ఉపఎన్నికల్లో అధికార పార్టీలే గెలుస్తుంటాయి
-అంతమాత్రాన సాధారణ ఎన్నికల్లోనూ నెగ్గుతాయనుకోవటం పొరపాటు
- 2018కి పోలవరం పూర్తి చేస్తే వేల కోట్లతో పురుషోత్తపట్నం ఎందుకు?
- ఉండవల్లి అరుణ్‌కుమార్
సాక్షి, రాజమహేంద్రవరం: కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహా ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీనే గెలుస్తుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ నెగ్గినంత మాత్రాన 2019 సాధారణ ఎన్నికల్లో గెలుస్తుందని భావించడం పొరపాటన్నారు. 2012లో జరిగిన ఉపఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో టీడీపీకి ఆరు వేల ఓట్లు, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఎనిమిది వేల ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్లు గల్లంతయ్యాయని గుర్తు చేశారు. అదే 2014 సాధారణ ఎన్నికల్లో రామచంద్రపురంలో 21,712 ఓట్లు, నరసాపురంలో 16,922 ఓట్ల మెజారిటీతో టీడీపీ గెలిచిందని చెబుతూ... ఉప ఎన్నికలకు, సాధారణ ఎన్నికలకు మధ్య వ్యత్యాసాన్ని ఉదహరించారు. రాజమహేంద్రవరంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
కృష్ణా నీటిపై నోరు మెదపవేం..: పట్టిసీమ తరహాలోనే పనులు పూర్తికాక ముందే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని కూడా జాతికి అంకితం చేశారని ఉండవల్లి ఎద్దేవా చేశారు. పురుషోత్తపట్నం నుంచి నీళ్లు పారాలంటే గండికోట వద్ద అక్విడెక్టు, బావాజీపేట, మురారి, మల్లేపల్లి వద్ద వంతెనలు నిర్మించాల్సి ఉందన్నారు. ఈ పనులు పూర్తి కావడానికి మరో 3 నెలలు పడుతుందన్నారు. డిసెంబర్ నుంచి గోదావరిలో వరద ఉండదని, 2018 జూలైలో మాత్రమే మళ్లీ నీళ్లు తోడేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. మరోవైపు 2018 ఆగస్ట్‌కు పోలవరం కాçఫర్ డ్యాం నిర్మించి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తామని సీఎం చెబుతున్నారన్నారు.
అలాంటప్పుడు నెల పాటు నీళ్లు తోడేందుకు పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. 2016–17లో పట్టిసీమ విద్యుత్ బిల్లు రూ.89.87 కోట్లు అయితే రూ.185.60 కోట్లు చెల్లించాలంటూ జీవో ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కేటాయింపుల ప్రకారం రాష్ట్రానికి కృష్ణా జలాలు రాకున్నా నోరు మెదపని చంద్రబాబు.. గోదావరి మిగులు జలాలపై మన హక్కును గత సీఎంలు వదిలేశారంటూ కొత్త పాట పాడుతున్నారని మండిపడ్డారు. సమావే శంలో అల్లు బాబి తదితరులు పాల్గొన్నారు.