సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉప్పెనలా ఉప్పొంగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమ ఘోష వారి చెవులకు ఎక్కలేదు... బతుకు కోసం, భవిత కోసం తమ ప్రాంతీయులు రోడ్డుపైకి వచ్చినా వారు చలించలేదు... సమైక్యాంధ్ర కోసం ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయాలన్న ఎన్జీఓల అల్టిమేటంను వారు పట్టించుకోనేలేదు.. ‘పదవే పరమార్థం... ప్రజలు కాదు’ అన్నట్లుగా ఉంది కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ తీరు.
ఉద్యమ సెగతో...
రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్జీఓలు ఉద్యమపథంలోకి అడుగుపెట్టారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తేనే సమైక్యాంధ్ర సాధ్యమని స్పష్టం చేశారు. అందుకే రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా అందరూ రాజీనామాలు చేయాలని కోరారు. రాష్ట్ర విభజన సన్నాహాలను ముందుగానే గుర్తించిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేశారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మొదటగా రాజీనామా చేశారు. అదే స్ఫూర్తితో సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ నెల 12లోపు రాజీనామా చేయాలని ఎన్జీఓలు అల్టిమేటం జారీ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమభేరి మోగించారు. రాజీనామాలు చేయని ఎమ్మెల్యేల నివాసాలను ముట్టడించారు.
జిల్లాకు చెందిన కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు రాజీనామాల బాటపట్టారు. ఉగ్రనరసింహారెడ్డి ముందుగా రాజీనామా చేశారు. జేఏసీ నేతలు ఇళ్లముట్టడికి సిద్ధపడటంతో రాష్ట్ర మంత్రి మహీధర్‌రెడ్డి తన పదవిని వదులుకుంటున్నట్టు ప్రకటించారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కూడా రాజీనామా చేశారు. ఉద్యోగ, విద్యార్థి జేఏసీలు ఇళ్లను ముట్టడించిన తరువాతే కాంగ్రెస్ ఎంపీ మాగుంట, ఎమ్మెల్యేలు జీవీ శేషు, ఆదిమూలపు సురేష్, అన్నా రాంబాబు, టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిల్లోనూ కదలిక వచ్చింది. దాంతో వారు రాజీనామాలు చేశారు. కానీ ఇద్దరు నేతల తీరు మాత్రం సమైక్యాంధ్ర స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది.
రాజీనామాకు నో...
జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌లు రాజీనామాలకు ససేమిరా అంటున్నారు. సమైక్యాంధ్రను పరిరక్షించుకోవాలంటే రాజీనామాలు చేయాలన్న ఎన్జీఓల అల్టిమేటంను వారిద్దరూ పట్టించుకోలేదు. రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను పనబాక లక్ష్మి నిర్ద్వంద్వంగా తిరస్కరించడం గమనార్హం. సోనియాగాంధీ ఎక్కడ ఆగ్రహిస్తుందోనని ఆమె కంగారు పడుతున్నట్టుగా ఉంది. అంతేగానీ తమ ప్రాంత ప్రజల మనోభావాలను ఆమె ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అందుకే పూర్తిగా ఢిల్లీకి పరిమితమైపోయారు. నియోజకవర్గంలో తీవ్రస్థాయిలో ఎగసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం గురించి కొందరు సన్నిహితులు పనబాక లక్ష్మి దృష్టికి తీసుకువెళ్లారు. కానీ తాను రాజీనామా చేయనని ఆమె కచ్చితంగా చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే తాము ఆమె అనుచరులుగా నియోజకవర్గంలో తిరగలేమని ఆ నేతలు మథనపడుతున్నారు.
ఇక తమదారి తాము చూసుకుంటామని చెబుతున్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్‌కుమార్ తీరూ అలాగే ఉంది. రాజీనామా చేయాలన్న ఎన్జీఓల అల్టిమేటంను ఆయన తేలిగ్గా తీసుకున్నారు. అందుకే ఇంతవరకు రాజీనామా చేయలేదు. కొన్ని రోజుల క్రితం విద్యార్థి జేఏసీ ఎమ్మెల్యే విజయ్‌కుమార్ నివాసాన్ని ముట్టడించింది. రాజీనామా చేయాలని కోరింది. కానీ అందుకు ఆయన ససేమిరా అన్నారు. తరువాత ఎన్జీఓలు ఇచ్చిన అల్టిమేటంపైనా ఆయన ఇంత వరకు స్పందించ లేదు.
ఎన్జీఓల ఆగ్రహం
రాజీనామాలపై పనబాక లక్ష్మి, విజయ్‌కుమార్‌లు సానుకూలంగా స్పందించకపోవడంపై ఎన్జీఓలు మండిపడుతున్నారు. భావితరాల భవిత కోసం పదవులకు రాజీనామా చేయలేరా అని ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 12 వరకు వేచి చూస్తామని, అప్పటికీ రాజీనామా చేయకపోతే 12 అర్థరాత్రి నుంచి చేపట్టే సమ్మె తీవ్రతను వారిద్దరూ చవిచూడాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. పనబాక లక్ష్మి, విజయ్‌కుమార్‌లే లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెబుతున్నారు. మరి ఇప్పటికైనా పనబాక, విజయ్‌కుమార్‌లు స్పందిస్తారో లేదో... చూడాల్సిందే.
హోరెత్తిన సమైక్య నిరసనలు
Published Sat, Aug 10 2013 4:19 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM
Advertisement
Advertisement