
దాచిపెట్టే ధోరణి ఎందుకు?
ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ ఎంపీ ఉండవల్లి
సాక్షి, రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వాస్తవస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పోలవరం పనులపై ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టే ధోరణి ప్రదర్శిస్తోందని ప్రశ్నించారు. 2018 జూన్ నాటికి పోలవరం కాపర్ డ్యామ్ పూర్తవుతుందని చెప్పిన ప్రభుత్వం, ఈలోగానే రూ.2 వేల కోట్లతో పురుషోత్తపట్నం ప్రాజెక్టు ఎందుకు చేపట్టిందని అడిగారు.
పట్టిసీమ ప్రాజెక్టుకు విద్యుత్ బిల్లులు ఏడాదికి రూ.185 కోట్లు ఎలా మంజూరు చేశారని, అదనంగా రూ.97 కోట్లు ఎందుకు విడుదల చేశారని ప్రశ్నించారు. ఏడాదికి 7 శాతం కూడా పనులు జరగకపోతే పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందన్నారు. కాంట్రాక్టర్‌ను మారిస్తే కొత్త రేట్లను ఎవరు భరిస్తారని ఉండవల్లి అరుణ్‌కుమార్ నిలదీశారు.