స్కూల్ మేనేజ్‌మెంట్ ఖాతాలు..ఖాళీ
కమిటీలకు తెలియకుండా మళ్లింపు
మౌలిక సదుపాయాల కల్పనకు ఆటంకం
లబోదిబోమంటున్న ప్రధానోపాధ్యాయులు
సర్కారు తీరుపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం
గుంటూరు : అభివృద్ధి పనులకు నిధుల్లేవని ఎస్‌ఎంసీ (స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ) ఖాతాల్లోని నగదును ప్రభుత్వం వెనక్కు లాక్కుంది. మరుగుదొడ్ల నిర్వహణ, చాక్‌పీస్‌లు తదితరాల కొనుగోలుకు విడుదల చేసిన రూ.20 కోట్లను ఆ కమిటీ సభ్యుల ప్రమేయం లేకుండానే ఈ నెల 13వ తేదీన మళ్లించుకుంది. దీంతో జిల్లాలోని 3,600 ఎస్‌ఎంసీ కమిటీల బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యాయి. ఇది తెలుసుకున్న కమిటీ సభ్యులు పాఠశాలల మౌలిక సదుపాయాలకు నగదు చెల్లించే అవకాశం లేక ఆ సౌకర్యాలను నిలిపివేస్తుండటంతో విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారు.
జిల్లాలోని పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వం ప్రతీ ఏటా నిధులు విడుదల చేస్తోంది. ఈ నిధులను మౌలిక సదుపాయాల కల్పన, స్టేషనరీ, ఆట వస్తువుల కొనుగోలు, విద్యుత్ బిల్లుల చెల్లింపు, చిన్న చిన్న మరమ్మతులకు కమిటీ సభ్యులు వినియోగించు కోవాలి. అరకొరగా విడుదలవుతున్న ఈ నిధులను ముఖ్యంగా మరుగుదొడ్ల క్లీనింగ్, తాగునీటి సరఫరా, చాక్‌పీసుల కొనుగోలు, విద్యుత్ చార్జీల చెల్లింపులకు కేటారుుస్తున్నారు. పాఠశాలల స్థాయిని బట్టి ఈ నిధుల కేటాయింపు ఉంటుంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు స్కూల్ గ్రాంట్ కింద రూ. 5 వేలు, మెయింటెనెన్స్ గ్రాంటు కింద రూ. 5 వేలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు స్కూల్ గ్రాంటు కింద రూ. 7 వేలు, మెయింటెనెన్స్ గ్రాంటు కింద రూ. 10 వేల చొప్పున ప్రతి ఏటా సర్వశిక్షా అభియాన్ ఎస్‌ఎంసీ ఖాతాలకు జమ చేస్తుంటుంది. వీటిని ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా (మార్చి) ఖర్చు చేయాలి. ఈ నిధులు డ్రా చేయాలంటే కచ్చితంగా ఎస్‌ఎంసీ చైర్మన్‌తోపాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంతకం చేయాల్సి ఉంటుంది.
ఎంఈవోలు, హెచ్‌ఎంలే చైర్మన్ సభ్యులుగా ...
2014 జూన్‌లో ఎస్‌ఎంసీ కమిటీల పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి కమిటీలను ఏర్పాటు చేయకపోవడంతో ఎంఈవోలు కమిటీలకు చైర్మన్, ప్రధానోపాధ్యాయులు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. వీరే పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర ఖర్చులకు నిధులు చెల్లిస్తున్నారు. ఈ నెల 15వ తేదీన ఎస్‌ఎంసీ బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును సర్వశిక్షాఅభియాన్ అధికారులు ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయుల ప్రమేయం లేకుండానే వెనక్కు మళ్లించుకున్నారు. కొన్ని బ్యాంకు ఖాతాల్లో పాత నిల్వతో పాటు ఈ ఏడాది విడులైన నిధులూ వెనక్కు తీసుకోవడంతో ప్రధానోపాధ్యాయులు లబోదిబోమంటున్నారు. ప్రతి నెలా మొదటి వారంలోనే మరుగుదొడ్ల క్లీనింగ్, తాగునీటి సరఫరా, చాక్ పీసులు, విద్యుత్ బిల్లుల చెల్లింపులకు కనీసం రూ.3 వేలకుపైగా ఖర్చు అవుతుందని, వీటిని ఎలా చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. మార్చికి మరో నాలుగు నెలల సమయం ఉండగానే నిధులను వెనక్కు తీసుకోవడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. గురువారం యూటీఎఫ్ నాయకులు ప్రాజెక్టు అధికారిని కలిసి నిధుల మళ్లింపుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ విషయమై సర్వశిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు అధికారి ఏ. రమేష్‌కుమార్‌ను వివరణ కోరగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, మళ్లించిన నిధులను సివిల్ వర్క్‌లకు వినియోగిస్తామని చెప్పారు.
కనీస సౌకర్యాలు కల్పించ లేరు ...
ఎస్‌ఎంసీ ఖాతాల్లోని నగదును వెనక్కు తీసుకోవడం దారుణం. దీంతో బడుల్లో కనీసం చాక్ పీసులు కూడా కొనుక్కోలేని దుస్థితి ఏర్పడుతుంది. మరుగుదొడ్ల నిర్వహణకూ ఆటంకమే. బ్యాంకుల్లో సున్నా నిధులు ఉంటే పాఠశాల నిర్వహణ ఎలా సాధ్యపడుతుంది. బడుల్లో సాధారణ సౌకర్యాలూ తీర్చుకోలేని దుస్థితి ఎదురవుతుంది.
- కె. బసవలింగారావు, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
రూ.20కోట్లు లాగేశారు
Published Thu, Nov 19 2015 12:22 AM | Last Updated on Sat, Sep 15 2018 5:49 PM
Advertisement
Advertisement