
ఉగాది వెలుగులు విరజిమ్మాలి
► మంచి వర్షాలు కురవాలని వరుణదేవున్ని ప్రార్థించాలి
► జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ పిలుపు
ఉగాది పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆకాంక్షించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సునయనఆడిటోరియంలో దుర్ముఖి నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
కర్నూలు(కల్చరల్): ఉగాది పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆకాంక్షించారు. దుర్మిఖి నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ ఏడాది ప్రతి ఒక్కరూ మంచి వర్షాలు కురిసేలా వరుణదేవున్ని ప్రార్థించాలని జిల్లా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో దుర్మిఖినామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే దుర్మిఖి నామ సంవత్సరంలో కర్నూలు జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆయన ఆకాంక్షించారు.
వ్యవసాయంపై ఆధారపడ్డ రైతులంతా పాడిపంటలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన కోరారు. అనంతరం కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక అయిన ఉగాది పండుగ కర్నూలు జిల్లా ప్రజల గుండెల్లో ఆనందోత్సాహాలు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోందని.. పారిశ్రామిక, వ్యాపార రంగాలలో మరింత అభివృద్ధి జరిగేలా దేవున్ని ప్రార్థించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన అనంతరం ప్రభుత్వ సంగీత కళాశాల అధ్యాపకుల బృందంచే నాదస్వరం, విద్యార్థులచే గణపతి ప్రార్థనలతో కార్యక్రమం ప్రారంభమైంది. నంద్యాల పంచాగ గ్రంధకర్త శశిభూషణ సిద్ధాంతి పంచాగ పఠనం చేశారు.
అనంతరం నిర్వహించిన కవి సమ్మేళనంలో కవులు డాక్టర్ ఎం.హరికిషన్, పుల్లా రామాంజనేయులు, మారుతీకుమారి, మాకం నాగరాజు, డాక్టర్ వి.వెంకటేశ్వర్లు, కె.స్వర్ణలత, గన్నమరాజు సాయిబాబ, ఎన్.నాగమణి చదివిన కవితలు ప్రేక్షకులను అలరించాయి. కళాకారులు చెక్కభజన, గురవయ్య నృత్యాలు ప్రదర్శించారు. రవీంద్ర విద్యానికేతన్ విద్యార్థులు, కేశవ మెమోరియల్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. వివిధ రంగాల్లో సేవలందించిన డాక్టర్ ఎ.సంజీవరాయుడు, సాయికుమార్, కోటేష్, రామకృష్ణయ్య, వి.వి.రమణమూర్తి, విజయప్రసాద్‌లకు జిల్లాస్థాయి ఉగాది విశిష్ట పురస్కారాలు అందించారు.
కర్నూలును అభివృద్ధి పథంలో నడిపిద్దాం
ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని సునయన ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి టి.జి.వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన అనంతరం రాష్ట్రం కష్టాలనెదుర్కొంటోందని, అయినా కర్నూలును అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామన్నారు. కర్నూలులో హైకోర్టు నిర్మాణం కోసం ప్రజలందరూ డిమాండ్ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అంతకుముందు పంచాంగ పఠనం చేసిన ఇంద్రగంటి నరసింహ శర్మ, ఇంద్రగంటి శ్రీధర్ శర్మ కర్నూలు జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండుతాయన్నారు.
ఈ సంవత్సరం ఆదాయం కన్నా ఖర్చు పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆగస్టు 12 నుంచి 23 వరకు కృష్ణా పుష్కరాలు అత్యంత వైభవోపేతంగా జరగనున్నాయన్నారు. ఈ సందర్భంగా చార్విరెడ్డి చేసిన శాస్త్రీయ నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కార్యమ్రంలో వికాసభారతి అధ్యక్షుడు నాగేంద్రప్రసాద్ జాయింట్ కలెక్టర్-2 రామస్వామి, ఆర్‌డీఓ గంగాధర్‌గౌడ్‌లతో పాటు అన్ని శాఖల జిల్లా ఉన్నతాధికారులు, ఉగాది ఉత్సవ కేంద్ర కమిటీ సభ్యులు, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గోపవరం రామచంద్రన్, కళాకారులు సుధారాణి, చంద్రకంటి మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.