సాక్షి, కడప : సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు జిల్లాలో ఉద్యోగులు కదం తొక్కారు. కడప, రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు, బద్వేలులో ఉద్యోగులు ర్యాలీలు, మానవహారాలు చేపట్టారు. జాతీయ రహదారులను దిగ్బంధించారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. వైఎస్సార్ సీపీ నేతృత్వంలో సడలని సంకల్పంతో రిలే దీక్షలు సాగుతున్నాయి. సమైక్య శంఖారావం సభ సక్సెస్ కావడంతో వైఎస్సార్ సీపీ శ్రేణులతోపాటు సమైక్యవాదుల్లో కొత్త ఊపు వచ్చింది. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగుతాయని అన్ని వర్గాల ప్రజలు హెచ్చరిస్తున్నారు.
కడపలో ఎన్జీఓలు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఇర్కాన్ సర్కిల్‌లో ఉదయం జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. దీంతో వందలాది వాహనాలు ఆగిపోయాయి. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ నాయకుడు శివారెడ్డి, కన్వీనర్ శ్రీనివాసులు, ఉపాధ్యాయ నాయకులు వెంకటశివారెడ్డి, తిరుపాలు పాల్గొన్నారు. వీరికి డీఆర్వో ఈశ్వరయ్య సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ సీపీ మైనార్టీ నగర ప్రధాన కార్యదర్శి షబ్బీర్ ఆధ్వర్యంలో ఆరుగురు రిలే దీక్షల్లో కూర్చొన్నారు. కోర్టు వద్ద న్యాయవాదులు, కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేపట్టారు.
జమ్మలమడుగులో రాజీవ్ కాలనీకి చెందిన వైఎస్సార్‌సీపీ నేత సంజీవరాయుడు ఆధ్వర్యంలో 10 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రైల్వేకోడూరులో జేఏసీ చైర్మన్ ఓబులేశు నేతృత్వంలో ఉద్యోగులు రోడ్డుపైన బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వైఎస్సార్ సీపీ నేత శారదమ్మ నేతృత్వంలో ఆరుగురు రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
బద్వేలులో మహేశ్వర్‌రెడ్డి ఉన్నత పాఠశాల విద్యార్థినులు 40 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి మద్దతుగా ప్రైవేటు పాఠశాలల యూనియన్, స్కూలు విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి 89 ఆకారంలో కూర్చొన్నారు. జేఏసీ నాయకుడు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో నాలుగురోడ్ల కూడలిలో రాస్తారోకో చేపట్టారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఆర్టీసీ బస్సులు, లారీలు పెద్ద సంఖ్యలో ఆగిపోయాయి. నియోజకవర్గంలోని పోరుమామిళ్ల పట్టణంలో కృష్ణశారద కళాశాల ఇంటర్ విద్యార్థులు 15 మంది దీక్షల్లో కూర్చొన్నారు. పులివెందులలో మున్సిపల్ పరిశీలకుడు వరప్రసాద్ నేతృత్వంలో మహిళలు 60 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
రాయచోటిలో ఎన్జీఓలు భారీ ర్యాలీ నిర్వహించి నేతాజీ సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడి జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ కార్యక్రమం ఎన్జీఓ నేతలు వెంకటేశ్వరరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డితోపాటు పలువురి ఆధ్వర్యంలో కొనసాగింది. అర్చన విద్యా సంస్థల ఆధ్వర్యంలో 30 మంది విద్యార్థులు రిలే దీక్షలు చేపట్టారు. వీరికి వైస్సార్ సీపీ నేత మదన్‌మోహన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.
మైదుకూరులో సిండికేట్‌బ్యాంకు, రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు.
కమలాపురంలో వైఎస్సార్‌సీపీ నేత మెడికల్ షాప్ రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి డీసీఎంఎస్ వైస్ చైర్మన్ లక్ష్మినారాయణరెడ్డి సంఘీభావం తెలిపారు.
రాజంపేటలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎన్జీఓ నేత ఎస్వీ రమణ నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. కడప-తిరుపతి జాతీయ రహదారిపై బైఠాయించారు. ఏడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రొద్దుటూరులో న్యాయవాదులు రిలే దీక్షలు కొనసాగించారు.
దిగ్బంధం
Published Mon, Oct 28 2013 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM
Advertisement