సాక్షి, అమరావతి: దేశంలో నిరుద్యోగిత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఉపాధి కల్పన అంశంలో జూన్‌లో మెరుగైన స్థితి కనపడుతోంది. ఉపాధి కల్పనలో దేశం క్రమంగా లాక్‌డౌన్ ముందటి పరిస్థితికి చేరుకుంటుండటం శుభ పరిణామమని ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ’ (సీఎంఐఈ) తాజా నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పనలో దేశంలోనే మేటిగా నిలిచింది. కరోనాపై ప్రజల్లో భయాందోళనలు, లాక్‌డౌన్ నేపథ్యంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగిత కల్పనలో మెరుగ్గా పనిచేసింది. జూన్ మొదటి వారం ముగిసే నాటికి 5.93 కోట్ల పనిదినాల ఉపాధి కల్పించడం విశేషం. అన్ని రంగాల్లో కలిపి ఉపాధి కల్పనలో మొదటి నాలుగు రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. సీఎంఐఈ నివేదిక మేరకు దేశంలో ఈ ఏడాది జూన్ 21 నాటికి నిరుద్యోగిత 8.50శాతంగా నమోదైంది. లాక్‌డౌన్ మినహాయింపులు ఇచ్చిన తరువాత దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయి. దాంతో వృత్తి నిపుణులు, కార్మికులు, అసంఘటిత రంగాల కార్మికులు, కూలీలు, ఇతర వర్గాల వారికి పనులు దొరుకుతున్నాయి. దాంతో నిరుద్యోగిత గణనీయంగా తగ్గింది. పట్టణాల్లో కంటే పల్లెల్లో నిరుద్యోగిత తక్కువగా ఉందని సీఎంఐఈ నివేదిక వెల్లడించింది.
నివేదికలోని ప్రధాన అంశాలు:
– లాక్‌డౌన్ విధించడానికి ముందు మార్చి మూడో వారంలో దేశవ్యాప్తంగా నిరుద్యోగిత 8.30శాతం ఉండేది.
– లాక్‌డౌన్ విధించడంతో రికార్డుస్థాయిలో మే చివరి వారంలో 27.10 శాతానికి చేరుకుంది.
– లాక్‌డౌన్ సడలింపులతో జూన్ మొదటి వారంలో 17.50 శాతానికి,
– జూన్ రెండో వారంలో 11.60 శాతానికి తగ్గింది.
– జూన్ మూడో వారం ముగిసేసరికి దేశంలో పట్టణాలు, పల్లెల్లో కలిపి 8.50శాతంగా నమోదైంది.
ముందంజలో పల్లెలు:
ఉపాధి కల్పనలో పట్టణాల కంటే పల్లెలు ముందంజలో ఉన్నాయి. భారీ సంఖ్యలో స్వగ్రా>మాలకు చేరుకున్న వలస కూలీలకు ప్రభుత్వం వారికి పల్లెల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తోంది. దాంతో పట్టణాల కంటే పల్లెలు ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. అందుకే పట్టణాల్లో కంటే పల్లెల్లో నిరుద్యోగిత తక్కువగా ఉంది. లాక్‌డౌన్ విధించడానికి ముందు ఉన్న దానికంటే ప్రస్తుతం పల్లెల్లో నిరుద్యోగిత తగ్గడం ప్రాధాన్యం సంతరించుకుంది.
– జూన్ మూడోవారం ముగిసేసరికి పట్టణాల్లో నిరుద్యోగిత 11.20 శాతం ఉండగా,
– పల్లెల్లో 7.30శాతం మాత్రమే నిరుద్యోగం ఉంది.
రికార్డుస్థాయిలో ఉపాధి హామీ పనులు:
వలస కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో భారీగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తోంది. ఈ జూన్ మూడో వారం నాటికి దేశంలో 56.50కోట్ల పనిదినాలు కల్పించడం రికార్డు.
– గత ఏడాది మేలో 37కోట్ల పనిదినాల ఉపాధి మాత్రమే కల్పించారు. ఈ ఏడాది అంతకంటే 53శాతం అధికంగా పనులు కల్పించడం విశేషం.
ఏపీనే అగ్రగామి:
ఉపాధి కల్పనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఈ ఏడాది జూన్ మూడో వారం ముగిసేసరికి రాష్ట్రంలో 5.93కోట్ల పనిదినాల ఉపాధి కల్పించింది. మేలో కూడా మన రాష్ట్రంలో 5.77కోట్ల పనిదినాల ఉపాధి కల్పించి దేశంలో మొదటిస్థానంలో నిలవడం విశేషం.
– ఇక అన్ని రంగాల్లో కలిపి ఉపాధి కల్పనలో ఏపీ మెరుగైన పనితీరు కనబరుస్తోంది. దేశంలో నిరుద్యోగిత తక్కువగా ఉన్న మొదటి నాలుగు రాష్ట్రాల్లో మన రాష్ట్రానికి స్థానం లభించింది. మహారాష్ట్ర, ఒడిశా, కేరళ, ఏపీ, ఛత్తీస్‌గఢ్.. వరుసగా ఐదు స్థానాల్లో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment