సాక్షి, అనంతపురం : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవరకు విశ్రమించబోమని ఉద్యమకారులు స్పష్టం చేస్తున్నారు. పండుగైనా పబ్బమైనా, ఎండైనా వానైనా అలుపెరుగని పోరు కొనసాగిస్తామంటున్నారు. ఈ క్రమంలో దసరా పండుగ రోజైన ఆదివారం కూడా జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని హోరెత్తించారు. ర్యాలీలు, రాస్తారోకోలు చేపట్టడంతో పాటు రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. అనంతపురంలోని టవర్‌క్లాక్ కూడలిలో జాక్టో ఆధ్వర్యాన ఉపాధ్యాయులు వినూత్న నిరసన తెలిపారు. అలనాడు పాండవులు అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాత వాసానికి ముందు తమ ఆయుధాలను జమ్మిచెట్టుపై ఉంచి విజయదశమి నాడు వాటిని స్వీకరించిన విధానాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ముఖ్యంగా అర్జునుడు నాటి కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించిన తీరును సమైక్య పోరుకు అన్వయిస్తూ ప్రదర్శించిన తీరు అమితంగా ఆకట్టుకుంది.
ఇక నగరంలో నీటిపారుదల, హౌసింగ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఎస్కేయూలో జేఏసీ నాయకులు, ధర్మవరంలో వైఎస్సార్‌సీపీ, జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ముఖ్య భూమిక పోషించాలని, రాష్ట్ర విభజన ఆగేదాకా విశ్రమించకూడదని ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త తాడిమర్రి చంద్రశేఖరరెడ్డి పిలుపునిచ్చారు. పామిడిలో సమైక్యవాదులు మౌనదీక్ష చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పూలతో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ను ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ చేశారు. గుత్తిలో జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి.
హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. అనంతరం స్థానిక సద్భావన సర్కిల్‌లో టీ-నోట్ ప్రతులను దహనం చేశారు. రాజీవ్ సర్కిల్‌లో సప్తగిరి కళాశాల విద్యార్థులు మానవహారం నిర్మించారు. కదిరిలోని అంబేద్కర్ సర్కిల్‌లో వడ్డెర్లు ఒక్క రోజూ సామూహిక దీక్ష చేశారు. తలుపులలో సమైక్యవాదులు రోడ్డుపై గడ్డం గీయించుకుని నిరసన తెలిపారు. మడకశిరలో ఆందోళన చేపట్టారు. రాయదుర్గంలోని వినాయకసర్కిల్, పాతబస్టాండ్ ఎదుట రిలేదీక్షలు చేస్తున్న జేఏసీ నాయకులు, సమైక్యవాదులకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు.
రాష్ట్రం విడిపోతే గంజినీళ్లు తాగి బతకాల్సిందేనంటూ ఎన్‌జీఓలు రోడ్డుపై గంజి అమ్ముతూ నిరసన తెలిపారు. తాడిపత్రిలో ఉపాధ్యాయులు, ఇంజనీరింగ్ విద్యార్థుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. యాడికిలో వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు రిలేదీక్ష చేపట్టారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయకుండా.. సోనియాగాంధీకి మంచి బుద్ధి ప్రసాదించాలని ఉరవకొండలో జేఏసీ నాయకులు దుర్గామాతకు పూజలు చేశారు. బెళుగుప్పలో జేఏసీ నాయకులు డప్పులు.. సన్నాయి వాయిద్యాల నడుమ వినూత్న నిరసన తెలిపారు.
విశ్రమించం
Published Mon, Oct 14 2013 1:43 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement