సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లాలో సీఎం కోటరీ ఖాళీ అయింది. ఒక్కరొక్కరుగా అధికార పార్టీ ముఖ్య నేతలందరూ ముఖ్యమంత్రి కిరణ్‌కు దూరమయ్యారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలోనూ ఆయనకు తోడుగా నిలబడ్డ మంత్రి శ్రీధర్‌బాబు పదవికి రాజీనామా చేయడంతో సొంత పార్టీలో సీఎంకు చుక్కెదురైంది. జిల్లాలోని ఆ పార్టీ ముఖ్యులెవరూ సీఎం పేరెత్తే పరిస్థితి లేకుండా పోయింది. సమైక్యవాదిగా చెప్పుకోవడంతోపాటు అడుగడుగునా తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసే చర్యలకు పాల్పడటం, తనను వ్యతిరేకించిన వారిపై కక్ష కట్టినందుకే సీఎం జిల్లాలోని పార్టీ నేతల ఆదరణ కోల్పోయినట్లు స్పష్టమవుతోంది.
ఎంపీ పొన్నం ప్రభాకర్ మొదలు పార్టీ మారిన ఎంపీ వివేక్, తెలంగాణ వాదిగా ముద్ర వేసుకున్న మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, బిల్లుపై చర్చించే తరుణంలో యూటర్న్ తిప్పిన మంత్రి శ్రీధర్‌బాబు, ఆయన వెన్నంటి ఉన్న ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, హుస్నాబాద్ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు టి.భానుప్రసాద్‌రావు, టి.సంతోష్‌కుమార్... ఇప్పుడు సీఎం వ్యతిరేక కూటమిలో చేరిపోయారు. ప్రవీణ్‌రెడ్డికి సీఎంతో సన్నిహిత సంబంధాలున్నాయనే ప్రచారం ఉంది. కానీ ఆయన నియోజకవర్గానికే పరిమితం కావడం, మంత్రి వర్గీయునిగా చెలామణిలో ఉండడంతో బాహాటంగా సీఎంకు వత్తాసు పలికే పరిస్థితి లేదు.
ఇక జిల్లాకు దూరమే..
సీఎం హోదాలో కిరణ్‌కుమార్ వివిధ సందర్భాల్లో మూడుసార్లు జిల్లాలో పర్యటించారు. తెలంగాణ ఉద్యమ ఖిలాల్లో అన్ని శక్తులు వ్యతిరేకించినప్పటికీ శ్రీధర్‌బాబు తనకున్న మంత్రి బలం, బలగంతో సీఎం పర్యటనలు విజయవంతం అయ్యేలా చక్రం తిప్పారు. ఇప్పుడు ఆ భరోసా కూడా లేకపోవడంతో ఎల్లంపల్లి పర్యటనకు వచ్చేందుకు సీఎం వెనుకా ముందాడుతున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముందుగా ఖరారైన ముహూర్తం ప్రకారం ఈనెల 5న సీఎం ఎల్లంపల్లి ప్రాజెక్టును ప్రారంభించేందుకు నడుం బిగించారు.
తానొస్తానంటే.. వద్దనకుండా మంత్రి శ్రీధర్‌బాబు తనకు సహకరిస్తాడనే నమ్మకంతో ఇరిగేషన్ విభాగాన్ని పురమాయించి సీఎం పేషీ నుంచే చకచకా ఏర్పాట్లు చేయించారు. తీరా కీలక సమయంలో శ్రీధర్‌బాబు ఎదురు తిరగడంతో సీఎం ఎల్లంపల్లి ప్లాన్ బెడిసికొట్టింది. జిల్లా నేతలు సహకరించకున్నా మొండిగా ఈ ప్రాజెక్టును పారంభించేందుకు సీఎం వచ్చినా... దొంగచాటు కార్యక్రమంగా మిగిలిపోతుందని, అధికారులు తప్ప ప్రజలెవరూ అటువైపు వచ్చే పరిస్థితి లేదని ఇరిగేషన్ అధికారులతోపాటు ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం అందించినట్లు తెలిసింది.