National Rural Employment Guarantee
-
విపత్కరంలోనూ ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: దేశంలో నిరుద్యోగిత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఉపాధి కల్పన అంశంలో జూన్‌లో మెరుగైన స్థితి కనపడుతోంది. ఉపాధి కల్పనలో దేశం క్రమంగా లాక్డౌన్ ముందటి పరిస్థితికి చేరుకుంటుండటం శుభ పరిణామమని ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ’ (సీఎంఐఈ) తాజా నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పనలో దేశంలోనే మేటిగా నిలిచింది. కరోనాపై ప్రజల్లో భయాందోళనలు, లాక్డౌన్ నేపథ్యంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగిత కల్పనలో మెరుగ్గా పనిచేసింది. జూన్ మొదటి వారం ముగిసే నాటికి 5.93 కోట్ల పనిదినాల ఉపాధి కల్పించడం విశేషం. అన్ని రంగాల్లో కలిపి ఉపాధి కల్పనలో మొదటి నాలుగు రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. సీఎంఐఈ నివేదిక మేరకు దేశంలో ఈ ఏడాది జూన్ 21 నాటికి నిరుద్యోగిత 8.50శాతంగా నమోదైంది. లాక్డౌన్ మినహాయింపులు ఇచ్చిన తరువాత దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయి. దాంతో వృత్తి నిపుణులు, కార్మికులు, అసంఘటిత రంగాల కార్మికులు, కూలీలు, ఇతర వర్గాల వారికి పనులు దొరుకుతున్నాయి. దాంతో నిరుద్యోగిత గణనీయంగా తగ్గింది. పట్టణాల్లో కంటే పల్లెల్లో నిరుద్యోగిత తక్కువగా ఉందని సీఎంఐఈ నివేదిక వెల్లడించింది. నివేదికలోని ప్రధాన అంశాలు: – లాక్డౌన్ విధించడానికి ముందు మార్చి మూడో వారంలో దేశవ్యాప్తంగా నిరుద్యోగిత 8.30శాతం ఉండేది. – లాక్డౌన్ విధించడంతో రికార్డుస్థాయిలో మే చివరి వారంలో 27.10 శాతానికి చేరుకుంది. – లాక్డౌన్ సడలింపులతో జూన్ మొదటి వారంలో 17.50 శాతానికి, – జూన్ రెండో వారంలో 11.60 శాతానికి తగ్గింది. – జూన్ మూడో వారం ముగిసేసరికి దేశంలో పట్టణాలు, పల్లెల్లో కలిపి 8.50శాతంగా నమోదైంది. ముందంజలో పల్లెలు: ఉపాధి కల్పనలో పట్టణాల కంటే పల్లెలు ముందంజలో ఉన్నాయి. భారీ సంఖ్యలో స్వగ్రా>మాలకు చేరుకున్న వలస కూలీలకు ప్రభుత్వం వారికి పల్లెల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తోంది. దాంతో పట్టణాల కంటే పల్లెలు ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. అందుకే పట్టణాల్లో కంటే పల్లెల్లో నిరుద్యోగిత తక్కువగా ఉంది. లాక్డౌన్ విధించడానికి ముందు ఉన్న దానికంటే ప్రస్తుతం పల్లెల్లో నిరుద్యోగిత తగ్గడం ప్రాధాన్యం సంతరించుకుంది. – జూన్ మూడోవారం ముగిసేసరికి పట్టణాల్లో నిరుద్యోగిత 11.20 శాతం ఉండగా, – పల్లెల్లో 7.30శాతం మాత్రమే నిరుద్యోగం ఉంది. రికార్డుస్థాయిలో ఉపాధి హామీ పనులు: వలస కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో భారీగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తోంది. ఈ జూన్ మూడో వారం నాటికి దేశంలో 56.50కోట్ల పనిదినాలు కల్పించడం రికార్డు. – గత ఏడాది మేలో 37కోట్ల పనిదినాల ఉపాధి మాత్రమే కల్పించారు. ఈ ఏడాది అంతకంటే 53శాతం అధికంగా పనులు కల్పించడం విశేషం. ఏపీనే అగ్రగామి: ఉపాధి కల్పనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఈ ఏడాది జూన్ మూడో వారం ముగిసేసరికి రాష్ట్రంలో 5.93కోట్ల పనిదినాల ఉపాధి కల్పించింది. మేలో కూడా మన రాష్ట్రంలో 5.77కోట్ల పనిదినాల ఉపాధి కల్పించి దేశంలో మొదటిస్థానంలో నిలవడం విశేషం. – ఇక అన్ని రంగాల్లో కలిపి ఉపాధి కల్పనలో ఏపీ మెరుగైన పనితీరు కనబరుస్తోంది. దేశంలో నిరుద్యోగిత తక్కువగా ఉన్న మొదటి నాలుగు రాష్ట్రాల్లో మన రాష్ట్రానికి స్థానం లభించింది. మహారాష్ట్ర, ఒడిశా, కేరళ, ఏపీ, ఛత్తీస్‌గఢ్.. వరుసగా ఐదు స్థానాల్లో నిలిచాయి. -
20రోజులుగా ఖాళీ
ఖజానా ఖాళీతో చెల్లని చెక్కులు పనులు చేయలేమంటున్న కాంట్రాక్టర్లు మట్టి ఖర్చుల పద్దులు ఫ్రీజింగ్ పెళ్లిళ్ల సీజన్‌తో అల్లాడుతున్న ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పటికి విడుదల చేస్తారో తెలియదంటున్న అధికారులు గుడివాడ: ప్రభుత్వ ఖాతాల కార్యాకలాపాలు నిలుపుదల చేసి సోమవారం నాటికి 20 రోజులు పూర్తి అవుతుంది. నాటి నుంచి ప్రభుత్వ శాఖల ఆర్థిక లావాదేవీలన్నీ స్తంభించిపోయాయి. కోటాను కోట్లు ఖర్చుతో మహిళా సాధికారిత సదస్సులు పెట్టి మా కడుపులు మాడుస్తున్నారని ఉద్యోగులు, కాంట్రాక్టర్లు ఆవేదనతో రగిలి పోతునారు. ట్రెజరీ చెక్కులు తీసుకున్న వారు బ్యాంకుల వద్దకు వెళ్లి బిక్కముఖంతో వెనుతిరుగుతున్నారు. మూడు పద్దులు మాత్రమే వదిలారు... ఈనెల 8న ప్రభుత్వ అకౌంట్లు ప్రీజింగ్ చేసిన నాటినుంచి మూడు రోజుల కిందట కోర్టు చెక్కుల చెల్లింపుకు 2014 పద్దును మాత్రమే వదిలారు. కాంట్రాక్టు ఉద్యోగులు, వీఆర్ఏల జీతాలకు సంబంధించిన పద్దుల బిల్లులు చెల్లింపులకు అవకాశం కల్పిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలు, జీపిఎఫ్ ఖాతాల్లో రుణాల విషయంలో ఇంతవరకు వదలలేదు. దీనికి తోడు మున్సిపాల్టీలకు సంబంధించిన సొంత ఖాతాల్లో కూడా ఫ్రీజింగ్ పెట్టారు. ఫలితంగా పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లింపులు లేక నానా తంటాలు పడుతున్నారు. శుభకార్యాలు చేసుకుందామని జీపీఎఫ్ రుణాలు కోసం దరఖాస్తుచేసినా ఫలితం లేకుండా పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉద్యోగులు ఉన్నారు. ఒక్క గుడివాడ సబ్ ట్రెజరీ కార్యాలయంలోనే దాదాపుగా 500కు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. నిలిచిపోయిన అభివృద్ది పనులు.. మున్సిపాల్టీ, గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు నిలిచి పోయాయి. పాత పనుల బిల్లులు చెల్లించకపోవడంతో కొత్త పనులు చేయలేమని కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. మరోవైపు పంచాయతీల్లో కరెంటు బిల్లులు, రోజువారీ ఖర్చులకు చెల్లింపులు చేయలేక సర్పంచ్‌లు తంటాలు పడుతున్నారు. మార్చినెల ముగింపు నేపథ్యంలో కొన్ని పనులు పూర్తి చేయకపోతే నిధులు మురిగిపోయే ప్రమాదం ఉంది. పంచాయతీ సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేదు... ట్రెజరీలో ఒక్క బిల్లు కూడా మారటం లేదు. పంచాయతీ పాలన కుంటుపడింది. కనీసం సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. జీతాల కోసం సొంత డబ్బులు ఇస్తున్నాం. వీధిలైట్లు, బ్లీచింగ్, వర్కర్స్ జీతాలు ప్రభుత్వం ఇస్తే కొంత వరకు ఇబ్బందులు తొలుగుతాయి. బిల్లులు నిలుపుదల చేస్తే పంచాయతీ పాలన ఎలా చేయాలి. –సదుర్తిసాయిబాబు –దండిగానపూడి, సర్పంచ్ ఒక్క బిల్లు రాలేదు.. ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహించిన జన్మభూమి–మాఊరు గ్రామసభలకు సొంత డబ్బులు ఖర్చు పెట్టాం. ఇంత వరకూ బిల్లు మంజూరు చేయలే దు. అత్యవసర బిల్లులు సైతం నిలుపుదలచేశారు. రోజు ట్రెజరీ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుంది. బిల్లులు మాత్రం పాస్ కావటం లేదు. అడిగితే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెబుతున్నారు. చంద్రబాబు ఏ ఖర్చు మానేస్తున్నారు . –నీలం ఉదయ్‌కుమార్, సర్పంచ్, వెన్ననపూడి నిలిచిన ఉపాధి పనులు... జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్వహిస్తున్న రోడ్ల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రెజరీల్లో ఫ్రీజింగ్ కారణంగా సిమెంట్‌కు రాసిచ్చినా నిధులు విడుదల కావడం లేదు. ఈ విధానం మార్చి నెల వరకు కనబడుతుంది. కాని జిల్లా కలెక్టరు మాత్రం మార్చిలోగా పనుల్ని పూర్తి చేయాలని అంటున్నారు. ఎలా సాధ్యం. – పి. బాలయ్య,వడ్లమన్నాడు సర్పంచ్ -
'ఆయన తిన్నది ప్రభుత్వ సొమ్మేగా...'
మెరకముడిదాం: ఉపాధి హామీ కూలీల కోసం తెచ్చిన నిధుల్లో రూ.11 లక్షలను ఓ పోస్ట్ మాస్టర్ పక్కదారి పట్టించగా దాన్ని సమర్థిస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ‘ పోస్ట్ మాస్టర్ మింగింది ప్రభుత్వ ధనమేగా, ప్రజాధనం కాదుగా’ అంటూ ఆడిట్‌కు వచ్చిన ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వివరాలు.. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం ఉత్తరావల్లి గ్రామంలోని సబ్ పోస్ట్ ఆఫీస్‌లో పోస్ట్ మాస్టర్‌గా పనిచేసే బొత్స రామారావు రూ.11 లక్షల మేర పక్కదారి పట్టించినట్టు ఆడిట్లో వెల్లడైంది. కూలీలకు ఇవ్వాల్సిన మొత్తం కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు డ్రా చేసి తీసుకెళుతున్న పోస్ట్ మాస్టర్... అదనంగా తీసుకెళుతున్న మొత్తానికి లెక్కలు తేలకపోవడంతో ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. దీంతో మూడు రోజులుగా ఆడిట్ నిర్వహించగా అసలు విషయం బయటపడింది. అదనంగా తీసుకొచ్చిన మొత్తాన్ని అతడు జేబులో వేసుకుంటున్నట్టు తేలింది. దీనిపై ఆడిట్‌కు వచ్చిన ఓ ఇన్స్పెక్టర్ను ‘సాక్షి’ ప్రతినిధి వివరణ అడగగా పోస్ట్ మాస్టర్ తిన్నది ప్రభుత్వ ధనమేగా, ప్రజాధనం కాదుగా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. -
సమన్వయంతో వ్యవహరించాలి
సెప్టెంబర్ 30 నాటికి జిల్లాలో నూరుశాతం మరుగుదొడ్లు నిర్మించాలి సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే చిలకలూరిపేటరూరల్: నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేసేందుకు మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించి జిల్లాలో నూరు శాతం మరుగుదొడ్లను నిర్మించేందుకు రూపొందించిన ప్రణాళికను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే చెప్పారు. పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్‌లో మంగళవారం నిర్మల్ భారత్ అభియాన్, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్ధాయి సమీక్షా సమావేశంలో ఆయనప్రసంగించారు. జిల్లాలోని 57 మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో 1,25,000 మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. నియోజకవర్గంలోని మూడు మండలాల్లోని 53 గ్రామాల్లో నూరుశాతం మరుగుదొడ్లు నిర్మించేందుకు 16 గ్రామాలను ఎంపిక చేశామన్నారు. ఇందులో 4025 మరుగుదొడ్లు నిర్మాణం చేయాలని నిర్ణయించుకుంటే ఇప్పటివరకు 791 దొడ్లు పూర్తికాగా, 779 నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. మరో 2455 దొడ్లను నిర్మించాల్సి ఉందన్నారు. మండల పరిధిలో ఎంపీడీవో, తహశీల్దార్, గ్రామీణ మంచినీటి సరఫరా, హౌసింగ్, ఉపాధి హామీ, వెలుగు శాఖలకు చెందిన అధికారులు ఎంపిక చేసిన గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. గ్రామస్ధాయిలో పంచాయతీ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ అధికారులు సర్పంచి, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు, అంగన్వాడీ, ఆశ వర్కర్ల సహాయ సహాకారాలతో మరుగుదొడ్డి లేని ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి వారిని మరుగుదొడ్లు నిర్మించుకునేలా ఒప్పించాలన్నారు. మండలానికి లక్ష రూపాయలు మరుగుదొడ్ల నిర్మాణానికి ఆర్థిక సమస్యలు ఎదురైన లబ్ధిదారులకు అత్యవసర సహాయం ద్వారా అందించేందుకు లక్షరూపాయలు విడుదల చేశామని జిల్లా కలెక్టర్ చెప్పారు. ముఖ్యమైన సందర్భాల్లో వాటిని డ్రా చేసి లబ్ధిదారులకు అందించి బిల్లులు మంజూరైన అనంతరం జమచేయాలని తెలిపారు. సమావేశంలో తొలుత హౌసింగ్‌బోర్డు ఎస్ఈ, నియోజకవర్గ ప్రత్యేకాధికారి ఎస్.సురేష్‌బాబు, జెడ్పీ సీఈవో సుబ్బారావు, డ్వామా పీడీ ఢిల్లీరావు మరుగుదొడ్ల ఆవశ్యకత గురించి వివరించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ పి.ప్రశాంతి, జిల్లా పంచాయతీ అధికారి పి.గ్లోరియా, నరసరావుపేట ఆర్డీవో ఎం.శ్రీనివాసరావు, ఐకేపీ ఏపీఎం టి.శ్రీనివాసరావు, సీసీలు, మూడు మండలాలకు చెందిన గ్రామీణ మంచినీటి సరఫరా, ఉపాధిహామీ, హౌసింగ్, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు వివిధ శాఖలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.