అనంతపురం జిల్లా పరిషత్తు/అర్బన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర పునర్విభజన బిల్లును కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీకి పంపిన విధానానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలో పార్టీ శ్రేణులు ఆందోళనలు కొనసాగించాయి. శుక్రవారం జిల్లా బంద్‌ను విజయవంతం చేయగా రెండు రోజు శనివారం బైక్ ర్యాలీలతో సమైక్య నినాదాన్ని హోరెత్తించారు. నియోజక వర్గ, మండల కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీల్లో పార్టీ శ్రేణులు కదంతొక్కాయి.
పార్టీ జిల్లా కన్వీనర్, ముఖ్య నేతలతో పాటు నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ అనుబంధ విభాగాలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎక్కడిక్కడ బైక్ ర్యాలీలు నిర్వహించి పార్టీ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అనంతపురం నగరంలో పార్టీ నేత బి.ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో వందలాది మంది పాల్గొని సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. గుంతకల్లులో పార్టీ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీతో సందడి చేశారు. హిందూపురంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, సమన్వయకర్తలు కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, ఇనాయతుల్లా పాల్గొన్నారు.
కదిరిలో పార్టీ నేత ఎండీ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో వందలాది బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. కళ్యాణదుర్గంలో పార్టీ సమన్వయకర్త తిప్పేస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీలో సమైక్యాంధ్ర నినాదాలతో మార్మోగించారు. మడకశిర, రొళ్ల మండల కేంద్రంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తిలో పార్టీ నేత డాక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని నియోజకవర్గ సమన్వయకర్త కడపల మోహన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కొత్తచెరువులో పార్టీ శ్రేణులు గడపగడపకూ వైఎస్సార్‌సీపీ కార్యక్రమం చేపట్టాయి. పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లిలో పార్టీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి ఆధ్వర్యంలో కణేకల్లు, బ్రహ్మసముద్రం, గుమ్మఘట్ట, డీ.హీరేహాల్ మండలాల నాయకులు, కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ చేపట్టారు. కనగానపల్లిలో వైఎస్సార్‌సీపీ యూత్ విభాగం ఆధ్వర్యంలో బైక్‌లతో ర్యాలీ చేశారు. సమైకాంధ్రకు మద్దతుగా శింగనమలలో నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి, నాయకుడు ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ నేతలు పేరం నాగిరెడ్డి, మున్నా అధ్వర్యంలో విభజనకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ చేశారు. ఉరవకొండలో వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వుహాధర్నా నిర్వహించారు. పార్టీ శ్రేణులతో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోదరుడి ఆధ్వర్యంలో గడపగడపకూ వైఎస్సార్‌సీపీ కార్యక్రమం నిర్వహించారు.
బైక్ ర్యాలీ జోరు సమైక్య హోరు
Published Sun, Jan 5 2014 2:59 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement