గురుకులాల్లో 4,616 పోస్టులు
- బోధన, బోధనేతర పోస్టులను మంజూరు చేసిన సర్కారు
- స్కూళ్లకు 3,090.. డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలకు 1,526 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించనున్న ఎస్సీ గురుకులాలకు 4,616 బోధన, బోధనేతర పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వాటితోపాటు 733 పోస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేసేందుకు అనుమతించింది. ఈ మేరకు మంజూరు అనుమతులు, పోస్టుల వివరాలతో రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ ఆధ్యర్యంలో 103 పాఠశాలలు, 30 డి గ్రీ రెసిడెన్షియల్ కాలేజీలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు స్వీకరించిన ప్రభుత్వం... కొత్త పోస్టులను మంజూరు చేసింది. బోధన, బోధనేతర పోస్టులు కలిపి గురుకుల స్కూళ్లకు 3,090 పోస్టులు, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలకు 1,526 పోస్టులు ఇచ్చింది. మూడేళ్ల వ్యవధిలో ఈ పోస్టులను భర్తీ చేసేందుకు వీలుగా ఉత్తర్వులు ఇచ్చింది. 2016-17లో 2,205 పోస్టులు, 2017-18లో 905 పోస్టులు, 2018-19లో 1,506 పోస్టులను భర్తీ చేస్తారు.
గురుకుల ఉపాధ్యాయ సంఘం హర్షం
రాష్ర్ట ఎస్సీ గురుకులాల సొసైటీల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 4,616 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయడం పట్ల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈమేరకు గురుకుల ఉపాధ్యాయుల సంఘం బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ సంఘ నాయకులు రామలక్ష్మణ్, అర్జున, లచ్చయ్య, దానంలు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల 103 ఎస్సీ గురుకులాలు, 30 డిగ్రీ కాలేజీలను మంజూరు చేసిన ప్రభుత్వం, వాటిలో పనిచేసేందుకు ఉద్యోగ సిబ్బంది, ఉపాధ్యాయ, ప్రిన్సిపాళ్ల నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం పట్ల ప్రకటనలో సంతోషాన్ని వ్యక్తంచేశారు.
ఏయే పోస్టులు..
► రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించి ప్రిన్సిపాల్, జూనియర్ లెక్చరర్లు, పీజీటీలు, టీజీటీలు, పీఈటీ, పీడీ, లైబ్రేరియన్, స్టాఫ్ నర్స్, క్రాఫ్ట్ ఆర్ట్/మ్యూజిక్ టీచర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు.
►డిగ్రీ కాలేజీలకు సంబంధించి ప్రిన్సిపాల్, డిగ్రీ కాలేజీ లెక్చరర్, లైబ్రేరియన్, పీడీ, సూపరింటెండెంట్, హెల్త్ సూపర్‌వైజర్, సీనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ లాబ్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, స్టోర్ కీపర్ పోస్టులు
►ఎస్సీ గురుకులాల కార్యద ర్శి కార్యాలయంలో అదనపు కార్యదర్శి, ఉప కార్యదర్శి, ఈఈ, అసిస్టెంట్ సెక్రెటరీ, అసిస్టెంట్ సెక్రెటరీ (ఆడిట్), సూపరింటెండెంట్, జేఏసీటీ పోస్టులు
► ఇక ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసే 733 పోస్టుల్లో ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్, జూనియర్ అసిస్టెంట్/డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్, లాబ్ అటెండర్ సర్వీసులు... డిగ్రీ కాలేజీల్లో జూనియర్ అసిస్టెంట్, హెర్బారియం, మ్యూజియం కీపర్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఉన్నాయి. వీటిని కూడా మూడేళ్లలో (2016-19) నియమించుకునేందుకు అనుమతించారు.