గుత్తి సమీపంలోని కరిడికొండ మొదలు కొడికొండ చెక్‌పోస్టు వరకు దాదాపు 150 కిలోమీటర్లు..
హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వాహనాల నిలిపివేత.. జై సమైక్యాంధ్ర.. జై జగన్ నినాదాలు.. వాహనదారులు ఇబ్బందులు పడకుండా భోజన ఏర్పాట్లు.. మొత్తానికి అపూర్వ రీతిలో 48 గంటల పాటు రహదారుల దిగ్బంధం విజయవంతమైంది.
సాక్షి, అనంతపురం : సమైక్య రాష్ర్ట పరిరక్షణే లక్ష్యంగా ముందుకెళుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు చేపట్టిన 48 గంటల రహదారుల దిగ్బంధాన్ని రెండో రోజు గురువారం హోరెత్తించాయి. జిల్లాలోని జాతీయ రహదారులతో పాటు ప్రధాన రహదారులపై టెంట్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ బైఠాయించారు.
దర్నాలు.. వంటా-వార్పులు, సహపంక్తి భోజనాలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా పలు విధాలా నిరసన కార్యక్రమాలతో వాహనాల రాకపోకలకు అడ్డుకట్ట వేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు చండ్రనిప్పులు కక్కుతున్నా.. పార్టీ శ్రేణులు ఏమాత్రం లెక్క చేయలేదు. దిగ్బంధం కారణంగా ఆర్టీసీ బస్సులు ఆలస్యంగా నడిచాయి. రోడ్లపై నిలిచిపోయిన వాహనాల డ్రైవర్లు, క్లీనర్లు తదితరులకు పార్టీ నాయకులు టీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం సరఫరా చేశారు. దీంతో లారీలు, ట్రాక్టర్ల యజమానులు కూడా ఈ దిగ్బంధానికి మద్దతు తెలిపారు. కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
చివరకు బలవంతంగా గుంతకల్లు, కళ్యాణదుర్గం, హిందూపురం, రాయదుర్గం నియోజకవర్గాల్లో 63 మంది నాయకులను అరెస్టు చేశారు. రహదారుల దిగ్బంధం విజయవంత ం కావడంతో ప్రజల్లో సమైక్య రాష్ట్రంపై ఆశలు చిగురించాయి. అనంతపురంలో ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత బి.ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 7 గంటలకే తపోవనం వద్ద గల జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు.
కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఒక దశలో వాహనాల యజమానులు సైతం ఉద్యమంలో పాల్గొని సమైక్య నినాదాలు చేశారు. ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు రహదారులను దిగ్బంధించారు. ధర్మవరం-కుర్లపల్లి రహదారిపై వంటా-వార్పు నిర్వహించి.. సహపంక్తి భోజనం చేశారు. కొడికొండ చెక్‌పోస్టు వద్ద హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త ఇనయతుల్లా ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించారు. ఇక్కడ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
పోలీసులు వచ్చి ఆందోళనకారులను చెదరగొట్టి.. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఇదిలా ఉండగా చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా హిందూపురంలో సమన్వయకర్తలు కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, చౌళూరు రామక్రిష్ణారెడ్డి, ఇనయతుల్లాను తెల్లవారుజామునే పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ పార్టీ నేత నవీన్ నిశ్చల్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. చంద్రబాబు వెళ్లిపోయిన అనంతరం వారిని విడుదల చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రధాన రహదారులను దిగ్బంధించారు.
అనంతపురం బైపాస్‌లో నియోజకవర్గ సమన్వయకర్త ఎల్‌ఎం మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వంటా-వార్పు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేశారు. మరో సమన్వయకర్త తిప్పేస్వామి ఆధ్వర్యంలో కంబదూరు, శెట్టూరు రహదారులను దిగ్బంధించి, వంటా-వార్పు చేపట్టారు. ఈ సందర్బంగా ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, తిప్పేస్వామి, బోయ తిరుపాలుతో పాటు మరో 13 మందిని పోలీసులు అరెస్టు చేసి.. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. గుంతకల్లు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో రోడ్ల దిగ్బంధం చేపట్టారు.
గుత్తి సమీపంలోని కరిడికొండ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించిన 20 మంది నాయకులు, కార్యకర్తలను ఇన్‌చార్‌జ సీఐ మహబూబ్‌బాషా బలవంతంగా అరెస్టు చేసి.. గుత్తి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం విడుదల చేశారు. ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా రహదారుల దిగ్బంధం విజయవంతమైంది. సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వజ్రకరూరు రహదారిపై వంటా-వార్పు చేపట్టారు. విడపనకల్లులో పార్టీ కిసాన్ సెల్ కర్నూలు, అనంతపురం జిల్లాల కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో రహదారిపైనే వంటా-వార్పు నిర్వహించారు.
కూడేరులో విశ్వేశ్వరరెడ్డి తనయుడు ప్రణయ్ ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం చేశారు. కదిరిలో సమన్వయకర్తలు ఎస్‌ఎండీ ఇస్మాయిల్, మహమ్మద్ షాకీర్ ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం దిగ్విజయంగా జరిగింది. అంబేద్కర్ కూడలిలో రోడ్డుపైనే వంటా వార్పు నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. పుట్టపర్తి నియోజకవర్గంలో సమన్వయకర్త డాక్టర్ కడపల మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం విజయవంతమైంది. పెనుకొండలో సమన్వయకర్త సానిపల్లి మంగమ్మ ఆధ్వర్యంలో పాత జాతీయ రహదారిని దిగ్బంధించారు. మానవహారంగా ఏర్పడి మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు.
రాయదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రహదారుల దిగ్బంధం రెండవ రోజూ విజయవంతమైంది. డీ హీరేహాళ్‌లో రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డితో పాటు మరో 24 మందిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి..స్టేషన్‌కు త రలించారు. రాప్తాడు నియోజకవర్గ పరిధిలో పార్టీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రె డ్డి, జిల్లా కన్వీనర్ శంకరనారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన రహదారుల దిగ్బంధం విజయవంతమైంది. కనగానపల్లి మండలం మామిళ్లపల్లి జాతీయరహదారిపై వంటా-వార్పు నిర్వహించారు. తాడిపత్రి నియోజకవర్గంలో సమన్వయకర్త వి.ఆర్.రామిరెడ్డి ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం విజయవంతమైంది. శింగనమల మరువకొమ్మ వద్ద పార్టీ నాయకుడు ఆలూరు సాంబశివారెడ్డి, నార్పల రహదారిపై నాయకులు చేపట్టిన దిగ్బంధాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
ఎక్కడివక్కడే
Published Fri, Nov 8 2013 2:59 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement