బొర్లాడ గిరిజనుల దురదృష్టం | Unfortunately tribal borlada | Sakshi
Sakshi News home page

బొర్లాడ గిరిజనుల దురదృష్టం

Published Mon, Oct 21 2013 2:16 AM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM

Unfortunately tribal borlada

 

=బొర్లాడ గిరిజనుల దురదృష్టం
 =గుర్తు తెలియని వ్యాధితో సతమతం
 =ఆరేళ్లలో 14  మంది విషాదాంతం
 =వ్యాధి బారిన 30 కుటుంబాలు
 =23 మందికి  కాళ్లుచేతులు వంకర,
 =చెవుడు, దృష్టిలోపం
 =కొందరికి బుద్ధిమాంద్యం
 =పట్టించుకోని అధికారులు, నిర్ధారించని వైద్యులు

 
పెదబయలు, న్యూస్‌లైన్ : సాగేని చంద్రుబాబు.. సుబ్బలమ్మ.. సత్యనారాయణ.. సన్యాసమ్మ.. చిన్నమ్మ.. ప్రసాదరావు.. మినుమల భీమన్న.. వడ్డే చంద్రుబాబు.. వీళ్లంతా సామాన్య గిరిజనులు.. తమ బతుకేదో తాము బతికే మామూలు అడవి బిడ్డలు.. అంతే కాదు.. గుర్తు తెలియని వ్యాధి నలిపేస్తూ ఉంటే.. తమ పనులు తాము చేసుకోవడం సైతం కష్టమవుతున్న అభాగ్యులు.. వీళ్లు.. ఇటువంటి అనేకులు చేసిన తప్పల్లా బొర్లాడ గ్రామంలో పుట్టడమే.

ఈ నేరానికి వీళ్లు తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతున్నారు. కాళ్లు, చేతులు వంకర పోయి కదలడానికి సైతం వీలు కాక నరక యాతన అనుభవిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన వీరి వంటి మరో 14 మంది గిరిజనులు ఆరేళ్ల కాలంలో ఇలాగే బాధ పడుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే దురదృష్టమల్లా వీరు ఏ కారణం చేత బాధ పడుతున్నారో.. వేధిస్తున్న వ్యాధి జాడ ఏమిటో కనీసం తెలియజెప్పే వారు కూడా లేని నిస్సహాయ పరిస్థితిని వీరు ఎదుర్కొంటున్నారు. చికిత్స సంగతి దేవుడెరుగు.. కనీసం ఓదార్చే వారు సైతం లేని దుస్థితితో ఉసూరంటున్నారు.
 
పదిహేనేళ్లకే ప్రారంభం

ఆచూకీ తెలియని ఈ వ్యాధి లక్షణాలు ప్రశ్నార్ధకంగా ఉన్నాయి. బాల్యంలో అంతా ఆరోగ్యవంతులుగానే ఉంటున్నారు. పదిహేనేళ్లు దాటాక ఎముకల నొప్పులు, కీళ్ల బాధలు మొదలవుతున్నాయని వ్యాధిగ్రస్తులు చెబుతున్నారు. క్రమంగా కీళ్లలో వాపు వచ్చి ఎముకలు వంకర అవుతున్నాయని చెప్పారు. కీళ్ల నొప్పులతో పాటు దృష్టిలోపం, వినికిడి సమస్యలు వస్తున్నాయని తెలిపారు. కొందరికి బుద్ధి మాంద్యం కూడా ఉందని గ్రామస్తులు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. కాళ్లు చేతులు బాగా వంకైరె  చివరికి ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నడక సాధ్యం కాక పాకాల్సి వస్తోందని, అరవై ఏళ్లలోపే ఎక్కువ మంది చనిపోతున్నారని తెలిపారు.

 సందేహాలెన్నో..

 బొర్లాడలో ఉన్నవారంతా బగత కులస్తులే. ఇక్కడ అంతా మూడు కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు. దాంతో ఇది అనువంశికంగా వస్తున్న వ్యాధా? అన్న సందేహాలున్నాయి. అయితే గిరిజనులకు ఈ విషయాలేవీ తెలియవు. తమ దురదృష్టాన్ని నిందించుకుంటూ వీరు కాలం గడుపుతున్నారు. బాధితుల్లో కొందరు బుద్ధి మాంద్యంతో కూడా బాధ పడుతున్నారు. ఈ గ్రామానికి చెందిన నలుగురు ఇంటర్మీడియెట్ విద్యార్థులు 2009-10 మధ్య కాలంలో మృతి చెందారు. ఈ సమస్యపై సాక్షిలో కథనాలు రావడంతో వైద్యులు వచ్చి నీటిని, మట్టిని పరీక్షించారు.

అంతా బాగుందని చెప్పారని, తర్వాత తమ గోడు ఎవరూ పట్టించుకోలేదని గిరిజనులు ఆవేదనతో చెప్పారు. అప్పుడు కూడా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇటువైపు తొంగి చూడలేదన్నారు. బొర్లాడను ఆనుకుని ఉన్న ముక్కిపుట్టులోనూ ఆరుగురి వరకు ఈ వ్యాధితో బాధ పడుతున్నారని చెప్పారు. గిరిజన సంఘం నాయకుడు కిల్లో సురేంద్ర శనివారం గ్రామాన్ని సందర్శించి వ్యాధిగ్రస్తులను పరిశీలించారు. తక్షణమే పరీక్షలు జరిపి వైద్యం చేయించాలని కోరారు. సమస్యను కలెక్టర్‌కు, ఐటీడీఏ పీవోకు వివరిస్తామన్నారు.
 
దిగుబడి దయనీయం

 తమ గ్రామంలో వ్యవసాయం కూడా సక్రమంగా సాగడం లేదని బొర్లాడ గ్రామస్తులు చెప్పారు. కూరగాయలు, పసుపు, పిప్పళ్లు తదితర పంటలు వేటిని సాగు చేసినా దిగుబడి బాగుండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ ఊటనీరు తాగేవారమని, ఇప్పుడు గ్రావిటీ పథకం ద్వారా నీటి సరఫరా జరుగుతోందని చెప్పారు.
 
నీటి సమస్య కాదు

 సమస్యను పెదబయలు పీహెచ్‌సీ వైద్యాధికారి వంపూరు మోహన్‌రావు వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా గ్రామస్తులకు ఎముకల సమస్య ఉందని గుర్తించి నీటిని పరీక్షలకు పంపామని, ఫ్లోరీన్ శాతం సరిగానే ఉందని నిపుణులు తెలిపారని చెప్పారు. గ్రామస్తులను పూర్తి స్థాయిలో నిపుణులు పరీక్షించవలసి ఉందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement