ఎచ్చెర్ల క్యాంపస్: కరోనా నేపథ్యంలో డిగ్రీ, పీజీ కోర్సుల పెండింగ్ పరీక్షల నిర్వహణ గురించి ఆయా వర్సిటీ యాజమాన్యాలే తగు నిర్ణయం తీసుకోవాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్పష్టం చేసింది. అయితే ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను మాత్రం తప్పనిసరిగా నిర్వహించాలని, మిగతా సెమిస్టర్ల విషయంలో ఏం చేయాలో స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దీంతో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పాలకమండలి పరిస్థితిని సమీక్షించి తగు నిర్ణయం తీసుకోవాల్సివుంది. కరోనా కారణంగా ఫైనల్ సెమిస్టర్ మినహా మిగతా పరీక్షలను రద్దు చేసి, అంతర్గత మార్కుల ఆధారంగా విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నారు. బీఆర్‌ఏయూ కూడా అలాంటి నిర్ణయమే తీసుకునే అవకాశముంది. కరోనా బెడద ప్రారంభమయ్యాక పరీక్షలు వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ వంటి కోర్సులకు సంబంధించి పరీక్షల రద్దును యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వ్యతిరేకించింది. దీంతో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వర్సిటీ వీసీలతో సమీక్ష నిర్వహించింది. వర్సిటీలకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నందున పరీక్షల నిర్వహణ, రద్దు వంటి అంశాలపై వారే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ, రద్దు అంశాలపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం అధికారులు అంతర్గతంగా కసరత్తు చేస్తున్నారు.
బీఆర్‌ఏయూలో పరిస్థితి ఇది..
వర్సిటీ పరిధిలో 101 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటి పరిధిలో డిగ్రీ చివరి సెమిస్టర్ పరీక్షలు 15,211 మంది రాశారు. వీరుకాక సెమిస్టర్ విధానం రాక ముందు చదివి పరీక్ష తప్పిన ఇయర్ ఎండ్ బ్యాక్‌లాగ్ విద్యార్థులు 2875 మంది ఉన్నారు. వర్సిటీ పరిధిలో ఫైనల్ సెమిస్టర్, ఇయర్ ఎండ్ పరీక్షలను మార్చి 11–23 మధ్య నిర్వహించారు. ఏప్రిల్‌లో నిర్వహించవల్సిన డిగ్రీ రెండు, నాలుగు సెమిస్టర్లు, పోస్టు గ్రాడ్యుయేషన్ రెండు, నాలుగు సెమిస్టర్ పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు మాత్రం పూర్తయ్యాయి. పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు మాత్రం మిగిలిపోయాయి. ముగిసిన పరీక్షలకు మూల్యాంకనం వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం యూజీసీ ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణ తప్పనిసరి అని చెప్పడంతో మూల్యాంకనంపై తుది నిర్ణయం తీసుకోవల్సి ఉంటుంది. పరీక్షల ప్రక్రియను ఎలా పూర్తి చేయాలన్న విషయమై విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఫైనల్ సెమిస్టర్ మినహా మిగతా పరీక్షలు రద్దు చేస్తే మార్కులు ఎలా ఇవ్వాలన్న అంశంపై నిపుణుల సూచనలు స్వీకరించారు. వర్సిటీ పాలకమండలి పరిధిలో చర్చించి, తీర్మానం చేసి నిర్ణయం తీసుకోవల్సి ఉంటుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యా లయం పాలకమండలి కమిటీ సమావేశాన్ని గత నెల 23న నిర్వహించారు. ఆన్‌లైన్ సమావేశం సాంకేతిక లోపం వల్ల వాయిదా పడింది. ఈ నెలలో మళ్లీ సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం పరీక్షలు నిర్వహణ, రద్దులపై నిర్ణయం తీసుకుంటారు.
యూజీసీ సూచనలు పరిశీలిస్తాం
ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని యూజీసీ సూచించింది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వర్సిటీ నిర్ణయానికే విడిచిపెట్టింది. ఈ నేపథ్యంలో పాలకమండలిలో చర్చించి తీర్మానం చేస్తాం. అనంతరం నిర్ణయం అమలు చేస్తాం –ప్రొఫెసర్ కూన రామ్‌జీ, బీఆర్‌ఏయూ వీసీ
Comments
Please login to add a commentAdd a comment