సాక్షి, నెల్లూరు: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చేస్తున్న ఉద్యమాన్ని వైఎస్సార్‌సీపీ మరింత ఉధృతం చేసింది. జిల్లా వ్యాప్తంగా గురువారం పెద్ద ఎత్తున ఆటో ర్యాలీలు నిర్వహించింది. రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్థితిలో అంగీకరించేదిలేదంటూ ఆందోళనకు దిగింది. 10 నియోజక వర్గాలలో ర్యాలీలు జరిగాయి. పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు పెద్ద ఎత్తున పాల్గొని సమైక్య నినాదాలతో హోరెత్తించారు. గూడూరులో జరిగిన ఆటో ర్యాలీలో వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ పాల్గొన్నారు. ఎన్‌జీఓలు, ఉపాధ్యాయుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు.
నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయకర్త అనిల్‌కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో గాంధీబొమ్మ సెంటర్ నుంచి నగరంలో పెద్ద ఎత్తున ఆటో ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో గాంధీబొమ్మ కూడలిలో రిటైర్డ్ టీచర్లు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. వీఆర్‌సీ కూడలిలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలు దహనం చేశారు.
వైఎస్సార్‌సీపీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని జెండాచెట్టు సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయ సెంటర్ వరకు సుమారు వెయ్యి ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. సూళ్లూరుపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు దబ్బల రాజారెడ్డి, కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో భారీ ఎత్తున పట్టణంలో ఆటోల ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరిలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర కోసం బ్యాంకులను మూయించారు.
నారాయణ కళాశాల భవనంపై ఎక్కి ఆందోళన చేశారు. రాష్ట్రం విచ్ఛిన్నం కావడానికి టీడీపీ అధినేత చంద్రబాబే కారణమని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ అన్నారు.గూడూరులో నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.