
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై గురువారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశాన్ని వర్చువల్‌గా నిర్వహిస్తామని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ లేఖ రాశారు. ఈ సమీక్షలో రాష్ట్ర జలవనరులశాఖ ఉన్నతాధికారులతోపాటు పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, సీడబ్ల్యూసీ చైర్మన్ హెచ్‌కే హల్దార్, డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్య తదితరులు పాల్గొననున్నారు. ప్రాజెక్టును 2022 నాటికి పూర్తిచేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనులను వేగవంతం చేసిన విషయం విదితమే.
ఈ సీజన్‌లో చేయాల్సిన పనుల ప్రగతిపై సమావేశంలో సమగ్రంగా సమీక్షిస్తారు. ఎగువ కాఫర్ డ్యామ్ పనులు, వరదను దిగువకు మళ్లించే స్పిల్‌వే పనులు, 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పనపై చర్చిస్తారు. గోదావరి వరదను స్పిల్‌వే మీదుగా మళ్లించడంపై సమీక్షించి, వరద సమయంలో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ పనులు చేపట్టి 2022 నాటికి ప్రాజెక్టును పూర్తిచేయడానికి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించనున్నారు.
రెండోసారి సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు పెట్టుబడి అనుమతి ఇవ్వడం, ఆ మేరకు నిధులు విడుదల చేయడం, రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు పనులకు ముందుగా ఖర్చుచేసిన నిధులను రీయింబర్స్ చేయడంలో జాప్యం లేకుండా చూడటం, ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయడానికి అవసరమైన సహకారం అందించడంపై కూడా సమావేశం అజెండాలో చేర్చాలని విజ్ఞప్తి చేస్తూ బుధవారం కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు లేఖ రాశారు.
పనుల పరిశీలన
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను బుధవారం ప్రత్యేక అధికారుల బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, సీఈ సీడీవో కె.శ్రీనివాస్, సీఈ హైడ్రాలజీ టీఎన్‌వీ కుమార్, ఆంధ్రా రీజియన్ క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజినీర్ రేవు సతీష్‌కుమార్, అడ్వయిజర్ గిరిధర్‌రెడ్డి, పోలవరం ప్రాజెక్టు సీఈ ఎం.సుధాకర్‌బాబు పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అప్రోచ్ చానల్, స్పిల్ చానల్, పైలెట్ చానల్, కాఫర్ డ్యామ్ పనులు పరిశీలించి ఎస్‌ఈ కె.నరసింహమూర్తిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈనెల 15వ తేదీలోపు స్పిల్‌వే మీదుగా గోదావరి నీటిని దిగువకు మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. స్పిల్‌వే మీదుగా నీరు దిగువకు విడుదల చేస్తే నీటి ప్రవాహం ఎలా ఉంటుంది, ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాలపై చర్చించారు. కాఫర్ డ్యామ్ నిర్మాణంతో ఇప్పటికే నీరు ఎగపోటు పెరుగుతోందనే అంశాన్ని పరిశీలించారు. స్పిల్‌వే, రివర్స్ స్లూయిజ్ గేట్ల నుంచి దిగువకు స్పిల్ చానల్ మీదుగా తిరిగి గోదావరి ప్రవాహం యథావిధిగా నదిలో కలిసేలా పనులు చేపట్టారు. అనంతరం పోలవరం గ్రామంలో వరద రక్షణగా నిర్మించిన నెక్లెస్‌బండ్ పనులను అధికారుల బృందం పరిశీలించింది.
చదవండి: Jagananna Vidya Kanuka: నాణ్యమైన ‘కానుక’.. ఈ ఏడాది అవి అదనం
Comments
Please login to add a commentAdd a comment