అయ్యవార్ల రాజకీయం!
అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లా విద్యాశాఖ అధికారి మధుసూదన్‌రావుపై కేసు నమోదైన విషయం జిల్లాలో కలకలం రేపుతోంది. తనను, సమాచార హక్కు చట్టాన్ని అవమానపరిచారంటూ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకుడు పెద్దన్న ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యం ఈ పరిస్థితికి దారితీసింది. జిల్లా చరిత్రలో మొట్ట మొదటిసారిగా ఒక జిల్లా విద్యా శాఖ అధికారిపై కేసు నమోదు కావడం విశేషం. గతం నుంచి కూడా జిల్లాలో పని చేసిన డీఈఓల పనితీరును పరిశీలిస్తే మాత్రం ఇక్కడ పని చేయడం కత్తిమీద సాములాగానే అనిపిస్తుంది. చూసీచూడనట్లుగా పోతుంటే ఓకే.. లేదంటే ఇబ్బందులకు గురి చేయడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో కొందరు చేతగాని అధికారులుగా ముద్ర వేసుకున్నారు.
ఇదే సందర్భంలో పని చేసినంత కాలం తనదైన ముద్ర ఉండాలనే తాపత్రయంతో నిక్కచ్చిగా పని చేసిన అధికారులు ఇబ్బందులు పడిన సందర్భాలూ ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా మన జిల్లాలో ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. ఒకప్పుడు నాలుగైదు ఉన్న సంఘాలు అనతి కాలంలో పదుల సంఖ్యకు చేరుకున్నాయి. చాలా మంది సంఘాల నాయకులు తమ పంతం నెగ్గించుకునే క్రమంలో అధికారులను ఇబ్బందులకు గురి చేశారు. ముఖ్యంగా ప్రేమానందం డీఈఓగా వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు మరీ ఎక్కువయ్యాయి.
గతాన్ని పరిశీలిస్తే..
2000లో డీఈఓగా పని చేసిన ప్రభాకర్‌రెడ్డి ముక్కు సూటిగా పని చేశారు. పదోన్నతులు, బదిలీల్లో కౌన్సెలింగ్ పద్ధతి అమలయింది ఈయన హాయంలోనే. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, డీఈఓ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు గుర్తింపు పొందిన సంఘంగా ఉన్న యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డిని సస్పెండ్ చేయడం అప్పట్లో సంచలనం అయింది. ఈ క్రమంలో డీఈఓను ఇబ్బంది పెట్టేందుకు కొందరు నానా రకాలుగా ప్రయత్నాలు చేశారు. అప్పటికి కేవలం ఐదారు ఉపాధ్యాయ సంఘాలు మాత్రమే ఉండేవి. ఆతర్వాత వచ్చిన లక్ష్మీనారాయణ హాయాంలో ప్రశాంతంగా నడిచింది. ఆనందమూర్తి హయాంలో విపరీతమైన అక్రమాలు జరిగాయి.
కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకుల పంట పండింది. ‘సింగిల్ ఆర్డర్’ ట్రాన్స్‌ఫర్ల అంశం రాష్ట్ర వ్యాప్తంగా మారు మోగింది. కొందరు నాయకుల నిర్వాకంతో చివరకు ఆయన్ను బలవంతంగా ఇక్కడి నుంచి తప్పించారు. తర్వాత వచ్చిన భార్గవ్ హాయాం ప్రశాంతంగా నడిచింది. ఆతర్వాత వచ్చిన అబ్దుల్‌హమీద్ నిబంధనలు అంటూ గట్టిగా స్పందించడంతో అంతే స్థాయిలో ఇబ్బందుల్లో ఇరుక్కుపోయారు. ప్రేమానందం వచ్చిన తర్వాత ఉపాధ్యాయ సంఘాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. నాయకుడిగా ఉంటే ఏదైనా పని చేయించుకోవచ్చనే భావనతో 6-7 సంఘాల నుంచి సుమారు 20కి పైగా తయారయ్యాయి.
కొన్ని సంఘాల నాయకులు ప్రేమానందంను ‘ఆట’ ఆడించారు. బెదిరించి మరీ పనులు చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం డీఈగా పని చేస్తున్న మధుసూదన్‌రావు పైకి మెత్తగా కనిపించినా ఉపాధ్యాయుల విషయంలో కాస్త కటువుగానే వ్యవహరించారు. ‘టీచరు అంటే బడిలో ఉండాలి’ అనే ధోరణిలో వ్యవహరించి గాడిన పెట్టే చర్యలకు పూనుకున్నారు. ఈ క్రమంలో కొందరు సంఘాల నాయకులు ఈయన్ను ఇబ్బంది పెట్టిన సందర్భాలూ చాలా ఉన్నాయి. ఇక్కడ పనిచేసినంత కాలం తనదైన ముద్ర వేసుకోవాలనే తపనతో కాస్త నోరు జారి చివరకు కేసులో ఇరుక్కునే పరిస్థితి వచ్చింది.