సాక్షి, కడప : జిల్లాలో ఎక్కడచూసినా సమైక్య ఉద్యమమే. ఎవరి నోట విన్నా సమైక్య నినాదమే. కేంద్రం దిగి వచ్చేవరకు పట్టువీడేది లేదంటూ ఉద్యోగులు, అధికారులు సమైక్య ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకు వెళుతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతల ఆమరణ దీక్షలు ఉద్యమానికి మరింత ఊపు తెస్తున్నాయి. 28 రోజులుగా ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యులవుతున్నారు. ఉద్యోగుల సమ్మెతో జిల్లాలో ప్రజాజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
కలెక్టరేట్ వద్ద సోమవారం వైఎస్సార్‌సీపీ కమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి తనయుడు భూపేష్‌రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు టీకే అఫ్జల్‌ఖాన్, కిశోర్‌కుమార్, సర్పంచ్ నరసింహారెడ్డి ఆమరణ దీక్ష ప్రారంభమైంది. పెద్ద ఎత్తున ఉద్యోగులు, నాయకులు, ప్రజలు తరలి వచ్చి వీరికి సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి,జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు తిరుపాల్‌రెడ్డి తదితరులు దీక్షలకు మద్దతు తెలిపారు. నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, పశుసంవర్ధకశాఖ, ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ సిబ్బంది భారీర్యాలీ నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో అర్ధనగ్నంగా భారీర్యాలీ నిర్వహించారు.
జిల్లా అధికారులు డీసీఈబీ హాలులో ఏజేసీసుదర్శన్‌రెడ్డి, డీఆర్వో ఈశ్వరయ్య ఆధ్వర్యంలో సమావేశమై ఉద్యమ కార్యచరణనురూపొందించారు. ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించాలని తీర్మానించారు. దీంతోపాటు ఈనెల 31వ తేదీన రెండు లక్షల మందితో సమైక్య గర్జన సభ నిర్వహించాలని ప్రణాళిక రచించారు. మున్సిపల్ కమిషనర్ చంద్రమౌళీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో నగరంలో కాగాడాల ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే లింగారెడ్డి, బాలకృష్ణయాదవ్ దీక్షలు నాల్గవరోజు పూర్తయ్యాయి. ఈ దీక్షలకు టీడీపీ నేతలు కాల్వ శ్రీనివాసులు, మాజీమంత్రి బ్రహ్మయ్య, పుత్తా నరసింహారెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు.
జమ్మలమడుగులో బలిజ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వంటా వార్పు చేపట్టారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. వీరికి ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి, తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి సంఘీభావం తెలిపారు. ఆర్టీపీపీ ఉద్యోగులు రోడ్లపైనే ప్రార్థనలు నిర్వహించారు.
ప్రొద్దుటూరులో గాండ్ల, తెలిక సంఘం ఆధ్వర్యంలో వంటా వార్పు, భారీ ర్యాలీ నిర్వహించారు. అర్కటవేముల గ్రామస్తులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగాయి. మెడికల్ రెప్స్ పట్టణంలో ర్యాలీ నిర్వహించి పుట్టపర్తి సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
పులివెందులలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి అరెస్టును నిరసిస్తూ బంద్ నిర్వహించారు. ఎన్జీఓలు, ఉపాధ్యాయ జేఏసీ, విద్యుత్ ఉద్యోగుల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. ఈ దీక్షలకు నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.
రాయచోటిలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర జెండాను డాక్టర్ బయారెడ్డి ఆవిష్కరించారు. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సంఘీభావం తెలియజేశారు. నియోజకవర్గంలోని పశు వైద్యులు, న్యాయవాదుల రిలే దీక్షలు కొనసాగాయి. ఆర్టీసీ కార్మికులు రోడ్లను ఊడ్చి తమ నిరసన తెలియజేశారు.అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సమైక్య జెండాను ఎగురవేశారు. జేఏసీ నాయకులు సమావేశమై ఉద్యమ కార్యచరణను రూపొందించారు.
మైదుకూరులో మధ్యాహ్నం వరకు బంద్ కొనసాగింది. ఉపాధ్యాయులు, అన్నలూరు గ్రామ ప్రజలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. పట్టణంలో అన్ని వర్గాల వారు భారీ ర్యాలీ నిర్వహించారు.మానవహారంగా ఏర్పడ్డారు. బంద్ పాటించడంతో వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.
రైల్వేకోడూరులో ఉపాధ్యాయులు, మెడికల్ సిబ్బంది దీక్షలు కొనసాగాయి.
రాజంపేటలో రెవెన్యూ, న్యాయవాదుల రిలే దీక్షలు సాగాయి. సాయంత్రం న్యాయవాదులు కాగడాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు.
ఉవ్వెత్తున ఉద్యమం
Published Tue, Aug 27 2013 6:10 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement