అత్తింటి ఆరళ్లకు అబల బలి
వివాహమైన ఏడాదికే ఆమెకు నూరేళ్లూ నిండాయి. కడదాకా తోడుంటానని బాస చేసిన భర్తే ఆమె పాలిట యముడై నిత్యం వేధింపులకు పాల్పడ్డాడు. జీవిత భాగస్వామి నుంచి ఛీత్కారాలు ఎక్కువ కావడంతో మనస్తాపం చెంది ఆ యువతి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన సంతమాగులూరు మండలం పరిటాలవారిపాలెంలో బుధవారం జరిగింది.
సంతమాగులూరు : భర్త, అత్తమామల వేధింపులకు తాళలేక ఓ యువతి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని పరిటాలవారిపాలెంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన పుట్టా వీరాంజనేయులు చిన్న కుమారుడు నాగరాజుకు గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ముతరాసిపాలేనికి చెందిన చొప్పవరపు వెంకట్రావు రెండో కుమార్తె ఊహ(20)తో గతేడాది ఏప్రిల్‌లో వివాహమైంది. వీరి కాపురం ఆరు నెలల వరకు సజావుగానే సాగింది. ఆ తర్వాత దంపతుల మధ్య కలతలు రేగాయి. ఈ నేపథ్యంలో 20 రోజుల క్రితం భార్యను భర్త తన్ని ఆమె పుట్టింటికి తరిమేశాడు.
ఇటీవల భార్య వద్దకు వెళ్లి నచ్చజెప్పి మళ్లీ ఇంటికి తెచ్చుకున్నాడు. మంగళవారం ఉదయం ఊహ భర్త నాగరాజు పనికి వెళ్లి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. తన అన్న అయ్యప్ప, తల్లిదండ్రులు ఉండే గది తలుపులు పూర్తిగా వేసి ఉండటం.. తన గది తలుపులు ఓరగా వేసి ఉండటంతో ఇంట్లో ఎవరూ లేరని భావించి తలుపులు మరింత దగ్గరకు వేసేందుకు వెళ్లాడు. గదిలో తన అన్న అయ్యప్ప, తన భార్య ఊహ ఉండటాన్ని గుర్తించాడు. జీర్ణించుకోలేని నాగరాజు అన్న, తన భార్యపై చేయి చేసుకున్నాడు.
బావముందే చేయి చేసుకున్నందుకు మనస్తాపం చెందిన ఊహ.. ఆ వెంటనే తమ వంగతోట వద్దకు వెళ్లింది. అక్కడ పురుగుమందు తాగింది. తోట వద్దే ఉన్న అత్త రాజ్యలక్ష్మి దగ్గరకు వచ్చేలోపే కోడలు కిందపడి ఉంది. స్థానికుల సాయంతో ఉహను ఇంటికి చేర్చారు. అనంతరం 108 సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఎంతకీ స్పందించకపోవడంతో ఆటోలో వైద్యశాలకు తరలిస్తుండగా ఏల్చూరు సమీపంలోకి వెళ్లే సరికి 108 వాహనం వచ్చింది. ఊహను అందులో ఎక్కించేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె మృతి చెందినట్లు 108 సిబ్బంది ధ్రువీకరించారు.
పుట్టింటికి సమాచారం ఇవ్వడంలో జాప్యం
ఊహ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంలో అత్తింటి వారు తీవ్ర జాప్యం చేశారు. వారే సమాచారం తెలుసుకుని వచ్చారు. కుమార్తె విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు భోరున విలపించారు. ఆ సమయంలో అక్కడ అత్తింటి వారెవరూ లేకపోవడంతో ఊహ బంధువులకు అనుమానం వచ్చింది. తమ బిడ్డను అత్తింటివారే చంపారని ఆరోపించారు.
తమ కుమార్తె మరణానికి ఊహ భర్త నాగరాజు, బావ అయ్యప్ప, అత్త రాజ్యలక్ష్మి, మామ వీరాంజనేయులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఎస్సై ఎ.శివనాగరాజు కేసు నమోదు చేశారు. తహశీల్దార్ గంగాధరరావు సమక్షంలో శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.