సాక్షి, తాడేపల్లి: పోలవరం ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా నిధులను విడుదల చేయాల్సిందిగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రిని కోరినట్టు మంత్రులు, అధికారులు వివరించారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. 2017-18 తాజా అంచనాల ప్రకారం ప్రాజెక్ట్ ఖర్చు 55,488 కోట్లుగా కేంద్రం గుర్తించింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా దీన్ని ఆమోదించిందని సీఎం జగన్ అన్నారు. ‘‘ఆర్థిక శాఖ రివ్యూ చేసి రూ.47,725 కోట్లకు కుదించింది. పోలవరం ప్రాజెక్ట్ పునరావాసానికి రూ.29వేల కోట్ల ఖర్చవుతుందని కేంద్ర జలశక్తిశాఖ, పోలవరం అథారిటీ గుర్తించిన విషయాన్ని’’ సీఎం ప్రస్తావించారు.
‘‘ప్రాజెక్ట్ పూర్తి ఖర్చును కుదించడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఏపీ ప్రభుత్వ పాత్ర కేవలం పర్యవేక్షణ మాత్రమే. ఏపీ ప్రయోజనాలు, ప్రజల అవసరాలను కేంద్రం దృష్టిలో ఉంచుకోవాలి. ప్రాజెక్ట్ అంచనాలతో పాటు పునరావాసం అంతా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సెంట్రల్ వాటర్ కమిషన్, జలశక్తి శాఖ ఆమోదించిన ప్రకారం నిధులు పరిగణనలోకి తీసుకోవాలని’’ సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. 2017లో కేబినెట్ ఆమోదానికి, ప్రస్తుత ప్రాజెక్ట్ ఖర్చుకు చాలా తేడా ఉందని, అప్పటి ప్రాజెక్ట్ లెక్కలు ఇప్పుడు చూడపం సరికాదని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ ఖర్చును కుదిస్తుంటే గత ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదని సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment