ఒంగోలు, న్యూస్‌లైన్: సమైక్య నిరసన జ్వాలలు రోజురోజుకూ రగులుతున్నాయి. ఆదివారం సెలవు అయినా..ఉద్యమం ఊపు తగ్గలేదు. పర్చూరులో గొట్టిపాటి భరత్, మరో ముగ్గురు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజూ కొనసాగింది. ఆర్యవైశ్య సంఘ నాయకులు పర్చూరులో భారీగా ర్యాలీ నిర్వహించి రాష్ట్ర విచ్ఛిన్నాన్ని నిరసిస్తూ సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఒంగోలులో వైఎస్సార్ సీపీ మండల నాయకులు చేపట్టిన రిలే దీక్షను జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకులు పదవుల కోసం రాష్ట్ర సమగ్రతకు ముప్పు వాటిల్లుతున్నా మౌనంగా ఉంటున్నారని, అటువంటి వారికి బుద్ధిచెప్పేందుకు ప్రజలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. మరో వైపు జిల్లా కోర్టు వద్ద పసుపులేటి వెంకటేశ్వరరావు, ఎం.కృష్ణారావు, పీ.నాగేశ్వరరావు అనే న్యాయవాదులు రిలే దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పైనీడి సుబ్బారావు మాట్లాడుతూ ఈనెల 17వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులంతా విధులకు గైర్హాజరు కావాలని తీర్మానించారన్నారు. 17వ తేదీ తరువాత రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ, విద్యార్థి, కార్మిక జేఏసీలతో కలిసి పోరాటం ఉధృతం చేయనున్నట్లు ప్రకటించారు.
కనిగిరిలో వైఎస్సార్ సీపీ నాయకుడు రాజాల ఆదిరెడ్డి ఆదివారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయం ముందు చేపట్టిన ఈ దీక్షను కనిగిరి నియోజకవర్గ కోఆర్డినేటర్ ముక్కు కాశిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమానికి అండగా వైఎస్సార్ సీపీ మాత్రమే ముందుకు వచ్చిందన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మలు సైతం తమ పదవులను తృణప్రాయంగా భావించి రాజీనామాలు చేశారన్నారు. కానీ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల ప్రజాప్రతినిధులు రాజీనామాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని వారికి బుద్ధి చెప్పేందుకు జనం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
మరో వైపు విద్యార్థులంతా భారీగా నిరసన ప్రదర్శన నిర్వహించి మానవహారం చేశారు. హనుమంతునిపాడులో ప్రజలే స్వచ్ఛందంగా గ్రామంలో రాష్ట్ర విభజనను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించడం గమనార్హం. అద్దంకి నియోజకవర్గంలోని జర్నలిస్టులంతా ఒక జేఏసీగా ఏర్పడి అద్దంకి బస్టాండు సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. జే.పంగులూరులో బస్టాండు సెంటర్ వద్ద అంబేద్కర్ యూత్‌ఫోర్సు మానవహారం నిర్వహించింది. ఈ సందర్భంగా కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చే శారు. కంభంలో ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి కందులాపురం సెంటర్‌లో ధర్నా నిర్వహించారు.
రగులుతున్న నిరసన జ్వాలలు
Published Mon, Aug 12 2013 2:55 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM
Advertisement
Advertisement