సాక్షి ప్రతినిధి, అనంతపురం : సమైక్య జనోద్యమాన్ని నీరు గార్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం కుట్ర చేస్తోంది. ఆ బాధ్యతను మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి భుజాన వేసి ‘రాయల తెలంగాణ’ జపం చేయిస్తోంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర విభజనపై ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాల్లోనే ‘అనంత’లో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఇది సీమాంధ్రకు వ్యాపించి మహోద్యమంగా రూపాంతరం చెందింది. 109 రోజులుగా అనంతపురం జిల్లాలో ఉద్యమం జరుగుతూనే ఉంది.
ఈ క్రమంలో సమైక్య ఉద్యమాన్ని నీరుగారిస్తే పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవచ్చని భావించిన కాంగ్రెస్ అధిష్టానం.. సీమను చీల్చి అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి ‘రాయల తెలంగాణ’ ఏర్పాటు చేయాలనుకుంది. ఈ డిమాండ్ ప్రజల నుంచి వచ్చేలా చేసే బాధ్యతను అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకరరెడ్డికి, కర్నూలు జిల్లాలో రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి అప్పగించింది. దీంతో రాయల తెలంగాణకు మద్దతుగా మన జిల్లాకు చెందిన ఆ పార్టీ ప్రజాప్రతినిధుల సంతకాలు సేకరించేందుకు తొలుత జేసీ పూనుకున్నారు. అయితే ఆయనకు ఎవరూ సహకరించలేదు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం కర్నూలు నుంచి నరుక్కొచ్చింది.
ఈ క్రమంలోనే రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఆ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, లబ్బి వెంకటస్వామిలను తీసుకుని ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మన్మోహన్‌సింగ్, ఆంటోని కమిటీ, సోనియాగాంధీ ముందు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి నేతృత్వంలోని కర్నూల్ జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ‘రాయల తెలంగానం’ చేశారు. అనంతరం కోట్ల తరహాలోనే రాయల తెలంగాణకు మద్దతు సమీకరించాలని జేసీ దివాకర్‌రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి పెంచింది. అనంతరం డీసీసీ అధ్యక్షుడు కొట్రికె మధుసూదన్‌గుప్తా, మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి మద్దతు పొందిన జేసీ దివాకర్‌రెడ్డి ‘రాయల తెలంగానం’ మరింత వాడిగా విన్పించడానికి సిద్ధమయ్యారు.
రాయల తెలంగాణ డిమాండ్‌తో అనంతపురంలో భారీ ఎత్తున బహిరంగసభ నిర్వహించాలని తొలుత భావించారు. కానీ.. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా సభ నిర్వహిస్తే పరిస్థితి అదుపుతప్పే ప్రమాదం ఉందని గుర్తించిన జేసీ వెనక్కు తగ్గారు. బహిరంగసభ కాకుండా.. రాయల తెలంగాణ డిమాండ్‌తో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను డీసీసీ అధ్యక్షుడు కొట్రికెకు అప్పగించారు. జేసీ సూచనల మేరకు శనివారం అనంతపురంలో విలేకరుల సమావేశంలో ‘రాయల తెలంగాణ’ డిమాండ్‌తో ‘సేవ్ అనంతపురం’ సభ నిర్వహిస్తున్నట్లు కొట్రికెవెల్లడించగా సమైక్యవాదులు భగ్గుమన్నారు. కొట్రికెను అడ్డుకున్నారు. చివరకు పోలీసుల సహకారంతో సమైక్యవాదుల బారి నుంచి తప్పించుకున్న కొట్రికె.. ఆదివారం సమావేశం నిర్వహించి తీరుతామని ప్రకటించారు. ‘సేవ్ అనంతపురం’ పేరుతో సభ నిర్వహిస్తే పర్వాలేదు.. రాయల తెలంగాణ పేరుతో సమావేశాన్ని నిర్వహిస్తే అడ్డుకుని తీరుతామ’ని సమైక్యవాదులు హెచ్చరించారు. కాగా రాయల తెలంగాణ నినాదంపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే మండిపడుతున్నారు. మంత్రులు రఘువీరా, శైలజానాథ్, ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే సుధాకర్ రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తుండటం గమనార్హం. సమైక్యవాదుల హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం అనంతపురంలో నిర్వహించే ‘సేవ్ అనంతపురం’ సమావేశానికి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు.
రాజకీయ లబ్ధి కోసమే
రాజకీయ లబ్ధి కోసమే కొందరు రాయల తెలంగాణ నినాదం అందుకున్నారు. పదవులు.. ఆస్తుల రక్షణ కోసమే రాయల తెలంగాణ డిమాండ్‌ను కొందరు తెరపైకి తెచ్చారన్న అంశం జిల్లాలో అందరికీ తెలుసు. రాయల తెలంగాణ డిమాండ్‌ను ఎన్‌జీవోలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. మన జిల్లాకు నిజంగా న్యాయం చేయాలనుకుంటే రాయల తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టి సమైక్యాంధ్రకు కట్టుబడాలి. లేదంటే తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తాం.
-దేవరాజ్, జిల్లా అధ్యక్షుడు,
ఏపీ ఎన్‌జీవో సంఘం, అనంతపురం
సమైక్యాంధ్రే మా లక్ష్యం
సమైక్యాంధ్రప్రదేశే మా లక్ష్యం. దీనికోసమే మేం పోరాడుతున్నాం. రాష్ట్రాన్ని విడదీస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని తొలినుంచి స్పష్టీకరిస్తున్నాం. ఇప్పుడు కొందరు రాయల తెలంగాణ ప్రతిపాదన తెస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చడంలో ఇది భాగమే. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాగతించం. ప్రతిఘటిస్తాం.
- సంపత్‌కుమార్,
విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చెర్మైన్
సమైక్య ద్రోహం!
Published Sun, Nov 17 2013 3:05 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement