Teacher Association
-
జోనల్ విధానమే టీచర్లకు మేలు: పాతూరి
హైదరాబాద్: జోనల్ విధానం రద్దు వల్ల ఉపాధ్యాయులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలంగాణ శాసనమండలి సభ్యుడు పాతూరి సుధాకర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం లక్డీకాపూల్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ... నెలరోజుల్లో ఉపాధ్యాయుల సర్వీస్‌రూల్స్ సాధించ నున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సమస్యలన్నీ ఆమోదయోగ్యమైనవని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతీ ఎస్సీ, ఎస్టీ విద్యార్థి రెసిడెన్షియల్ పాఠశాలలోనే విద్య కొనసాగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఏప్రిల్ చివరివారంలో తెలంగాణ విద్యా మహాసభ నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రతినిధులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనోతు కిషన్ నాయక్, ప్రధాన కార్యదర్శి కై లాసం, గౌరవాధ్యక్షుడు సంతోష్ నాయక్, హరిలాల్, తిరుపతి పలుజిల్లాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
గురుకులాల్లో 4,616 పోస్టులు
- బోధన, బోధనేతర పోస్టులను మంజూరు చేసిన సర్కారు - స్కూళ్లకు 3,090.. డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలకు 1,526 పోస్టులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించనున్న ఎస్సీ గురుకులాలకు 4,616 బోధన, బోధనేతర పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వాటితోపాటు 733 పోస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేసేందుకు అనుమతించింది. ఈ మేరకు మంజూరు అనుమతులు, పోస్టుల వివరాలతో రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ ఆధ్యర్యంలో 103 పాఠశాలలు, 30 డి గ్రీ రెసిడెన్షియల్ కాలేజీలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు స్వీకరించిన ప్రభుత్వం... కొత్త పోస్టులను మంజూరు చేసింది. బోధన, బోధనేతర పోస్టులు కలిపి గురుకుల స్కూళ్లకు 3,090 పోస్టులు, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలకు 1,526 పోస్టులు ఇచ్చింది. మూడేళ్ల వ్యవధిలో ఈ పోస్టులను భర్తీ చేసేందుకు వీలుగా ఉత్తర్వులు ఇచ్చింది. 2016-17లో 2,205 పోస్టులు, 2017-18లో 905 పోస్టులు, 2018-19లో 1,506 పోస్టులను భర్తీ చేస్తారు. గురుకుల ఉపాధ్యాయ సంఘం హర్షం రాష్ర్ట ఎస్సీ గురుకులాల సొసైటీల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 4,616 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయడం పట్ల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈమేరకు గురుకుల ఉపాధ్యాయుల సంఘం బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ సంఘ నాయకులు రామలక్ష్మణ్, అర్జున, లచ్చయ్య, దానంలు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల 103 ఎస్సీ గురుకులాలు, 30 డిగ్రీ కాలేజీలను మంజూరు చేసిన ప్రభుత్వం, వాటిలో పనిచేసేందుకు ఉద్యోగ సిబ్బంది, ఉపాధ్యాయ, ప్రిన్సిపాళ్ల నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం పట్ల ప్రకటనలో సంతోషాన్ని వ్యక్తంచేశారు. ఏయే పోస్టులు.. ► రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించి ప్రిన్సిపాల్, జూనియర్ లెక్చరర్లు, పీజీటీలు, టీజీటీలు, పీఈటీ, పీడీ, లైబ్రేరియన్, స్టాఫ్ నర్స్, క్రాఫ్ట్ ఆర్ట్/మ్యూజిక్ టీచర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు. ►డిగ్రీ కాలేజీలకు సంబంధించి ప్రిన్సిపాల్, డిగ్రీ కాలేజీ లెక్చరర్, లైబ్రేరియన్, పీడీ, సూపరింటెండెంట్, హెల్త్ సూపర్వైజర్, సీనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ లాబ్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, స్టోర్ కీపర్ పోస్టులు ►ఎస్సీ గురుకులాల కార్యద ర్శి కార్యాలయంలో అదనపు కార్యదర్శి, ఉప కార్యదర్శి, ఈఈ, అసిస్టెంట్ సెక్రెటరీ, అసిస్టెంట్ సెక్రెటరీ (ఆడిట్), సూపరింటెండెంట్, జేఏసీటీ పోస్టులు ► ఇక ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసే 733 పోస్టుల్లో ఐసీటీ ఇన్స్ట్రక్టర్, జూనియర్ అసిస్టెంట్/డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్, లాబ్ అటెండర్ సర్వీసులు... డిగ్రీ కాలేజీల్లో జూనియర్ అసిస్టెంట్, హెర్బారియం, మ్యూజియం కీపర్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఉన్నాయి. వీటిని కూడా మూడేళ్లలో (2016-19) నియమించుకునేందుకు అనుమతించారు. -
ఉద్యోగ సమాచారం
ఆయుష్’లో వివిధ పోస్టులు ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని నార్త ఈస్టర్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ హోమియోపతి (ఎన్ఈఐఏహెచ్).. డెరైక్ట్ రిక్రూట్మెంట్/ కాంట్రాక్ట్/ డిప్యుటేషన్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 110. దరఖాస్తుకు చివరి తేది జనవరి 4. వివరాలకు www.indianmedicine. nic.inచూడొచ్చు. ‘బెల్’లో ఇంజనీర్లు బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్).. వివిధ విభాగాల్లో డిప్యూటీ ఇంజనీర్ (ఖాళీలు-5), ఆర్కిటెక్ట్ (ఖాళీలు-1), సీనియర్ ఇంజనీర్ (ఖాళీలు-9), డిప్యూటీ మేనేజర్ (ఖాళీలు-2), మేనేజర్ (ఖాళీలు-3) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 19. వివరాలకు www.bel-india.comచూడొచ్చు. చిదంబరనార్ పోర్టలో వివిధ పోస్టులు ట్యుటికోరిన్‌లోని వి.ఒ.చిదంబరనార్ పోర్ట ట్రస్ట్.. వివిధ విభాగాల్లో టగ్ మాస్టర్, డ్రైవర్, సుక్కాని పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 17. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 14. వివరాలకు www.vocport. gov.in/port/userinterface/latestnews.aspxచూడొచ్చు. కేంద్ర సమాచార సంస్థలో లీగల్ కన్సల్టెంట్లు న్యూఢిల్లీలోని కేంద్ర సమాచార సంస్థ (సీఐసీ).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన లీగల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 13. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 8. వివరాలకు www.cic.gov.inచూడొచ్చు. బీఎస్ఎఫ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స (బీఎస్ఎఫ్).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 5. ఇంటర్వ్యూ తేదీలు డిసెంబర్ 14-17. వివరాలకు www.bsf.nic.inచూడొచ్చు. కేరళ ఐఐఐటీఎంలో వివిధ పోస్టులు కేరళలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (ఐఐఐటీఎం).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఆపరేషన్స ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, ఫైనాన్స ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 4. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 30. వివరాలకు www.iiitmk.ac.inచూడొచ్చు. ప్రమాణాల వల్లే విజ్ఞాన్స్‌కు న్యాక్ ‘ఏ’ గ్రేడ్ హైదరాబాద్: విద్యాబోధనలో తాము అనుసరిస్తున్న అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల ఫలితంగానే విజ్ఞాన్స్ యూనివర్సిటీకి న్యాక్ ‘ఏ’ గ్రేడ్ లభించిందని విజ్ఞాన్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య ఒక ప్రకటనలో తెలిపారు. న్యాక్ ‘ఏ’ గ్రేడ్ ప్రకటించిన నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని వడ్లమూడిలో ఉన్న వర్సిటీ ప్రాంగణంలో సోమవారం అభినందన సభ నిర్వహించామన్నారు. ఇక్కడి విద్యా వసతులు, విద్యార్థులకు అందుతున్న ఉజ్వల భవిష్యత్తు ఫలితంగానే న్యాక్ గుర్తింపు సాధించామని పేర్కొన్నారు. విద్యా విధానంలో మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడం, ఆధునిక బోధనా పద్ధతులు, పరిశోధనాంశాల్లో ప్రాధాన్యతలే తమ విజయ రహస్యాలని తెలిపారు. గణితంలో ఫెయిల్ చేశారంటూ ఆందోళన డీఎస్ఈ ఎదుట విద్యార్థుల ధర్నా సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షల్లో గణిత సబ్జెక్టులో అడ్డగోలుగా ఫెయిల్ చేశారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వేల మంది విద్యార్థులకు 0, 1, 2, 3, 4 చొప్పున మార్కులు వేసి, భవిష్యత్తును నాశనం చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం పాఠశాల విద్యా డెరైక్టర్ (డీఎస్ఈ) కార్యాలయం ఎదుట వందలాదిమంది విద్యార్థులు ధర్నా చేశారు. పేపరు మూల్యాంకనంలో పొరపాట్లు చేశారని, అందుకే తామంతా ఫెయిల్ అయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డి మాండ్ చేశారు. అనంతరం పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్‌కు విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ అంశంపై విచారణ జరిపిస్తామని, అన్యాయం జరిగితే విద్యార్థులకు న్యాయం చేస్తామని డెరైక్టర్ హామీ ఇచ్చారు. ‘డీఎడ్’ రీవాల్యూయేషన్ చేపట్టాలి డీఈడీ, బీఈడీ విద్యార్థి సమాఖ్య డిమండ్ సాక్షి, హైదరాబాద్: డీఎడ్ చివరి సంవత్సరం విద్యార్థుల పరీక్ష పేపర్లు రీవాల్యుయేషన్ చేపట్టాలని రాష్ట్ర డీఈడీ, బీఈడీ విద్యార్థి సమాఖ్య డిమాండ్ చేసింది. శనివారం విడుదలైన డీ ఎడ్ ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు వేల మంది విద్యార్థులు ఫెయిలయ్యారని పేర్కొన్నారు. దీని వెనుక అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఈ మేరకు సమాఖ్య సభ్యులు సోమవారం ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం అక్కడి నుంచి దాదాపు 500 మంది విద్యార్థులు ర్యాలీగా తరలివచ్చి, పాఠశాల విద్య డెరైక్టరేట్‌ను ముట్టడించారు. డెరైక్టర్ జి. కిషన్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొండా గణేశ్, కార్యదర్శి నరేశ్, అశోక్, మున్నా తదితరులు పాల్గొన్నారు. వేతన సవరణ వ్యత్యాసాలు సవరించాలి సాంఘిక గురుకుల ఉపాధ్యాయ సంఘం సాక్షి, హైదరాబాద్: వేతన సవరణ (పీఆర్సీ) నేపథ్యంలో ఎస్సీ గురుకుల సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వేతన వ్యత్యాసాలు సవరించాలని, హెల్త్కార్డులివ్వాలని సాంఘిక గురుకుల ఉపాధ్యాయ సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం సచివాలయంలో ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి మహేశ్ దత్ ఎక్కాను కలసి వినతి పత్రం ఇచ్చారు. ఉద్యోగ ఖాళీలను భర్తీచేయాలని, 10 పద్దు కింద జీతాలివ్వాలని, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలని కోరింది. ఎక్కాను కలసిన వారిలో సంఘం ప్రతినిధులు కె.అర్జున, జె.రామలక్ష్మణ్, రంగాస్వామి, దానం, నగేశ్, నర్సింహులు ఉన్నారు. ఏపీ టెన్త్ ఫీజు గడువు 30 వరకు పెంపు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు, వరదలు తీవ్రంగా ఉండడం, పాఠశాలల్లో కార్యకలాపాలు స్తంభించడంతో పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపును ఏపీ ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 30 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరక్టరేట్ కమిషనర్ ఎంఆర్ ప్రసన్నకుమార్ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. డిసెంబర్ 7 వరకు రూ.50, డిసెంబర్ 16 వరకు రూ.200, డిసెంబర్ 30 వరకు రూ.500 అపరాధ రుసుముతో చెల్లించవచ్చని వివరించారు. టీఎస్‌తో పాటే ఏపీలోనూ ఇంటర్ పరీక్షలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ పరీక్షలను తెలంగాణ ఇంటర్ బోర్డు రూపొందించిన షెడ్యూల్‌తోనే కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఇంటర్ బోర్డు 2016 మార్చి 2 నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు సోమవారం షెడ్యూల్‌ను విడుదల చేయడంతో అవే తేదీల్లో ఏపీలోనూ ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు షెడ్యూల్‌ను విద్యాశాఖ కార్యదర్శి ఆర్పీ సిసోడియాకు సమర్పించారు. ఒకట్రెండు రోజుల్లో ఏపీ షెడ్యూల్‌ను కూడా ఇదే తేదీల్లో ఉండేలా ఖరారు చేసి అధికారికంగా ప్రకటించనున్నారు. గతంలో ఇంటర్ పరీక్షలు మార్చి 11 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం షెడ్యూల్‌ను ప్రకటించడం తెలిసిందే. అలాగే పదో తరగతి పరీక్షలను కూడా తెలంగాణ ఎస్ఎస్సీ బోర్డు షెడ్యూల్‌తో సమానంగానే నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ పరీక్షల విభాగం అధికారులతో ఏపీ అధికారులు చర్చించినట్లు సమాచారం. -
రూ.20కోట్లు లాగేశారు
స్కూల్ మేనేజ్మెంట్ ఖాతాలు..ఖాళీ కమిటీలకు తెలియకుండా మళ్లింపు మౌలిక సదుపాయాల కల్పనకు ఆటంకం లబోదిబోమంటున్న ప్రధానోపాధ్యాయులు సర్కారు తీరుపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం గుంటూరు : అభివృద్ధి పనులకు నిధుల్లేవని ఎస్ఎంసీ (స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ) ఖాతాల్లోని నగదును ప్రభుత్వం వెనక్కు లాక్కుంది. మరుగుదొడ్ల నిర్వహణ, చాక్‌పీస్‌లు తదితరాల కొనుగోలుకు విడుదల చేసిన రూ.20 కోట్లను ఆ కమిటీ సభ్యుల ప్రమేయం లేకుండానే ఈ నెల 13వ తేదీన మళ్లించుకుంది. దీంతో జిల్లాలోని 3,600 ఎస్ఎంసీ కమిటీల బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యాయి. ఇది తెలుసుకున్న కమిటీ సభ్యులు పాఠశాలల మౌలిక సదుపాయాలకు నగదు చెల్లించే అవకాశం లేక ఆ సౌకర్యాలను నిలిపివేస్తుండటంతో విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారు. జిల్లాలోని పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వం ప్రతీ ఏటా నిధులు విడుదల చేస్తోంది. ఈ నిధులను మౌలిక సదుపాయాల కల్పన, స్టేషనరీ, ఆట వస్తువుల కొనుగోలు, విద్యుత్ బిల్లుల చెల్లింపు, చిన్న చిన్న మరమ్మతులకు కమిటీ సభ్యులు వినియోగించు కోవాలి. అరకొరగా విడుదలవుతున్న ఈ నిధులను ముఖ్యంగా మరుగుదొడ్ల క్లీనింగ్, తాగునీటి సరఫరా, చాక్‌పీసుల కొనుగోలు, విద్యుత్ చార్జీల చెల్లింపులకు కేటారుుస్తున్నారు. పాఠశాలల స్థాయిని బట్టి ఈ నిధుల కేటాయింపు ఉంటుంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు స్కూల్ గ్రాంట్ కింద రూ. 5 వేలు, మెయింటెనెన్స్ గ్రాంటు కింద రూ. 5 వేలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు స్కూల్ గ్రాంటు కింద రూ. 7 వేలు, మెయింటెనెన్స్ గ్రాంటు కింద రూ. 10 వేల చొప్పున ప్రతి ఏటా సర్వశిక్షా అభియాన్ ఎస్ఎంసీ ఖాతాలకు జమ చేస్తుంటుంది. వీటిని ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా (మార్చి) ఖర్చు చేయాలి. ఈ నిధులు డ్రా చేయాలంటే కచ్చితంగా ఎస్ఎంసీ చైర్మన్‌తోపాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంతకం చేయాల్సి ఉంటుంది. ఎంఈవోలు, హెచ్ఎంలే చైర్మన్ సభ్యులుగా ... 2014 జూన్‌లో ఎస్ఎంసీ కమిటీల పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి కమిటీలను ఏర్పాటు చేయకపోవడంతో ఎంఈవోలు కమిటీలకు చైర్మన్, ప్రధానోపాధ్యాయులు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. వీరే పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర ఖర్చులకు నిధులు చెల్లిస్తున్నారు. ఈ నెల 15వ తేదీన ఎస్ఎంసీ బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును సర్వశిక్షాఅభియాన్ అధికారులు ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయుల ప్రమేయం లేకుండానే వెనక్కు మళ్లించుకున్నారు. కొన్ని బ్యాంకు ఖాతాల్లో పాత నిల్వతో పాటు ఈ ఏడాది విడులైన నిధులూ వెనక్కు తీసుకోవడంతో ప్రధానోపాధ్యాయులు లబోదిబోమంటున్నారు. ప్రతి నెలా మొదటి వారంలోనే మరుగుదొడ్ల క్లీనింగ్, తాగునీటి సరఫరా, చాక్ పీసులు, విద్యుత్ బిల్లుల చెల్లింపులకు కనీసం రూ.3 వేలకుపైగా ఖర్చు అవుతుందని, వీటిని ఎలా చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. మార్చికి మరో నాలుగు నెలల సమయం ఉండగానే నిధులను వెనక్కు తీసుకోవడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. గురువారం యూటీఎఫ్ నాయకులు ప్రాజెక్టు అధికారిని కలిసి నిధుల మళ్లింపుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై సర్వశిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు అధికారి ఏ. రమేష్‌కుమార్‌ను వివరణ కోరగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, మళ్లించిన నిధులను సివిల్ వర్క్‌లకు వినియోగిస్తామని చెప్పారు. కనీస సౌకర్యాలు కల్పించ లేరు ... ఎస్ఎంసీ ఖాతాల్లోని నగదును వెనక్కు తీసుకోవడం దారుణం. దీంతో బడుల్లో కనీసం చాక్ పీసులు కూడా కొనుక్కోలేని దుస్థితి ఏర్పడుతుంది. మరుగుదొడ్ల నిర్వహణకూ ఆటంకమే. బ్యాంకుల్లో సున్నా నిధులు ఉంటే పాఠశాల నిర్వహణ ఎలా సాధ్యపడుతుంది. బడుల్లో సాధారణ సౌకర్యాలూ తీర్చుకోలేని దుస్థితి ఎదురవుతుంది. - కె. బసవలింగారావు, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
పీఎఫ్ ఖాతాలు ఆన్లైన్ చేయూలి
విజయనగరం అర్బన్ : ఉపాధ్యాయులు పీఎఫ్ ఖాతాలను తక్షణమే ఆన్లైన్ చేయూలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. పట్టణంలోని అమర్ భవనంలో ఆ సంఘ జిల్లా స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. రూ.కోట్ల నిధులతో ఉన్న ఉపాధ్యాయుల పీఎఫ్ ఖాతాలను తక్షణమే ఆన్లైన్ చేసి పారదర్శకంగా ఉంచకపోతే జిల్లా పరిషత్ కార్యాలయూన్ని ముట్టడించేందుకు నిర్ణయించింది. పదో పీఆర్సీని వెంటనే అమలు చేయూలని, అన్ని విద్యా సంస్థలను ఒకే గొడుగు కొందకు తేవాలని, అందరికీ కనీసం 62 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని కోరింది. డీఎస్సీ - 2014 నోటిఫికేషన్ వెలువరించే ముందు విధిగా ప్రమోషన్లు, బదిలీలు, రేషనలైజేషన్ ప్రక్రియలను చేపట్టి పూర్తి చేయూలని తీర్మానించింది. మోడల్ స్కూల్ సిబ్బందికి రావాల్సిన ఐఆర్, డీఏలు వెంటనే చెల్లించాలని, 610 జీఓపై బదిలీ కాకుండా ఈ జిల్లాలో కొనసాగుతున్న ఉపాధ్యాయులకు వెంటనే పదోన్నతలు కల్పించాలని సమావేశం కోరింది. మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా 60 సంవత్సరాల పదవీ విరమణ వర్తింపజేయూలని తీర్మానించింది. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పతివాడ నారాయణరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ జోసెఫ్, రాష్ట్ర కార్యదర్శి జీవీకే నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి మింది రామకృష్ణ, కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అయ్యవార్ల రాజకీయం!
అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లా విద్యాశాఖ అధికారి మధుసూదన్‌రావుపై కేసు నమోదైన విషయం జిల్లాలో కలకలం రేపుతోంది. తనను, సమాచార హక్కు చట్టాన్ని అవమానపరిచారంటూ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకుడు పెద్దన్న ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యం ఈ పరిస్థితికి దారితీసింది. జిల్లా చరిత్రలో మొట్ట మొదటిసారిగా ఒక జిల్లా విద్యా శాఖ అధికారిపై కేసు నమోదు కావడం విశేషం. గతం నుంచి కూడా జిల్లాలో పని చేసిన డీఈఓల పనితీరును పరిశీలిస్తే మాత్రం ఇక్కడ పని చేయడం కత్తిమీద సాములాగానే అనిపిస్తుంది. చూసీచూడనట్లుగా పోతుంటే ఓకే.. లేదంటే ఇబ్బందులకు గురి చేయడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో కొందరు చేతగాని అధికారులుగా ముద్ర వేసుకున్నారు. ఇదే సందర్భంలో పని చేసినంత కాలం తనదైన ముద్ర ఉండాలనే తాపత్రయంతో నిక్కచ్చిగా పని చేసిన అధికారులు ఇబ్బందులు పడిన సందర్భాలూ ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా మన జిల్లాలో ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. ఒకప్పుడు నాలుగైదు ఉన్న సంఘాలు అనతి కాలంలో పదుల సంఖ్యకు చేరుకున్నాయి. చాలా మంది సంఘాల నాయకులు తమ పంతం నెగ్గించుకునే క్రమంలో అధికారులను ఇబ్బందులకు గురి చేశారు. ముఖ్యంగా ప్రేమానందం డీఈఓగా వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు మరీ ఎక్కువయ్యాయి. గతాన్ని పరిశీలిస్తే.. 2000లో డీఈఓగా పని చేసిన ప్రభాకర్‌రెడ్డి ముక్కు సూటిగా పని చేశారు. పదోన్నతులు, బదిలీల్లో కౌన్సెలింగ్ పద్ధతి అమలయింది ఈయన హాయంలోనే. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, డీఈఓ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు గుర్తింపు పొందిన సంఘంగా ఉన్న యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డిని సస్పెండ్ చేయడం అప్పట్లో సంచలనం అయింది. ఈ క్రమంలో డీఈఓను ఇబ్బంది పెట్టేందుకు కొందరు నానా రకాలుగా ప్రయత్నాలు చేశారు. అప్పటికి కేవలం ఐదారు ఉపాధ్యాయ సంఘాలు మాత్రమే ఉండేవి. ఆతర్వాత వచ్చిన లక్ష్మీనారాయణ హాయాంలో ప్రశాంతంగా నడిచింది. ఆనందమూర్తి హయాంలో విపరీతమైన అక్రమాలు జరిగాయి. కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకుల పంట పండింది. ‘సింగిల్ ఆర్డర్’ ట్రాన్స్ఫర్ల అంశం రాష్ట్ర వ్యాప్తంగా మారు మోగింది. కొందరు నాయకుల నిర్వాకంతో చివరకు ఆయన్ను బలవంతంగా ఇక్కడి నుంచి తప్పించారు. తర్వాత వచ్చిన భార్గవ్ హాయాం ప్రశాంతంగా నడిచింది. ఆతర్వాత వచ్చిన అబ్దుల్‌హమీద్ నిబంధనలు అంటూ గట్టిగా స్పందించడంతో అంతే స్థాయిలో ఇబ్బందుల్లో ఇరుక్కుపోయారు. ప్రేమానందం వచ్చిన తర్వాత ఉపాధ్యాయ సంఘాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. నాయకుడిగా ఉంటే ఏదైనా పని చేయించుకోవచ్చనే భావనతో 6-7 సంఘాల నుంచి సుమారు 20కి పైగా తయారయ్యాయి. కొన్ని సంఘాల నాయకులు ప్రేమానందంను ‘ఆట’ ఆడించారు. బెదిరించి మరీ పనులు చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం డీఈగా పని చేస్తున్న మధుసూదన్‌రావు పైకి మెత్తగా కనిపించినా ఉపాధ్యాయుల విషయంలో కాస్త కటువుగానే వ్యవహరించారు. ‘టీచరు అంటే బడిలో ఉండాలి’ అనే ధోరణిలో వ్యవహరించి గాడిన పెట్టే చర్యలకు పూనుకున్నారు. ఈ క్రమంలో కొందరు సంఘాల నాయకులు ఈయన్ను ఇబ్బంది పెట్టిన సందర్భాలూ చాలా ఉన్నాయి. ఇక్కడ పనిచేసినంత కాలం తనదైన ముద్ర వేసుకోవాలనే తపనతో కాస్త నోరు జారి చివరకు కేసులో ఇరుక్కునే పరిస్థితి వచ్చింది. -
మాపై సస్పెన్షన్లను ఎత్తివేయండి
నర్సాపూర్,న్యూస్‌లైన్: ఇటీవల జరిగిన ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొని సస్పెన్షన్‌కు గురైన ఉపాధ్యాయులను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. బుధవారం నర్సాపూర్‌లో నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల పీఓలు, అసిస్టెంటు పీఓలకు శిక్షణ ఇచ్చారు. కాగా శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మాణయ్య,కృష్ణస్వామి, యాదగిరి, రవికుమార్, సంగయ్య, శ్రీనివాస్‌రావు, బుచ్చిరెడి తదితరులు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీందర్‌కు వినతి పత్రం అందచేశారు. ఇటీవల జిల్లాలో జరిగిన ఎంపీటీసీ ,జెడ్పీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయుల్లో ఐదుగురిని సస్పెండ్ చేశారని, ఈ విషయంలో ఉపాధ్యాయుల తప్పు లేకపోయినా వారిని సస్పెండ్ చేశారని వినతిపత్రంలో పేర్కొన్నారు. అంతేగాక పీఓలకు,ఏపీఓలకు సమానంగా అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ తాము శిక్షణ కార్యక్రమాన్ని అరగంట పాటు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయ సంఘం నేతల డిమాండ్‌ను రిటర్నింగ్ అధికారి రవీందర్ డీఈఓ రమేశ్ దృష్టికి తీసుకవెళ్లారు. ఈ విషయమై డీఈఓ స్పందిస్తూ వారంలోగా వారిని విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. దీంతో ఉపాధ్యాయ సంఘం నేతలు శాంతించడంతో శిక్షణ కార్యక్రమం యధావిధిగా కొనసాగింది. పీఓలు, ఏపీఓలకు శిక్షణ నర్సాపూర్ నియోజకవర్గంలోని పీఓలు,ఏిపీ ఓలకు బుధవారం శిక్షణ ఇచ్చారు. శిక్షణలో భాగంగా వారికి ఏవీఎంల పనితీరు, ఇతర అంశాలపై రిటర్నింగ్ అధికారి రవీందర్, అసిస్టెంటు రిటర్నింగ్ అధికారి నరేందర్, ఇతర అధికారులు శిక్షణ ఇచ్చారు.