కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ వార్షిక పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు.
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ వార్షిక పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 41 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రథమ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు మంగళవారం నుంచి.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 5 నుంచి పరీక్షలు జరుగుతాయి. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు.. తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. మరుసటి రోజు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు 65,589
డిగ్రీ పరీక్షలకు 65,589 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో బీఏ విద్యార్థులు 13,106 మంది, బీకాం 18,651, బీఎస్సీ (బీజెడ్సీ) 18,575, ఎంపీసీ 15,255, బీఎస్సీ ఒకేషనల్ కోర్సు విద్యార్థులు ఇద్దరు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ పరీక్షలు సోమవారం నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుగుతాయి. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా కేంద్రాల్లో అబ్జర్వర్లను, ఫ్లయింగ్ స్క్వాడ్‌లను, యూనివర్సిటీ ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించినట్లు కాకతీయ యూనివ ర్సీటీ పరీక్షల విభాగం కంట్రోలర్, అదనపు కంట్రోలర్‌లు రంగారావు, వెంకట్‌రామిరెడ్డిలు తెలిపారు.