కర్నూలు విద్య: ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గద్దెనెక్కిన తరువాత వాటిని మరిచిపోయారు. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించినా ఎప్పటి నుంచో స్పష్టంగా చెప్పడం లేదు. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు రోజుకో మాట మాట్లాడుతూ నిరుద్యోగులను గందరగోళంలో పడేస్తున్నారు.
ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ వస్తుందో లేదోననే ఆందోళన నెలకొంది. ఈ ఏడాది పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు తాత్కాలిక సర్దుబాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఆ తరువాత మరి కొద్ది రోజులకు డీఎస్సీ నోటిఫికేషన్ అని.. లేదు లేదు ముందుగా టెట్ పెట్టి ఆ తరువాత కొత్త పోస్టులు భర్తీ చేస్తామని.. మరి కొద్ది రోజులకే టెట్, డీఎస్సీ రెండు ఒకే రోజు నిర్వహిస్తామంటూ ప్రకటనలు చేశారు. ఇంత వరకు దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు.
మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించిన ప్రకారమైతే టెట్ నోటిఫికేషన్ ఈ నెల 15లోపు రావాలి. ప్రస్తుత పరిస్థితుల బట్టి చూస్తే ఆ అవకాశం లేదు. వచ్చే నెల మొదటి వారంలోనే టెట్ నిర్వహణపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామంటూనే ప్రభుత్వం కొత్త పోస్టుల భర్తీ భారాన్ని తగ్గించుకునే ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో భాగంగానే 6,7 తరగతులలో విద్యార్థులు తక్కువగా ఉన్నారని ప్రాథమికోన్నత పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలుగా కుదించారు. దీంతో పరోక్షంగా కొత్త పోస్టులు తగ్గే అవకాశం ఉందని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
జీవో నంబర్లు 55, 61ల ప్రకారం 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ప్రకారం రేషనలైజేషన్ చేసిన తరువాత ఎన్ని పోస్టులు మిగులుతాయనే దానిపై కసరత్తు చేయించి వివరాలను ప్రభుత్వం తీసుకుంది. ప్రస్తుతం జిల్లాలో 730 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీటిని రేషైనలైజేషన్ చేసిన తరువాత మిగిలే వాటిలో అవసరం మేరకు డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అప్పటి వరకు నిరుద్యోగ అభ్యర్థులకు ఉత్కంఠ తప్పదు. ఈ ఏడాది మే 31వ తేదీ వరకు ఖాళీలు అయిన పోస్టులను పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. జిల్లాలో 730 పోస్టులలో ఎస్‌జీటీలు 497, లాంగ్వేజ్ పండిట్స్ 98, పీఈటీ 13, స్కూల్ అసిస్టెంట్లు 122 ఖాళీలు ఉన్నాయి.
టెట్‌కు పాత సిలబస్.. డీఎస్సీకి కొత్త సిలబస్
2012-14 డీఎడ్ బ్యాచ్ ఛాత్రోపాధ్యాయులకు డీఎస్సీలో అవకాశం ఇచ్చేందుకు ఖచ్చితంగా టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ప్రభుత్వం రెండు ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంది. డీఎస్సీ రోజే ఉదయం ఒక పేపరుగా టెట్ నిర్వహంచాలని, ఇందులో అర్హత సాధిస్తేనే డీఎస్సీ జవాబు పత్రాలను దిద్దుతారు. గతంలో టెట్ అర్హత సాధించిన వారు కూడా మళ్లీ రాయొచ్చు. దేనిలో అధిక మార్కులు వస్తే దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. టెట్ మాత్రం గతంలో ఉన్న పాత సిలబస్ ప్రకారమే నిర్వహించి. డీఎస్సీకి ఈ విద్యా సంవత్సరంలోని నూతన సిలబస్ ప్రకారమే నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ప్రశ్నపత్రం నమూనా, ప్రశ్నల సరళి కూడా మారే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
తెరపైకి కొత్త వాదన
ప్రస్తుతం ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వారికి పదోన్నతలు, బదిలీలు చేసిన తరువాతే రేషనలైజేషన్ చేయాలని ఆ తరువాతే కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. పదోన్నతులు, బదిలీలపై ఇటీవలే ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. దీంతో ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమపడుతోంది. ఫలితంగా డీఎస్సీ నోటిఫికేషన్ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
డీఎస్సీ.. బుస్సేనా!
Published Tue, Aug 12 2014 1:02 AM | Last Updated on Wed, Aug 29 2018 3:33 PM
Advertisement
Advertisement