సాక్షి, అనంతపురం : జిల్లా వ్యాప్తంగా సమైక్య నినాదాలు మోర్మోగుతున్నాయి. అనంతపురం నగరంలో జాక్టో ఆధ్వర్యంలో మంగళవారం రిలే దీక్షలు కొనసాగించిన ఉపాధ్యాయులు... కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించారు. సప్తగిరి సర్కిల్‌లో మానవహారం నిర్మించి... దిష్టిబొమ్మలను దహనం చేశారు. ‘మొద్దునిద్రలో ఉన్న మంత్రులను గునపాలతో గుచ్చి లేపుతున్నట్లు’గా ఉపాధ్యాయులు స్థానిక టవర్‌క్లాక్ సర్కిల్‌లో వినూత్న ప్రదర్శన చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు, ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు ఎస్‌ఈ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టారు. సాయినగర్ మల్లాలమ్మ ఆలయం వద్ద విద్యార్థులు సామూహిక ప్రార్థనలు చేశారు. ఎమ్మార్పీఎస్ నాయకులు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. నీటిపారుదల, పీఏసీఎస్, పంచాయతీ రాజ్, పశుసంవర్ధక, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖ జేఏసీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సేతు, విన్సెంట్ డీపాల్, రాధా స్కూల్ ఆఫ్ లెర్నింగ్ పాఠశాలల విద్యార్థులు ఎస్కేయూ వద్దకు ర్యాలీగా వెళ్లి... అక్కడ జాతీయ రహదారిపై రెండు గంటల పాటు బైఠాయించారు.
రోడ్డుపైనే ఖోఖో, వాలీబాల్, క్రికెట్, స్కిప్పింగ్ తదితర ఆటలు ఆడారు. ఎస్కేయూ విద్యార్థి, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులకు రోడ్లపైనే ఆటల పోటీలు నిర్వహించారు. ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ, గుంతకల్లులో జేఏసీ నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మట్టికుండలతో ప్రదర్శన నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు జాతీయ నాయకుల వేష ధారణలో జాతి సమైక్యతను చాటారు. వైద్య ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. చిలమత్తూరులో సమైక్యవాదులు నిరసన తెలిపారు. కదిరిలో విద్యార్థి నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జేఏసీ నాయకులు రోడ్లను శుభ్రపరిచి నిరసన తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు బైక్ ర్యాలీ చేపట్టారు. తలుపులలో భవన నిర్మాణ కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు. నల్లచెరువులో డాక్టర్లు ర్యాలీ చేశారు. కళ్యాణదుర్గంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
నాయీ బ్రాహ్మణులు భారీ ర్యాలీ నిర్వహించారు. మడకశిరలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది ర్యాలీ చేపట్టడమే కాకుండా... రోడ్డుపైనే రోగులకు చికిత్స చేశారు. జేఏసీ నాయకులు ఆటో రిక్షాలతో ర్యాలీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను మూసేయించారు. అమరాపురంలో జేఏసీ నాయకులు కేసీఆర్ మాస్కులు ధరించి ర్యాలీ చేశారు. పుట్టపర్తి, ఓడీ చెరువులలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. బుక్కపట్నం డైట్ కళాశాల విద్యార్థులు ర్యాలీ, జేఏసీ నాయకులు చెక్కభజనతో నిరసన తెలిపారు. పుట్టపర్తిలో జేఏసీ నాయకులు శరీరానికి మట్టి పూసుకుని నిరసన తెలిపారు. పెనుకొండలో టింబర్ డిపోల అసోసియేషన్ సభ్యులు, రొద్దం, యల్లనూరులో విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. సోమందేపల్లిలో వెలితడకల గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించారు. రాయదుర్గంలో మేదర్లు రోడ్లపైనే బుట్టలు అల్లుతూ నిరసన తెలిపారు. ఇదే పట్టణంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కణేకల్లులో దళితులు చేపట్టిన బంద్ విజయవంతమైంది. రాప్తాడులో ఉపాధ్యాయులు హోమం, శింగనమలలో సమైక్యవాదులు భిక్షాటన చేశారు. గార్లదిన్నెలో ఎనుములకు కేసీఆర్ దిష్టిబొమ్మను కట్టి ర్యాలీ నిర్వహించారు. బుక్కరాయసముద్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల సిబ్బంది ఆందోళన చేపట్టారు. తాడిపత్రిలో వైద్య, ఆరోగ్య జేఏసీ, సర్‌సీవీ రామన్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు.
మహిళా జేఏసీ ఆధ్వర్యంలో కళ్లు, ముక్కు, చెవులు మూసుకుని వినూత్న నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు భిక్షాటన చేశారు. గుంతకల్లులో వైఎస్‌ఆర్‌సీపీ నేతల రిలే దీక్షలు కొనసాగాయి. యాడికిలో నాయీ బ్రాహ్మణులు వినూత్న నిరసన తెలిపారు. సమైక్యవాదులు రోడ్లపైనే శిరోముండనం చేయించుకున్నారు. ఉరవకొండలో వైఎస్సార్‌సీపీ నాయకులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. వైఎస్సార్‌సీపీ రిలేదీక్షలు రెండో రోజూ కొనసాగాయి. వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. బెళుగుప్పలో నిరసనలు హోరెత్తాయి. వజ్రకరూరులో సమైక్యవాదులు జనగర్జన నిర్వహించారు.
అలుపెరుగని పోరు
Published Wed, Sep 18 2013 4:28 AM | Last Updated on Sat, Sep 15 2018 8:15 PM
Advertisement
Advertisement