జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు టమాటాపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఊజి రోగాలు విజృంభిస్తున్నాయి. పడమటి మండలాల్లో సాగుచేసిన టమాటా పంటలు దెబ్బతింటున్నాయి. ఊజి ఈగల దెబ్బతో కాయలపై రంధ్రాలు పడుతుండడంతో ఇప్పటికే 35 శాతం పంటను రైతులు నష్టపోయారు. దెబ్బతిన్న కాయల్ని పొలాల వద్ద పారబోస్తున్నారు. కొందరు రైతులు ఆశతో మార్కెట్‌కు తీసుకొస్తున్నా అక్కడ కొనేవారు లేక రోడ్ల పక్కనే పారబోసి వెళ్లిపోతున్నారు. గిట్టుబాటు ధరలున్నా ప్రస్తుతం పండించిన పంట పశుగ్రాసంగా మారుతోంది. దీంతో జిల్లాలో వారం రోజుల్లో రూ.12కోట్ల మేరకు రైతులకు నష్టం వాటిల్లింది.
సాక్షి, గుర్రంకొండ : ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో టమాటా పంటను ఎక్కువగా ఊజి ఈగ నష్ట పరుస్తోంది. ఇప్పటికే మంచి అదనుమీదున్న పంట ఒక్కసారిగా దెబ్బతింది. ముఖ్యంగా టమాటాలపై ఈ ఈగ ఎక్కువగా కనిపిస్తోంది. కాయలు మొత్తం రంధ్రాలు పడుతున్నాయి. ఊజి ఈగలు పచ్చి, దోర, పండు టమాటాలపై వాలి ఎక్కువగా రంధ్రాలు చేస్తున్నాయి. దీంతో కాయలు మెత్తబడి రంధ్రాల గుండా నీరు కారుతోంది. కాయల్ని తోటల్లో నుంచి కోసినా మార్కెట్‌కు తరలించలేకపోతున్నారు.
35 శాతం పంట నష్టం
ఊజి ఈగతో ప్రస్తుతం 35 శాతం మేరకు పంటను రైతులు నష్టపోతున్నారు. ఎకరాకు ప్రస్తుతం 100 నుంచి 120 క్రేట్‌లు (25కేజీలు) దిగుబడి వస్తోంది. ఊజి ప్రభావంతో దెబ్బతిన్న టమాటాలు 35 నుంచి 40 క్రేట్‌లు ఉంటున్నాయి. జిల్లాలో ప్రస్తుతం రోజుకు 45వేల క్వింటాళ్ల స్టాకు వస్తోంది. ఊజి ఈగతో 15 వేల క్వింటాళ్ల టమాటాలు దెబ్బతిన్నాయి. పలువురు రైతులు ఈ రకం టమాటాలను తోట ల వద్దనే కోత సమయాల్లో కోసి పారబోస్తున్నారు. పలువురు రైతులు మార్కెట్లకు వాటిని తీసుకొస్తున్నా వ్యాపారులు కొనుగోలు చేయ డం లేదు. దీంతో దెబ్బతిన్న టమాటాలను రోడ్ల పక్కనే పారబోసి వెళ్లిపోతున్నారు. ఆ టమాటాలు పశుగ్రాసంగా మారుతున్నాయి.
ధరలున్నా నష్టపోతున్న రైతులు
ప్రస్తుతం మార్కెట్లో టమాటా ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఒక క్రేట్ (25కేజీల) ధర రూ.700 నుంచి రూ.850 వరకు పలుకుతోంది. అయితే ఊజి ఈగ ప్రభావంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. చాలా రోజుల తరువాత మార్కెట్లో టమాటాకు గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయి. అయితే టమాటా రైతులను దురదృష్టం ఊజి ఈగ రూపంలో మరోసారి వెంటాడింది. దీంతో రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment