ఉమ్మారెడ్డి ఎన్నిక లాంఛనమే !
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్
పట్నంబజారు(గుంటూరు) : గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎన్నిక లాంఛనమేనని పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ స్పష్టం చేశారు. అరండల్‌పేటలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ఘట్టం ముగియడంతో కేవలం జిల్లా నుంచి ఉమ్మారెడ్డి, మరో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి నామినేషన్ ధాఖలు చేశారన్నారు.
వైఎస్సార్‌సీపీకి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్‌ల మద్దతు 570కి పైగా ఉందని తెలిపారు. దీనితో ఏకగ్రీవం తథ్యమని, ఎన్నిక పక్రియ లాంఛనంగా జరుగుతుందని తెలిపారు. అపార అనుభవం ఉన్న రాజకీయ భీష్ముడు ఉమ్మారెడ్డి ఎన్నికవడం సంతోషకరమన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్ధి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పోటీకి సిద్ధమైనట్టు తెలిపారు.
పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహకమండలి సభ్యుడు రావి వెంకటరమణ, రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున,పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మారెడ్డి అనుభవం జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం పార్టీ నేతలు ఉమ్మారెడ్డికి పుష్ఫగుచ్ఛాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. మిఠాయిలు పంపిణీ చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము), సంయుక్త కార్యదర్శి చందోలు డేవిడ్‌విజయ్‌కుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కావటి మనోహర్ నాయుడు, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కొత్తా చిన్నపరెడ్డి, ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మొగిలి మధు, కిలారి రోశయ్య, డైమండ్‌బాబు, జెడ్పీటీసీ కొలకలూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.