సాక్షి, పశ్చిమ గోదావరి : పోలవరం ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రాజెక్టును సమీక్షించేందుకు బుధవారం పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్నారు. దీంతో అక్కడికి భారీగా చేరుకున్న ఉభయ గోదావరి జిల్లాల బీజేపీ శ్రేణులు మంత్రి హెలిప్యాడ్ వద్దకు వెళ్లేందుకు యత్నించాయి. అయితే, ఇందుకు పోలీసులు నిరాకరించారు. పాసులు, ప్రాటోకాల్ పరిధిలో ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని తేల్చి చెప్పారు.
దీంతో తమను లోపలికి పంపాలని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మరోవైపు టీడీపీ నేతలు గడ్కరీ వస్తున్న హెలిప్యాడ్ వద్దకు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. దీనిపై పోలీసులను బీజేపీ కార్యకర్తలు ప్రశ్నించగా ప్రాజెక్టు పరిశీలన అనంతరం జరిగే ప్రత్యేక సమావేశంలో గడ్కరీని కలవాలని సూచించారు. వాస్తవానికి గడ్కరీ ప్రాజెక్టు పరిశీలన అనంతరం బీజేపీ నేతలు ఆయనతో ప్రత్యేక సమావేశానికి ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారు.
ఆయన రాక సందర్భంగా భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో బీజేపీకి ధీటుగా టీడీపీ సైతం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందనే ఉద్దేశంతో పోలీసులు ఈ ప్రాంతంలో ముందుగానే బలగాలను మొహరించారు.
Comments
Please login to add a commentAdd a comment