కడప రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలనే డిమాండుతో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో గురువారం కొనసాగిన సమ్మె పాక్షికంగా జరిగింది. మునుపటి సమ్మెతో పోల్చుకుంటే ఆ వాడి, వేడి ప్రస్తుతం కనిపించలేదు. 100 రోజుల క్రితం జరిగిన సమైక్య ఉద్యమంలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులతోపాటు ప్రధానంగా ఆర్టీసీ, ఉపాధ్యాయులు పాల్గొనడంతో సమ్మె తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం తెలంగాణా బిల్లు కేంద్రం చేతుల్లోకి వెళ్లిన తరుణంలో చేపడుతున్న సమ్మెలో పూర్తి స్థాయిలో ఉద్యోగులు పాల్గొనలేదు. రెండు రోజుల్లో మిగతా ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నట్లు తెలుస్తోంది.
కడపలో...
కడపలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్, ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివారెడ్డి ఆధ్వర్యంలో సమ్మెను పర్యవేక్షించారు. ఇరిగేషన్, రెవెన్యూ, మెడికల్, ఎంఆర్‌వో, మున్సిపల్, పాత రిమ్స్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు మూత పడ్డాయి. కలెక్టరేట్‌లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉద్యోగులు సమైక్య నినాదాలు చేశారు.
రాజంపేటలో
రాజంపేటలో ఏపీ ఎన్జీఓ చైర్మన్ వెంకటరమణ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. పట్టణంలోఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్‌కుమార్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ట్రెజరీతోపాటు పలు కార్యాలయాలు పనిచేశాయి.
రైల్వేకోడూరులో
ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు పులిచెర్ల ఓబులేసు ఆధ్వర్యంలో సమ్మెను పర్యవేక్షించారు. వైఎస్సార్ సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి సిల్వర్ బెల్ట్ పాఠశాల విద్యార్థులు సంఘీభావం తెలిపి మానవహారం నిర్మించారు. కొన్ని కార్యాలయాలు మూతపడగా, మరికొన్ని కార్యాలయాలు పనిచేశాయి.
బద్వేలులో
ఎన్జీఓ నాయకుడు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. రెవెన్యూ, ఎంపీడీఓ, ట్రెజరీ కార్యాలయాలు పనిచేశాయి.
జమ్మలమడుగులో
జమ్మలమడుగు ఎన్జీఓ అధ్యక్షుడు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక్కడ దాదాపుగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో చాలావరకు కార్యాలయాలు మూతపడ్డాయి.
కమలాపురంలో
కమలాపురంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మినహా చాలా కార్యాలయాలు పనిచేశాయి. ఎర్రగుంట్లలో మున్సిపల్ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి కార్యాలయం నుంచి నాలుగురోడ్ల కూడలి వరకు ర్యాలీగా వచ్చారు. సమైక్య నినాదాలు చేశారు. కార్యక్రమంలో మేనేజర్ నరేంద్రప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా కార్యాలయాలన్నీ పనిచేయగా, సిబ్బంది మాత్రం తక్కువ సంఖ్యలో విధులకు హాజరయ్యారు.
పులివెందులలో
పులివెందులలో సమ్మె ప్రభావం కనిపించలేదు. యధావిధిగా కార్యాలయాలు పనిచేశాయి.
ప్రొద్దుటూరులో
ప్రొద్దుటూరు ఎన్జీఓ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం నుంచి పుట్టపర్తి సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ మానవహారం నిర్వహించారు. బార్ కౌన్సిల్ నాయకుడు భాస్కర్‌రావు ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
మైదుకూరులో
మైదుకూరులో ఎంపీడీఓ, వ్యవసాయశాఖ, మున్సిపల్ కార్యాలయాలు పనిచేశాయి. కొన్ని కార్యాలయాలు మూతపడగా, మరికొన్నింటిలో తక్కువ సిబ్బంది హాజరయ్యారు.
రాయచోటిలో
రాయచోటిలో రెవెన్యూ, ఆరోగ్యశాఖ వారు విధులను బహిష్కరించారు. చాలావరకు వివిధ శాఖల సిబ్బంది సమ్మెకు దూరంగా ఉన్నారు.
సమ్మె పాక్షికం
Published Fri, Feb 7 2014 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM
Advertisement