లక్ష్యం..సమైక్యం | united agitation become severe in kurnool district | Sakshi
Sakshi News home page

లక్ష్యం..సమైక్యం

Published Fri, Feb 7 2014 4:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM

united agitation become severe in kurnool district

కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సమైక్యాంధ్ర నినాదంతో సమ్మె బాట పట్టారు. దీంతో జిల్లా కేంద్రమైన కర్నూలుతో సహా అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో ప్రభుత్వకార్యాలయాలు మూతపడ్డాయి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఉద్యోగులు ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు.
 
 కోవెలకుంట్లలో రాష్ట్ర ఎన్‌జీఓ అసోసియేషన్ జి.రామక్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో తహశీల్దారు, ఎంపీడీఓ తదితర కార్యాలయాల సిబ్బంది విధులు బహిష్కరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఆదోనిలో నియోజకవర్గ ఎన్‌జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్‌రెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రజనీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు.
 
 ఆర్‌డీఓ కార్యాలయం ఎదుట రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. డోన్ నియోజకవర్గ ఎన్‌జీఓ అసోసియేషన్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులు  కార్యాలయాల నుంచి బయటికి వచ్చి సమ్మెలో పాల్గొన్నారు.
 
 సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. నంద్యాలలో సమైక్య నినాదం హోరెత్తింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఎన్‌జీఓలు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. రాష్ట్ర విభజనను నిరశిస్తూ ఆందోళనలు చేపట్టారు. రాష్ట్ర విభజనను సీమాంధ్ర జిల్లాల ఎంపీలు, కేంద్ర మంత్రులు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమాల్లో ఎన్‌జీఓ నేతలు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఆత్మకూరు, ఎమ్మిగనూరు తదితర పట్టణాల్లోను సమైక్య సెగలు రాజుకున్నాయి. అన్ని ఉద్యోగ సంఘాల నేతలు ఏకమై ఆందోళనలు నిర్వహించారు.  కర్నూలులో ఉత్కంఠ భరితంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్.వెంగళ్‌రెడ్డి, ఎన్‌జీఓ అసోసియేషన్ కోశాధికారి పి.రామక్రిష్ణారెడ్డి, జిల్లా నేతలు శ్రీరాములు, లక్ష్మన్న, సుధాకర్‌రెడ్డి, బలరామిరెడ్డి, జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రామన్న, ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు సర్దార్ అబ్దుల్ హమీద్, అసోసియేట్ అధ్యక్షుడు మౌలాలి, ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని అన్ని శాఖల ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మెలోకి వచ్చారు.
 
 రెవెన్యూలో వీఆర్‌ఏ మొదలుకొని తహశీల్దార్ల వరకు సమ్మె బాట పట్టారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది, మునిసిపల్ ఎంప్లాయిస్, పంచాయితీరాజ్, వాణిజ్య పన్నుల శాఖ తదితర శాఖల అధికారులు కూడా విధులు బహిష్కరించి జిల్లా ఎన్‌జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనతో పాల్గొన్నారు. ఎన్‌జీఓ నేతలు కలెక్టరేట్‌లోని అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో కలియదిరిగి విధులు నిర్వహిస్తున్న వారందరినీ బయటికి తీసుకువచ్చారు. జేసీ చాంబర్ పక్కనున్న రూములో స్త్రీ శిశు సంక్షేమ శాఖకు చెందిన వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుండగా అడ్డుకున్నారు.
 
 వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న వారందరినీ బయటికి తరలించారు. కుర్చీలను నేలకేసి కొట్టారు. సమ్మె ముగిసే వరకు వీడియో కాన్ఫరెన్స్ రూము తెరిస్తే కబడ్దార్ అంటూ సిబ్బందిని హెచ్చరించారు. జిల్లా ఎన్‌జీఓ నేతల ఆందోళనలతో వీడియో కాన్ఫరెన్స్‌ను అర్ధాంతరంగా ముగించుకొని వెళ్లిపోయారు. సునయన ఆడిటోరియంలో ఈనెల 9వ తేది జరిగే టెట్ పరీక్ష సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ ఆఫీసర్లు తదితరులకు నిర్వహించిన తలపెట్టిన అవగాహన సదస్సు రసాభాసగా మారింది. డీఈఓ ఆధ్వర్యంలో టెట్ అవగాహన సదస్సును వీసీహెచ్.వెంగళ్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నేతలు అడ్డుకున్నారు. ఈసందర్భంగా కొంత ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.
 
 మేము మా స్వార్థం కోసం సమ్మె చేయడం లేదని, ప్రజా ప్రయోజనాలు ఉద్యోగ, ఉపాధి, విద్య అవకాశాల కోసం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండుతో సమ్మె చేస్తున్నామని, ఇందుకు అందరూ సహకరించాలని వెంగళ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కొంత ఉత్కంఠ తర్వాత టెట్ సమావేశానికి వచ్చిన వారందరినీ బయటికి పంపారు. సమైక్యాంధ్ర నినాదాలతో కలెక్టరేట్  మారుమోగింది. ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్ మొత్తం ఖాళీ అయింది. కలెక్టర్ కార్యాలయంతో సహా పలు ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. సమ్మె సందర్భంగా మొదటి రోజు కలెక్టరేట్‌లో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మొహరించారు. కలెక్టరేట్‌లోనికి ఎవ్వరినీ అనుమతించలేదు. విధులు బహిష్కరించిన అన్ని శాఖల ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట ఏకమై రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. జిల్లా ఎన్‌జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు వీసీహెచ్.వెంగళ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో రెవెన్యూ, పంచాయతీ రాజ్, వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ, ఆడిట్, ట్రెజరీ, సివిల్ సప్లయ్, వైద్యారోగ్య శాఖ, వాణిజ్య పన్నుల శాఖ, పబ్లిక్ సెక్టారు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమ్మె కారణంగా పరిపాలన స్తంభించిపోయింది. కాగా శుక్రవారం సమ్మె మరింత తీవ్రంగా ఉంటుందని జిల్లా సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు వెంగళ్‌రెడ్డి, కో-ఛైర్మన్ సంపత్‌కుమార్ తెలిపారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వకార్యాలయాలను ముట్టడించి పాలనను  నిలిపివేస్తామన్నారు. ఈనెల 21వ తేది వరకు జరిగే సమ్మెకు అన్ని శాఖల ఉద్యోగులు, అధికారులు సహకరించాలని కోరారు. ఈనెల 21వ  తేది వరకు రాష్ట్ర విభజనను అడ్డుకుంటే సమైక్యాంధ్ర లక్ష్య సాధన పూర్తయినట్లు అవుతుందని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement