
వెంకటేష్ వదిలి వెళ్లిన వాహనాన్ని పరిశీలిస్తున్న మృతుడి తండ్రి, పోలీసులు వెంకటేష్ (ఫైల్)
గుంటూరు, తాడేపల్లి రూరల్: తండ్రితో పాటు కులవృత్తి చేస్తూ ఆ వృత్తిలో బతుకుదెరువు కనిపించక పోవడంతో తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం మరో వృత్తిని ఎంచుకున్నా, ఆ వృత్తి భరోసా ఇవ్వకపోవడంతో తనువు చాలించిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి పట్టణ పరిధిలోని చిన్న శ్రీనివాసరావు ఒక్కగానొక్క కొడుకు చిన్నం వెంకటేష్ (22) తన తండ్రితో కలిసి చేనేత వృత్తి చేస్తూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో కులవృత్తైన చేనేతతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టతరంగా మారడంతో వడ్రంగి పని చేస్తూ తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు.
బయటకు వెళ్లొస్తానని చెప్పి
శ్రీనివాసరావు, శివపార్వతిలకు వెంకటేష్‌తో పాటు కుమార్తె ఉంది. వెంకటేష్ అక్కకు వివాహమైంది. ఈ క్రమంలోనే ఏడాది క్రితం తండ్రికి గుండెజబ్బు రావడంతో ఆపరేషన్ కూడా చేయించాడు. ప్రస్తుతం కుటుంబాన్ని మొత్తం అతనే పోషిస్తున్నాడు. అప్పు చేయకపోయినా, ఉన్న దాంట్లోనే సర్దుకుని జీవిస్తున్న వెంకటేష్ కుటుంబాన్ని ఆర్థిక పరిస్థితులు వెంటాడాయి. మరో 15 రోజుల్లో వెంకటేష్ అక్కను ఇంటికి తీసుకువచ్చి పురుడు పోయాల్సి ఉంది. తల్లిదండ్రులతోనూ, స్నేహితులతోనూ సంతోషంగా ఉన్న వెంకటేష్ మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ, తమతో మాత్రం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానంటూ రెండుమూడు సార్లు చర్చించాడని స్నేహితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం ఇంట్లో టిఫిన్ చేసి, తల్లిదండ్రులతో కొంచెం సేపు మాట్లాడి, బయటకు వెళ్లొస్తానని, తన ద్విచక్రవాహనంపై వచ్చి కృష్ణానది వద్ద బండి పార్క్ చేసి, మూడో కానా దగ్గర కృష్ణానదిలోకి దూకినట్లు గుర్తించారు.
తల్లడిల్లిన కుటుంబం
రాత్రి సమయం కావడంతో పోలీసులుకానీ, మరెవరూ ఈ విషయాన్ని గమనించలేదని, మృతదేహం మూడో రోజు తేలడంతో మత్స్యకారులు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించగా, జేబులో సెల్‌ఫోన్, బండి తాళం ఉన్నాయని, సెల్‌ఫోన్ ఆధారంగా బంధువులకు, స్నేహితులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్నేహితులు మృతదేహాన్ని పరిశీలించి చనిపోయింది వెంకటేష్ అని గుర్తించారు. వెంకటేష్‌కు ప్రమాదం జరిగిందని తండ్రైన శ్రీనివాసరావుకు తెలిపారు. తండ్రిని కృష్ణానది దగ్గరకు తీసుకువచ్చారు. శ్రీనివాసరావు కుమారుడి వాహనం గుర్తించాడు. అనంతరం కృష్ణానదిలో వెంకటేష్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయాడు. కుమారుడి మృతదేహాన్ని చూసిన భోరున విలపించాడు. శ్రీనివాసరావును ఓదార్చడం ఎవరి తరం కాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment