
కుసుమ మృతదేహం
నాలుగున్నరేళ్లుగా కొలువు కోసంఎదురుచూస్తున్నా.. ఫలితం మాత్రం దక్కడం లేదు. రాష్ట్రంలో లక్షలాదిపోస్టులు.. జిల్లాలో వేలాది ఉద్యోగ ఖాళీలు ఉన్నా.. భర్తీ ఎండమావిగానే మారింది. ప్రభుత్వం రేపుమాపు అంటూ డీఎస్సీ,పంచాయతీ కార్యదర్శి, పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ అంటూ ప్రకటనలకే పరిమితం అవుతోంది. తల్లిదండ్రుల కష్టార్జితంతో చదివిన పేదలు ప్రభుత్వ ఉద్యోగం కోసం వేలాది రూపాయలు ఖర్చుచేస్తూ కోచింగ్‌సెంటర్ల చుట్టూతిరుగుతున్నారు. కానీ నోటిఫికేషన్లు మాత్రం రావడం లేదు. ఉద్యోగాలు రాక...కుటుంబానికి భారం కాకూడదనే ఆవేదనతో ఆత్మహత్యలకు సైతంవెనకాడటం లేదు. ఇటీవల రాయచోటిలో కుసుమ అనే నిరుద్యోగి బలవన్మరణానికి పాల్పడటమే దీనికి నిదర్శనం.
సాక్షి, కడప : జిల్లాలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. డిగ్రీ మొదలు ఎంఏ, ఎంబీఏ, పీజీలు, బీటెక్, ఎంటెక్, బీఈడీ, ఫార్మసీతోపాటు టెక్నికల్ రంగాలకు సంబంధించిన ఎంతోమంది ఇప్పటికే చదువు ముగించుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 80 వేల వరకు కనిపిస్తున్నా అనధికారిక లెక్కల ప్రకారం దాదాపు మూడు లక్షల మేర నిరుద్యోగులు ఉన్నారు.ఏడాదికేడాదికి నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్నా అందుకు తగ్గట్టు ఉపాధి అవకాశాలు లేకపోవడం..స్వయం సహాయక పథకాలు (రుణాలకు సంబంధించి యూనిట్లు) ఉన్నా అవి కూడా అధికార పార్టీ అనుకూలురకు.. జన్మభూమి కమిటీల సిఫార్సుల మేరకే ఇస్తుండడంతోనిరుద్యోగులకు అవి కూడా అందని ద్రాక్షగా మారాయి.
కనిపించని నోటిఫికేషన్లు
నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్నా అందుకు తగ్గట్టు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎస్సీ ఒకసారి, పోలీసుశాఖకు సంబంధించి కానిస్టేబుళ్లు, ఎస్‌ఐ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ అయింది. రెండోసారి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని సీఎం మొదలుకొని విద్యాశాఖ మంత్రి వరకు మాటలు చెబుతున్నా ఇప్పటి వరకు నోటిఫికేషన్ జారీ కాలేదు. జిల్లాలోని అన్నిశాఖల్లో అటెండర్ మొదలుకొని కీలక అధికారి వరకు ఖాళీలు కనిపిస్తున్నా ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ భర్తీ చేయలేదు. ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయకపోవడంతో నిరుద్యోగులు ప్రైవేటు సంస్థల వైపు అడుగులు వేస్తున్నా టార్గెట్ల ఒత్తిళ్లు తట్టుకోలేక వెనక్కి మళ్లుతున్నారు.
అధికారంలోకి వచ్చినాలుగున్నరేళ్లు దాటినా...
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు ఒక మాట....వచ్చిన తర్వాత మరో మాట చెబుతోంది.ఎలాగోలా పథకంలో నుంచి లబ్ధిదారులను తగ్గించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఎన్నికలకు ముందు చెప్పిన నిరుద్యోగ భృతి విషయంలోనూ దాదాపు నాలుగేళ్ల పుణ్యకాలం గడిచినంత వరకు మొద్దునిద్రలో ఉన్న టీడీపీ సర్కార్ ఎన్నికల నేపథ్యంలో మేలుకున్నట్లు నటిస్తోంది. ఇంటింటికి ఉద్యోగం.లేకుంటే ప్రతి నిరుద్యోగికి రూ. 2 వేలు భృతి అంటూ దండోరా వేసిన టీడీపీ ప్రభుత్వం ప్రస్తుతం రూ. 1000లకే పరిమితం చేసింది. అక్టోబరు నుంచి అందించాలని కసరత్తు చేస్తున్నా నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment