఫోన్ కాల్స ఎత్తకపోవటంతో వాళ్లకు అనుమానం వచ్చి ఇంటికి వచ్చినట్లు తెలిపారు. కాగా ఉదయ్ కిరణ్ మృతిపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.