తడిగుడ్డతో గొంతు కోసింది | undavalli arunkumar takes on congress party | Sakshi
Sakshi News home page

తడిగుడ్డతో గొంతు కోసింది

Published Mon, Dec 30 2013 4:11 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

తడిగుడ్డతో గొంతు కోసింది - Sakshi

తడిగుడ్డతో గొంతు కోసింది

 కాంగ్రెస్‌లో మా భవిష్యత్ ముగిసినట్లే
 మీట్ ది ప్రెస్‌లో ఐదుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు
 చిన్న రాష్ట్రాల డిమాండ్లున్నచోట లబ్ధి పొందేందుకే విభజన అని విమర్శ
 
 సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ తడిగుడ్డతో తమ గొంతు కోసిందని.. ఆ పార్టీలో తమ భవిష్యత్తు ముగిసినట్టేనని సీమాంధ్ర కాంగ్రెస్ లోక్‌సభ సభ్యులు కొందరు స్పష్టం చేశారు. ఉండవల్లి అరుణ్‌కుమార్, రాయపాటి సాంబశివరావు, హర్షకుమార్, సబ్బం హరి, లగడపాటి రాజగోపాల్ ఆదివారం హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం (ఏపీజేఎఫ్) నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. కాంగ్రెస్‌లో తమ భవిష్యత్తు ముగిసినట్లేనని.. కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో జనవరి 23 తర్వాతే ఆలోచిస్తామని రాయపాటి సాంబశివరావు చెప్పారు. తమ భవిష్యత్తు రాష్ట్రం సమైక్యంగా ఉంటుందా? లేదా? అన్నదానిపైనే ఆధారపడి ఉందన్నారు. సబ్బం హరి మాట్లాడుతూ.. 2014 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌ను విభజించడం ద్వారా దేశంలో చిన్న రాష్ట్రాలు కోరుకుంటున్న ప్రాంతాలలో కాంగ్రెస్ 40 లోక్‌సభ సీట్ల వరకు గెలుచుకోవాలనే దురుద్దేశంతోనే ఈ ప్రక్రియను చేపట్టిందని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కేంద్ర మంత్రుల మధ్య.. అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల మధ్య, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య చీలికలు తీసుకొస్తున్నారని ఆరోపించారు. సమైక్య పోరాటం విషయంలో కాంగ్రెస్ సహా ఎవరినీ నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇక, విభజన ప్రక్రియలో రెండు ప్రాంతాల ప్రజల మధ్య ఏకాభిప్రాయం తేవడానికి పార్టీ అధిష్టానంగానీ, కేంద్ర ప్రభుత్వంగానీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని హర్షకుమార్ అన్నారు. సొంత పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా విభజన ప్రక్రియను అడ్డుకోవాలన్నది తమ ఆలోచనగా చెప్పారు.
 
 రాజకీయాలను పక్కనపెట్టాలి..
 కాంగ్రెస్ పార్టీ తడిగుడ్డతో తమ గొంతు కోసిందని ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చలో పాల్గొంటే సభ్యులు విభజనకు అంగీకరించినట్టేనన్న వాదనను ఆయన తప్పుపట్టారు. చర్చ సందర్భంగా సభ్యుడు మొదట, చివరిలో తాను బిల్లును వ్యతిరేకిస్తున్నానని చెప్పి ఎంతసేపు మాట్లాడినా.. బిల్లును వ్యతిరేకించినట్టే అవుతుందని తెలిపారు. జనవరి 23 వరకు పార్టీలు రాజకీయాలను పక్కనపెట్టి అసెంబ్లీలో బిల్లుపై చర్చ అంశంపై ఒక్కటిగా పనిచేయాలని సూచించారు. సభలో ఎమ్మెల్యేలు ఎవరేమి మాట్లాడాలన్న దానిపై వ్యూహం ఖారారు చేస్తున్నామని చెప్పారు. 1969లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నా, రాష్ట్రపతి ఎన్నికల విషయంలో నాటి సీడబ్ల్యూసీ తీర్మానానికి వ్యతిరేకంగా వ్యవహరించారని.. అలాగే తాము కూడా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకుంటున్నామన్నారు. అసెంబ్లీలో మెజార్టీ సభ్యులు బిల్లును తిరస్కరిస్తే, రాష్ట్రపతి దాన్ని పార్లమెంట్‌కు పంపే ముందు సుప్రీంకోర్టుకు పంపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సభ్యులు అఫిడవిట్లను అసెంబ్లీలో అందజేసి.. వా టితో సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న ఆలోచన ఉందన్నారు. లగడపాటి మాట్లాడుతూ.. విభజన బిల్లుపై చర్చకు గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నాలుగు వారాలు అదనపు సమయం ఇవ్వాలని రాష్ట్రపతిని కోరితే ఇచ్చారన్నారు. మనం 8 వారాలు అదనపు సమయం అడిగితే ఇవ్వక తప్పదని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు, కందుల రమేష్, ఏపీజేఎఫ్ అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు, ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
 
 రాష్ట్రపతిని కలిసిన సీమాంధ్ర ఎంపీలు
 సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఉండవల్లి, రాయపాటి, సబ్బంహరి, హర్షకుమార్, లగడపాటి రాష్ట్రపతి ప్రణబ్‌ను ఆదివారం కలిశారు. మెజారిటీ ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నందున విభజనను నిలిపేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement