సాక్షి, అనంతపురం : ‘ఒకటే గమనం...ఒకే లక్ష్యం’ అంటూ సమైక్య సమరవీరులు కదం తొక్కుతున్నారు. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా విభజనాగ్రహంతో రగిలిపోతున్నారు. విచ్ఛిన్నకర శక్తుల పీచమణచడానికి కలసికట్టుగా ముందుకు సాగుతున్నారు. తెలుగు జాతిని విడదీస్తే ఊరుకునేది లేదంటూ సింహ‘గర్జన’ చేస్తున్నారు. ‘సమైక్య’ రాష్ట్రం తప్ప మరో ఆప్షన్ లేనేలేదంటూ ముక్తకంఠంతో చాటిచెబుతున్నారు. ఫలితంగా 63వ రోజైన మంగళవారం జిల్లాలో సమైక్య ఉద్యమం పెను తుపానులా విరుచుకుపడింది.
రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన సమైక్య ‘రణభేరి’ సభకుజిల్లా నలుమూలల నుంచి ఉద్యమకారులు తరలివచ్చారు. ఐకేపీ మహిళలు, గ్రామీణులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేలాదిగా తరలి రావడంతో జూనియర్ కళాశాల మైదానం జనసంద్రమైంది. ‘జై..సమైక్యాంధ్ర’ నినాదాలతో పట్టణం దద్దరిల్లిపోయింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన గజల్ శ్రీనివాస్ ఆలపించిన గేయాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. విశాలాంధ్ర మహాసభ నాయకుడు శ్రీనివాసరెడ్డి ప్రసంగం అందర్నీ ఆలోచింపజేసింది.
గుంతకల్లులో ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే కొట్రికె మధుసూదనగుప్తాలకు సమైక్య సెగ తగిలింది. మునిసిపల్ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టిన జేఏసీ నాయకులకు సంఘీభావం తెలిపేందుకు వారు వెళ్లగా... ‘గోబ్యాక్’ అంటూ పెద్దఎత్తున నినదించారు. జేఏసీ నాయకులు చుట్టుముట్టి.. రాజీనామాలకు డిమాండ్ చేశారు. ‘రాజీనామాలు చేసిన తరువాతే ఉద్యమంలో పాల్గొనండి. లేకపోతే బయట అడుగుపెట్టకండి’ అంటూ సూచించారు.
దీంతో చేసేది లేక ఎంపీ, ఎమ్మెల్యే అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతపురం నగరంలో నాయీ బ్రాహ్మణులు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి బ్యాండ్‌మేళాలతో ర్యాలీ నిర్వహించారు. జాక్టో ఆధ్వర్యంలో వందలాది మంది ఉపాధ్యాయులు ర్యాలీ చేశారు. సర్వజనాస్పత్రి ఎదుట వైద్య, ఆరోగ్య సిబ్బంది రిలే దీక్షలకు గజల్ శ్రీనివాస్ సంఘీభావం ప్రకటించారు. విద్యుత్ ఉద్యోగులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి.. సప్తగిరి సర్కిల్‌లో మానవహారం నిర్మించారు. రెవెన్యూ ఉద్యోగులు స్థానిక టవర్‌క్లాక్ సర్కిల్‌లో టీస్టాల్ ఏర్పాటు చేసి.. నిరసన తెలిపారు. బెస్త కులస్థులు ర్యాలీ చేశారు. రాష్ట్రం విడిపోతే మిరపకాయలు తిని బతకాల్సిందేనంటూ ఆర్ట్స్ కళాశాల బోధనా సిబ్బంది మెడలో మిరపకాయల దండలు వేసుకుని రిక్షా తొక్కుతూ నిరసన తెలిపారు. సమైక్యాంధ్రను కాంక్షిస్తూ.. వైఎస్సార్‌సీపీ డాక్టర్స్ సెల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎస్కేయూలో జేఏసీ నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. 205 జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు. ధర్మవరంలో సమైక్యవాదులు ర్యాలీ, మానవహారం చేపట్టారు. సకల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కే సీఆర్ మాస్కుధారుడికి సెలైన్‌గా విస్కీ ఎక్కించి నిరసన తెలిపారు.
ముదిగుబ్బలో మహిళలు, విద్యార్థులు జాతీయజెండాలను చేతబట్టి ర్యాలీ చేశారు. తాడిమర్రిలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో, గుంతకల్లులో నాయీబ్రాహ్మణులు ర్యాలీలు నిర్వహించారు. పామిడిలో నాయీ బ్రాహ్మణులు రోడ్డుపైనే షేవింగ్ చేస్తూ.. వంటా వార్పు చేపట్టి నిరసన తెలిపారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు చెవిలో పూలు పెట్టుకుని ర్యాలీ చేశారు. పట్టణంలోని సద్భావన సర్కిల్‌లో ఉపాధ్యాయులు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ఏపీఎన్‌జీఓలు భిక్షాటన చేశారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు రాస్తారోకో చేపట్టారు.
కదిరిలో జేఏసీ నాయకులు రోడ్డుపైనే రైతు బజార్ ఏర్పాటు చేశారు. కళ్యాణదుర్గంలోని టీ సర్కిల్‌లో మానవహారం నిర్మించి.. మోకాళ్లపై నిలబడి సమైక్య నినాదాలు చేశారు. మడకశిరలో సమైక్యవాదులు ముఖానికి ప్లాస్టిక్ కవర్లు వేసుకుని.. అర్ధనగ్నంగా రోడ్డుపై బైఠాయించారు. అమరాపురం, గోరంట్లలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తిలో ట్రాన్స్‌కో ఉద్యోగులు సబ్‌స్టేషన్‌పెకైక్కి నిరసన తెలిపారు. ఓడీచెరువులో జేఏసీ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి.. దహనం చేశారు. పెనుకొండలో హౌసింగ్ ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు.
జేఏసీ నాయకుల ర్యాలీలో తాగుతూ తూలుతున్నట్లు నడిచిన కేసీఆర్ మాస్కుధారుడు అందర్నీ ఆకట్టుకున్నాడు. రాప్తాడులో ఉపాధ్యాయులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. గేదెలకు కాంగ్రెస్ నాయకుల చిత్రపటాలను తగిలించి నిరసన తెలిపారు. కనగానపల్లిలో నాయీ బ్రాహ్మణులు ర్యాలీ నిర్వహించి... కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నార్పలలో సమైక్యవాదులు భిక్షాటన చేశారు. తాడిపత్రిలో జేఏసీ నాయకులు ఖాళీ బిందెలతో ర్యాలీ నిర్వహించారు. ఏడీసీసీ బ్యాంకు సిబ్బంది ర్యాలీ, వంటావార్పు చేపట్టారు. యాడికిలో రక్తదాతల అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఉరవకొండలో జేఏసీ ఆధ్వర్యంలో తెలుగుతల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
సమైక్యమే లక్ష్యం
Published Wed, Oct 2 2013 2:58 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement