Uday Kiran
ఇక రాను అనీ... ఉదయ్ కిరణ్ ఆత్మహత్య!
Published Tue, Jan 7 2014 2:07 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు వాయేజుల ఉదయ్ కిరణ్ (34) ఆత్మహత్య ఉదంతం సంచలనం కలిగించింది. సినీ అవకాశాలు సన్నగిల్లడం, ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాలే ఆయనను ఆత్మహత్యకు పురిగొల్పి ఉండొచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కొద్ది నెలలుగా ముఖం చాటేసిన స్నేహితులు, అవకాశాల కోసం ఫోన్ చేస్తే స్పందించని దర్శక-నిర్మాతలు, కుటుంబ కలహాలు, తల్లి మరణం, తండ్రితో పెరిగిన దూరం ఇవన్నీ ఉదయ్‌ని మానసికంగా కుంగదీశాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
అత్తామామల్ని పంపి..
ఉదయ్ కిరణ్ శ్రీనగర్‌కాలనీ జ్యోతి హోమ్స్ అపార్ట్‌మెంట్స్ నాలుగో అంతస్తులోని ఫ్లాట్ నం.402లో భార్య విషితతో కలిసి అద్దెకుంటున్నారు. మూడు పడక గదులు కలిగిన ఈ ఫ్లాట్‌లోని ఓ గదిని జిమ్‌గా మార్చుకున్నారు. నూతన సంవత్సర వేడుకల నిమిత్తం బెంగళూరు వెళ్లిన ఉదయ్ కిరణ్, విషిత గురువారం నగరానికి చేరుకున్నారు. ఫేస్‌బుక్ సంస్థలో పనిచేస్తున్న విషిత.. తన సహోద్యోగి, స్నేహితుడు రోహిత్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మణికొండ వెళ్లారు. కొద్ది రోజులుగా డిప్రెషన్‌లో ఉంటున్న ఉదయ్ కిరణ్ పరిస్థితి గమనించిన ఆమె తనతో పాటు రమ్మనగా... ఉదయ్ నిరాకరించాడు. దీంతో తన తల్లిదండ్రుల్ని ఇంట్లో ఉంచి విషిత పార్టీకి వెళ్లారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అత్త మేఘల, మామ గోవిందరాజన్‌లను మణికొండలోని వాళ్ల ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా ఉదయ్ చెప్పారు. తాను రాత్రి 11 గంటలకు వచ్చి విషితను పికప్ చేసుకుంటానని చెప్పడంతో మేఘల, గోవిందరాజన్ వెళ్లిపోయారు. బర్త్‌డే పార్టీ ముగించుకున్న విషిత 11 గంటల ప్రాంతంలో తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి ఉదయ్ రాక కోసం వేచి చూశారు. పావు గంట గడచినా రాకపోయే సరికి ఫోన్ చేశారు. ఫోన్ మోగుతున్నా ఎత్తకపోవడంతో మరో మూడుసార్లు ప్రయత్నించారు. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఉదయ్ రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆందోళన చెందిన విషిత... తన మేనమామ, తండ్రితో కలిసి మణికొండ నుంచి బయల్దేరారు.
ఒంటి గంట ప్రాంతంలో శ్రీనగర్‌కాలనీలోని ప్లాట్‌కు వచ్చి తలుపు తట్టగా స్పందన లేకపోవడం, ఉదయ్ అంటూ పిలిచినా పలకకపోవడంతో మారుతాళం చెవితో తలుపులు తీసుకుని లోపలకు వెళ్లారు. లోపల నుంచి మూసి ఉన్న జిమ్ గది తలుపు ఎంతకూ తెరుచుకోకపోవడంతో వాచ్‌మన్లు మరికొందరితో కలసి బలవంతంగా తెరిచారు. అక్కడ ఉరివేసుకుని ఉదయ్ కిరణ్ కనిపించడంతో వారంతా షాక్‌కు గురయ్యారు. అనంతరం ఉరి వేసుకున్న తాడును తొలగించి కిందకు దింపారు. కొనప్రాణమైనా ఉంటుందని ఆశించి అపోలో ఆస్పత్రి అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో అంబులెన్స్‌లో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు రాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఉదయ్ మృతి చెందినట్లుగా ప్రకటించారు. ఈ వార్త విన్న విషిత ఆసుపత్రిలోనే కుప్పకూలారు. ఘటనపై బంజారాహిల్స్ ఏసీపీ అశోక్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ పి.మురళీకృష్ణ విచారణ చేపట్టారు. విషిత నుంచి ఫిర్యాదును స్వీకరించి కేసు దర్యాప్తు ప్రారంభించారు.
భార్యకు ‘ఐ లవ్ యూ’ అంటూ మెసేజ్..
చనిపోవడానికి ముందు ఉదయ్‌కిరణ్ ఎవరెవరితో సంప్రదింపులు జరిపాడనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో భార్య విషితకు తన ఫోన్ నుంచి చివరిసారిగా ‘ఐ లవ్ యూ’ అని ఎస్సెమ్మెస్ పంపించినట్లు తేల్చారు. జవాబుగా విషిత కూడా ‘ఐ టూ లవ్ యూ’ అని పంపించినట్లు ఫోన్‌లో నమోదైంది. దీనికి ముందు ఉదయ్ తన స్నేహితుడు శరత్ సహా మరికొందరితో మాట్లాడినట్లు గుర్తించారు. ఏం మాట్లాడారు అనేది ఆరా తీస్తున్నారు. ఉదయ్ చెన్నైలో నివసించే తన స్నేహితుడు భూపాల్‌కు రాత్రి 10 గంటల ప్రాంతంలో కాల్ చేశారు. ఆ సమయంలో లిఫ్ట్ చేయని ఆయన అర్ధరాత్రి తిరిగి ఫోన్ చేశారు. అప్పటికే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడంతో మిస్డ్ కాల్‌గా నమోదైంది. దీంతో పాటు భార్య, మామ తదితర నెంబర్ల నుంచి కూడా మిస్డ్ కాల్స్ ఉన్నట్లు గుర్తించారు.
సినీ అవకాశాలు లేవని బాధపడేవారు: భార్య విషిత
సినిమా అవకాశాలు లేవని కుంగిపోతూ ఇటీవల రెండుమూడు సార్లు తాను చనిపోతానంటూ ఉదయ్ చెప్పాడని భార్య విషిత పోలీసుల విచారణలో చెప్పారు. గత రెండు రోజులుగా ఇంటి నుంచి బయటకు వెళ్లలేదని పేర్కొన్నారు. కాగా, మనస్పర్థల కారణంగా తాను ఆరేళ్లుగా ఉదయ్‌కి దూరంగా ఉంటున్నానని ఆయన తండ్రి మూర్తి మీడియాతో చెప్పారు. తన ఆస్తిని దుర్వినియోగం చేస్తున్నానని ఆరోపిస్తూ తనను ఇంటికి రావద్దని ఉదయ్ చెప్పాడని, అప్పట్నుంచి వెళ్లలేదన్నారు. ఉదయ్‌కిరణ్ తల్లి ఐదేళ్ల క్రితం చనిపోయారు.
నేడు అంత్యక్రియలు..
ఉదయ్‌కిరణ్ మృతదేహానికి సోమవారం మధ్యాహ్నం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఉదయ్ కళ్లను ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు సేకరించారు. ఒమన్ దేశం నుంచి ఉదయ్ సోదరి శ్రీదేవి, బావ ప్రసన్న నేరుగా నిమ్స్‌కు వచ్చారు. ఉదయ్ తండ్రి మూర్తి కూడా వచ్చి కొడుకు మృతదేహాన్ని సందర్శించారు. భౌతిక కాయాన్ని మంగళవారం ఉదయం నిమ్స్ నుంచి నేరుగా ఫిలించాంబర్‌కు తరలించనున్నారు. అక్కడ్నుంచి ఈఎస్‌ఐ శ్మశానవాటికకు తరలించి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
మంత్రి అరుణ దిగ్భ్రాంతి
ఉదయ్‌కిరణ్ మృతి పట్ల రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉదయ్ కిరణ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Advertisement