
ఏపీ అసెంబ్లీ రద్దుపై కేంద్రం డైలమా
కేబినెట్‌లో తేలని నిర్ణయం హోంశాఖ తర్జన భర్జన
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రద్దుపై కేంద్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. గురువారం ప్రధానమంత్రి అధికారిక నివాసంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోయింది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి మన్మోహన్, న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్, రక్షణమంత్రి ఏకే ఆంటోనీ, మరో ఇద్దరు మంత్రులతోపాటు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి, అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మలు పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రత్యామ్నాయాలపై చర్చించినా తుది నిర్ణయానికి రాలేకపోయారు. కేంద్రం ఆర్టికల్ 356(1) ద్వారా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ, అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతిపాలన అమలైన తేదీ నుంచి రెండు నెలలలోపు పార్లమెంటు దానిని ఆమోదించాల్సి ఉంటుంది. అంటే మార్చి 1న విధించిన రాష్ట్రపతి పాలనకు ఏప్రిల్ 30లోగా ఆమోదం పొందాలి. కానీ ప్రస్తుతం పార్లమెంటును సమావేశపరచడం సాధ్యం కాదు. ఎంపీలంతా ఎన్నికల హడావుడిలో ఉన్నారు. ఏప్రిల్ 30 లోగా ఆమోదం పొందకుంటే, ప్రస్తుతం సుప్తచేతనావస్థలో ఉన్న అసెంబ్లీ మళ్లీ క్రియాశీలమవుతుంది. అయితే, ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదని గవర్నర్ ఇటీవలే రెండో నివేదిక ఇవ్వడంతో, కేంద్ర హోంశాఖ తర్జనభర్జన పడుతోంది. ఇందుకు రెండు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. ఒకటి.. రాష్ట్ర అసెంబ్లీని రద్దుచేయడం, లేదా రెండోసారి రాష్ట్రపతి పాలన విధిస్తూ.. అసెంబ్లీని తిరిగి సుప్తచేతనావస్థలో ఉంచడం. అయితే, అసెంబ్లీని రద్దు చేయడం వల్ల న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. గతంలో సర్కారియా కమిషన్ ఇదే విషయాన్ని తెలిపింది.
రాష్ట్రపతి పాలనకు పార్లమెంటు ఆమోదం పొందనంతవరకు అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచి తిరిగి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలే తప్ప.. రద్దు చేయడం తగదని కమిషన్ సిఫారసు చేసింది.
కాగా, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నందున అసెంబ్లీని రద్దు చేయడం వల్ల ఎవరికీ ఇబ్బందులు ఉండవని యోచిస్తోంది.
సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్ కూడా హోంశాఖకు ఇదే సలహా ఇచ్చినట్టు సమాచారం.
ఈ విషయంలో హోంశాఖ కార్యదర్శి గోస్వామిని ప్రశ్నించగా, ‘ఇంకా సమయం ఉంది. తొందరెందుకు’ అని బదులిచ్చారు.
ఏప్రిల్ 30లోపు పార్లమెంటు ఆమోదం పొందకపోతే, తిరిగి రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.